Telugu Global
Andhra Pradesh

ప్రతిపక్షమంటే ప్రతిదీ వ్యతిరేకించటమేనా?

ప్రతిపక్ష నేతల యాత్రలను, బహిరంగసభలను వద్దని ప్రభుత్వం చెప్పలేదు. అయితే చంద్రబాబు, పవన్, సీపీఐ రామకృష్ణ మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. తమ యాత్రలను నియంత్రించటానికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటు నానా గోల చేస్తున్నారు.

ప్రతిపక్షమంటే ప్రతిదీ వ్యతిరేకించటమేనా?
X

ప్రతిపక్షమంటే నిర్వచనమే మారిపోయింది. పరిపాలనలో మంచి చెడులను విశ్లేషించి, ప్రభుత్వం చేస్తున్న తప్పొప్పులను వివరించటమే ప్రతిపక్షాలపని. ప్రభుత్వ నిర్ణయాల్లో మంచుంటే సమర్ధించటం లేకపోతే విమర్శించటం, తప్పులను ఎత్తిచూపటమే బాధ్యతగా ఒకపుడు ప్రతిపక్షాలు ఫీలయ్యేవి. కానీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో మంచి చెడులతో సంబంధం లేకుండా ప్రతి నిర్ణయాన్ని తప్పుపట్టడం, రచ్చచేస్తు ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకించేదాన్నే ప్రతిపక్షమని అనుకోవాల్సొస్తోంది.

ఇందుకు తాజా ఉదాహరణ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులపై జరుగుతున్న రాద్ధాంతం. రోడ్లపై సభలు, ర్యాలీలను ప్రభుత్వం నియంత్రించాలని అనుకున్నది. అందుకనే వీటిని నిషేధిస్తు ఉత్తర్వులు జారీచేసింది. అసలు ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్లు ? ఎందుకంటే చంద్రబాబునాయుడు సభల్లో నాలుగు రోజుల వ్యవధిలో 11 మంది చనిపోయారు కాబట్టే. ఎక్కడైనా సభలు లేదా రోడ్డు షోలు, ర్యాలీలు నిర్వహించేటపుడు అందులో పాల్గొనే వాళ్ళకు ఎలాంటి సమస్యలు రాకుండా బాధ్యత తీసుకోవాల్సింది రాజకీయ పార్టీలే. లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు కూడా చర్యలు తీసుకుంటారు.

కానీ ఈ విషయాన్ని టీడీపీ పూర్తిగా గాలికొదిలేసింది. జనాలంతా చంద్రబాబు సభలకు పోటెత్తుతున్నారని చెప్పుకోవటం కోసమే ఇరుకు సందుల్లో జనాలను తరలిస్తున్నారు. కానుకల పేరుతో జనాలను రప్పించి మోసం చేస్తున్నారు. చిన్న గ్రౌండ్లలో కూడా కెపాసిటీకి మించి జనాలను తరలిస్తున్నారు. దాంతో తొక్కిసలాటలు జరిగి జనాలు చనిపోతున్నారు. దీని నియంత్రించటం కోసం ప్రభుత్వం రోడ్లపై సభలు, ర్యాలీలను నిషేధించింది.

ప్రతిపక్ష నేతల యాత్రలను, బహిరంగసభలను వద్దని ప్రభుత్వం చెప్పలేదు. అయితే చంద్రబాబు, పవన్, సీపీఐ రామకృష్ణ మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. తమ యాత్రలను నియంత్రించటానికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటు నానా గోల చేస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ ఎంపీ జీవిఎల్ నరసింహారావు, జేడీ లక్ష్మీనారాయణ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటానికి కారణం ఏమిటనే విషయాన్ని విశ్లేషించుకోవాల్సిన టీడీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతుండటమే ఆశ్చర్యంగా ఉంది. ప్రభుత్వ నిర్ణయంపై మామూలు జనాలు హ్యాపీగా ఉన్నారు.

First Published:  4 Jan 2023 6:25 AM GMT
Next Story