Telugu Global
Andhra Pradesh

నందమూరి కుటుంబం ఆదుకుంటుందా?

పార్టీ ఎప్పుడు కష్టాల్లోప‌డినా చంద్రబాబుకు ముందుగా గుర్తుకొచ్చేది పార్టీ వ్యవస్ధాపకుడు నందమూరి తారక రామారావు మాత్రమే. అందుకనే వచ్చే ఎన్నికల్లో నందమూరి వార‌సుల‌ను పోటీ చేయించే అవకాశాలను పరిశీలిస్తున్నారు.

నందమూరి కుటుంబం ఆదుకుంటుందా?
X

ఇప్పుడిదే విషయం ఇటు నందమూరి అభిమానులు అటు నారావారి మద్దతుదారులకు అర్ధంకాని ప్రశ్నగా తయారైంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవకపోతే తెలంగాణలో లాగే ఏపీలో కూడా పార్టీకి ఎక్సపైరీ డేట్ అయిపోయినట్లే భావించాలి. 2024 ఎన్నికల తర్వాత పార్టీ ఉందంటే ఉందన్నట్లుగా తయారైపోవటం ఖాయం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బాధంతా తన గురించి కాదు కేవలం కొడుకు లోకేష్ విషయంలోనే. అందుకనే వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు.

పార్టీ ఎప్పుడు కష్టాల్లోప‌డినా చంద్రబాబుకు ముందుగా గుర్తుకొచ్చేది పార్టీ వ్యవస్ధాపకుడు నందమూరి తారక రామారావు మాత్రమే. అందుకనే వచ్చే ఎన్నికల్లో కూడా నందమూరి కుటుంబాన్ని పూర్తిగా వాడేసుకోవాలని డిసైడ్ అయినట్లు ప్రచారం పెరిగిపోతోంది. ఇక్కడ పూర్తిగా వాడేసుకోవటం అంటే ఏకంగా కొత్తగా ఇద్దరిని ఎన్నికల్లో దింపాలని అనుకుంటున్నారట. చంద్రబాబు ఉద్దేశం ఏమిటంటే నందమూరి కుటుంబాన్ని ఎన్నికల్లో దింపితే జనాలు వారిని గెలిపించటమే కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడా టీడీపీని గెలిపిస్తారని.

ఇప్పటికే హిందుపురం నియోజ‌వ‌ర్గానికి ఎన్టీయార్ కుమారుడు నందమూరి బాలయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. బాలయ్య కాకుండా రేపటి ఎన్నికల్లో గుడివాడలో ఎన్టీయార్ మనవడు చైతన్య కృష్ణను పోటీ చేయించే అవకాశాలను పరిశీలిస్తున్నారట. జనాలు గుడివాడలో తాతను గెలిపిచింనట్లే మనవడిని కూడా గెలిపిస్తారని చంద్రబాబు అనుకుంటున్నారేమో. ఇదే సమయంలో నియోజకవర్గం ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరరావు, వెనిగండ్ల రాము అనే ఎన్ఆర్ఐ కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.

చైతన్యే కాకుండా నందమూరి తారకరత్న కూడా పోటీకి రెడీ అవుతున్నారట. అయితే తారకరత్న ఎక్కడి నుండి పోటీ చేయాలని అనుకుంటున్నారో తెలీదు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం వచ్చే ఎన్నికల్లో నందమూరి వారసులు ముగ్గురు పోటీ చేసే అవకాశాలున్నాయి. నందమూరి వారసులు పోటీ చేసినంత మాత్రాన పార్టీకి ప్లస్ అవుతుందని చంద్రబాబు ఎలా అనుకుంటున్నారో అర్ధం కావటం లేదు. ఏదేమైనా కష్టాల్లో ఉన్న పార్టీని గట్టెక్కించాలంటే తన వల్ల కాదని నందమూరి కుటుంబానికే సాధ్యమవుతుందని చంద్రబాబు అంగీకరించినట్లేనా?

First Published:  17 Dec 2022 6:34 AM GMT
Next Story