Telugu Global
Andhra Pradesh

గంటాకు బలవంతంగా ‘గంట’ కడుతున్నారా..?

రాబోయే ఎన్నికల్లో గంటా ఎక్కడ పోటీచేయాలి అన్నది పెద్ద సమస్యగా మారింది. అందుకనే చంద్రబాబునాయుడు అన్నీ ఆలోచించి గంటాను విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీకి పోటీచేయమని ఆదేశించారట.

గంటాకు బలవంతంగా ‘గంట’ కడుతున్నారా..?
X

పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తే అలాగే అనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీచేయటానికి అసెంబ్లీ సీటు లేదట. అందుకనే గంటాను బలవంతంగా విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గంలో పోటీచేయిస్తున్నట్లు సమాచారం. మొదటినుండి గంటాకు ఒక స్టైల్ ఉంది. అదేమిటంటే.. పోటీచేసిన నియోజకవర్గంలో రెండోసారి మళ్ళీ పోటీచేయరు. ఇప్పటివరకు పోటీచేసిన ఐదు ఎన్నికల్లో గంటా తీరు ఇదే. పోటీచేయటం ఒక ఎత్తయితే అన్నీ ఎన్నికల్లోనూ గెలవటం మరోఎత్తు.

మొదటిసారిగా 1999లో గంటా అనకాపల్లి ఎంపీగా పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత 2004లో చోడవరం అసెంబ్లీ, 2009లో అనకాపల్లి అసెంబ్లీ, 2014లో భీమిలి, 2019లో విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం నుండి పోటీచేసి గెలిచారు. రాబోయే ఎన్నికల్లో విశాఖ ఉత్తరం నుండి లోకేష్ తోడల్లుడు భరత్ పోటీచేసే అవకాశాలున్నాయి. అందుకనే గంటాకు పోటీచేయటానికి నియోజకవర్గంలేదు. ఎందుకంటే భీమిలీ, నెల్లిమర్ల లాంటి నియోజకవర్గాల నుండి పోటీచేయాలని గంటా అనుకున్నా.. ఆ సీట్లను పొత్తులో జనసేన, బీజేపీకి ఇచ్చేయబోతున్నారట.

రాబోయే ఎన్నికల్లో గంటా ఎక్కడ పోటీచేయాలి అన్నది పెద్ద సమస్యగా మారింది. అందుకనే చంద్రబాబునాయుడు అన్నీ ఆలోచించి గంటాను విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీకి పోటీచేయమని ఆదేశించారట. ప్రస్తుతం ఇక్కడి నుండి మంత్రి బొత్సా సత్యానారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బొత్సా కుటుంబం విజయనగరం జిల్లాలో చాలా బలమైన కుటుంబమని అందరికీ తెలిసిందే. తమ్ముళ్ళు, మేనల్లుళ్ళు వేరే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. బొత్సా భార్య ఝాన్సీ రాబోయే ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీగా పోటీచేయొచ్చంటున్నారు.

ఏ రకంగా చూసుకున్నా బొత్సా చాలా స్ట్రాంగ్ నేతనే చెప్పాలి. అందుకనే ఇక్కడ నుండి గంటాను పోటీచేయించాలని చంద్రబాబు గట్టిగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. గంటా అయితే ఆర్థికంగా, సామాజికపరంగా బొత్సాను ఢీ కొనగలరని చంద్రబాబు అనుకున్నారట. అయితే చీపురుపల్లిలో పోటీచేయటానికి గంటా వెనకాడుతున్నట్లు సమాచారం. వేరే నియోజకవర్గంలో పోటీచేస్తానని గంటా చెప్పినా చంద్రబాబు మాత్రం బొత్సాకు వ్యతిరేకంగా పోటీచేయాల్సిందే అని గట్టిగా చెప్పినట్లు పార్టీవర్గాల టాక్. మరి గంటా ఏమిచేస్తారు..? గెలుపు ఎవరిదో చూడాల్సిందే.

First Published:  22 Feb 2024 5:09 AM GMT
Next Story