Telugu Global
Andhra Pradesh

వాలంటీర్లకు నెలకు రూ.30వేల నుంచి రూ.50వేలు

వాలంటీర్లకు రూ.5 వేలు ఇవ్వడం కూడా దండగ అంటూ నిన్న మొన్నటిదాకా చెప్పిన చంద్రబాబు.. ఈరోజు ఏకంగా వారి సంపాదన నెలకు రూ.30వేల నుంచి రూ.50వేలు పెరిగేలా చేస్తానని మాటిచ్చారు.

వాలంటీర్లకు నెలకు రూ.30వేల నుంచి రూ.50వేలు
X

రెండురోజుల పర్యటనకోసం కుప్పం వెళ్లిన చంద్రబాబు అక్కడ మహిళలు, యువతకు అరచేతిలో వైకుంఠం చూపెట్టారు. మహిళల ఆదాయం మూడు రెట్లు చేస్తానంటూ చెప్పుకొచ్చిన బాబు, సాయంత్రం యువతతో సమావేశమయ్యారు. మరోసారి తన మాటల్ని కోటలు దాటించేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 60రోజుల్లోనే మెగా డీఎస్సీ వేస్తానంటూ ఊరించారు. మీరెప్పుడూ ఊహించని స్థాయిలో మెగా డీఎస్సీ పోస్ట్ లు ఉంటాయని ఊదరగొట్టారు బాబు. తన హయాంలో టీచర్ పోస్ట్ లు భర్తీ చేయకుండా ఉన్నవారిపై పనిభారం పెంచి, కొత్త పనులు అప్పగించి నానా రకాలుగా హింసించిన బాబు.. ఇప్పుడు మెగా డీఎస్సీ అని చెప్పడం హాస్యాస్పదం అనే విమర్శలు వినపడుతున్నాయి.



నాలెడ్జ్‌ ఎకానమీలో తెలుగు యువత అగ్రస్థానంలో ఉండాలనేదే తన కోరిక అని అన్నారు చంద్రబాబు. గతంలో ఐటీని ప్రోత్సహించి యువతకు కొత్త దారి చూపించింది తానేనన్నారు. భవిష్యత్తులో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానం తీసుకొస్తానని చెప్పారు. అన్ని మండల కేంద్రాల్లో వర్క్‌ స్టేషన్లు నిర్మిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక విజన్‌ తయారు చేస్తానని డప్పు కొట్టారు. ఏపీపీఎస్సీని ప్రక్షాళణ చేస్తానని చెప్పారు చంద్రబాబు. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని కొత్తగా చంద్రబాబు తీసుకు రావడం ఏంటా అని యువత తల పట్టుకుంది.

హైలైట్ కామెడీ..

వాలంటీర్లకు రూ.5 వేలు ఇవ్వడం కూడా దండగ అంటూ నిన్న మొన్నటిదాకా చెప్పిన చంద్రబాబు.. ఈరోజు ఏకంగా వారి సంపాదన నెలకు రూ.30వేల నుంచి రూ.50వేలు పెరిగేలా చేస్తానని మాటిచ్చారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా వాలంటీర్ల జీవితాలు మారుస్తానన్నారు. కుప్పం పర్యటనకు వెళ్లిన చంద్రబాబు ఇప్పటి వరకు తాను ఏం చేశాననేది చెప్పుకోలేకపోయినా.. కోతలు భారీగా కోశారు. అయితే చంద్రబాబు హామీల విషయం తెలిసిన వారెవరూ ఆయన మాటల్ని సీరియస్ గా తీసుకోరనేది మాత్రం వాస్తవం.

First Published:  26 March 2024 1:44 PM GMT
Next Story