Telugu Global
Andhra Pradesh

ఎఆర్‌ కానిస్టేబుల్ ఉద్యోగం తొల‌గింపుపై సీబీఐ విచార‌ణ జ‌ర‌పాలి

సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి ప్ర‌తిప‌క్ష‌నేత చంద్ర‌బాబు లేఖ

ఎఆర్‌ కానిస్టేబుల్ ఉద్యోగం తొల‌గింపుపై సీబీఐ విచార‌ణ జ‌ర‌పాలి
X

అనంతపురం జిల్లాకి చెందిన‌ ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్‌ని ఉద్యోగం నుంచి తొల‌గించ‌డం వెనుక కుతంత్రాల‌పై సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని కోరుతూ ప్ర‌తిప‌క్ష‌నేత చంద్ర‌బాబు సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి లేఖ రాశారు. పోలీసుల‌కి రావాల్సిన బకాయిలపై ప్రజాస్వామ్యబద్దంగా ప్లకార్డు పట్టుకుని సమస్యను మీ దృష్టికి తీసుకొచ్చినందుకు సహృదయంతో అర్థం చేసుకుని సమస్యను పరిష్కరించకపోగా... అక్రమ కేసులు పెట్టి ప్రకాష్‌ను వేధించారు.

ఉద్యోగులకు రావాల్సిన బకాయిల విడుదల కోరినందుకు... సంబంధం లేని కేసులో ఇరికించి సర్వీస్‌ నుంచి డిస్మిస్‌ చేశారు. బాధితురాలిగా చెప్పబడుతున్న మహిళ శ్రీలక్ష్మి మీడియా ముందుకు వచ్చి, ప్రకాష్‌పై నమోదు చేసినది తప్పుడు కేసు అని, ప్రకాష్‌ తనను వేధించలేదని పేర్కొన్నారు. పైగా స్పందన కార్యక్రమంలో తన ఫిర్యాదు విషయంలో ప్రకాష్‌ తనకు సహకారం అందించారని కూడా స్పష్టం చేశారు. తద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించారనే కారణంగానే ప్రకాష్‌ పై కక్షగట్టి విధుల నుంచి తొలగించారన్నది తేలుతోంది.

ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, అహంకారపూరితంగా వ్యవహరించి ప్రకాష్‌ను బాధితుడిని చేశార‌ని లేఖ‌లో ఆరోపించారు. తనను అక్ర‌మ కేసుల్లో ఇరికించి, కుట్ర‌పూరితంగా ఉద్యోగం నుంచి తొల‌గించార‌ని ఏఆర్‌ కానిస్టేబుల్‌ ప్రకాష్‌ ఫిర్యాదుతో జిల్లా ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప కాగినెల్లి, ఏ.ఆర్‌ అదనపు ఎస్పీ ఏ.హనుమంతు , సిసిఎస్‌ డీఎస్పీ ఎస్‌ మహబూబ్‌ బాషాల‌పై అనంతపురం టూటౌన్‌ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంద‌ని తెలిపారు. ఏఆర్‌ కానిస్టేబుల్‌ ప్రకాష్‌ ఫిర్యాదులో నిందితులుగా ఉన్న ముగ్గురు అధికారులు ప్రస్తుతం అదే జిల్లాలో కీలకమైన, ఉన్నతమైన స్థానాల్లో ఉండ‌డంతో కేసు విచార‌ణ‌ని ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఉంద‌ని అనుమానం వ్య‌క్తం చేశారు. ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న అధికారుల‌ను వీఆర్‌లో ఉంచి సీబీఐతో దర్యాప్తు జరపాలి అని ఆ లేఖ‌లో చంద్ర‌బాబు డిమాండ్ చేశారు.

First Published:  1 Sep 2022 12:44 PM GMT
Next Story