Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు విచిత్రమైన హామీ.. గెలుపు నమ్మకంలేదా..?

35 ఏళ్ల ఎమ్మెల్యే జీవితంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళున్నారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కుప్పంను ఏ స్థాయిలో డెవలప్ చేసుండాలి..?

చంద్రబాబు విచిత్రమైన హామీ.. గెలుపు నమ్మకంలేదా..?
X

మూడురోజుల కుప్పం నియోజకవర్గ పర్యటనలో చంద్రబాబునాయుడు విచిత్రమైన హామీ ఇచ్చారు. గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని అందరు చెప్పేమాటే. అదే మాటను తాజాగా చంద్రబాబు కూడా చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తనను కుప్పంలో గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. చంద్రబాబు ప్రకటనతో అందరు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. గెలిపిస్తే అభివృద్ధిచేస్తానని ఎవరైనా చెప్పచ్చు కానీ చంద్రబాబు చెప్పకూడదు. ఎందుకంటే గడచిన 35 ఏళ్ళుగా కుప్పం నుంచి చంద్రబాబే ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు.

నియోజకవర్గాన్ని అభివృద్ధిచేస్తారనే కదా జనాలు ఏడుసార్లుగా చంద్రబాబును గెలిపిస్తున్నది. 35 ఏళ్ళుగా కుప్పంలో అప్రతిహతంగా గెలుస్తున్న చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని చెప్పటంలో అర్థంలేదు. గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని అన్నారంటే.. ఇన్ని సంవత్సరాల్లో చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏమీలేదన్న విషయం అర్థ‌మవుతోంది. ఈ విషయాన్నే వైసీపీ నేతలు పదేపదే ఆరోపిస్తున్నది. కుప్పం నుంచి చంద్రబాబు 35 ఏళ్ళుగా ప్రాతినిధ్యం వహిస్తున్నా.. ఏమీ అభివృద్ధి చేయలేదని మండిపడుతున్నారు. వైసీపీ చేస్తున్న ఆరోపణలు నిజమే అన్నట్లుగా ఉంది చంద్రబాబు తాజా ప్రకటన.

35 ఏళ్ల ఎమ్మెల్యే జీవితంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళున్నారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కుప్పంను ఏ స్థాయిలో డెవలప్ చేసుండాలి..? ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళంతా మిగిలిన రాష్ట్రాన్ని వదిలేసినా తమ జిల్లాను ప్రత్యేకించి తమ నియోజకవర్గాన్ని బాగానే డెవలప్ చేసుకున్నారు. ఒక్క చంద్రబాబు మాత్రమే కుప్పంను గాలికొదిలేశారని అర్థ‌మవుతోంది. రాబోయే ఎన్నికల్లో తనను గెలిపిస్తే కుప్పంను ప్రపంచంతో అనుసంధానిస్తానని చెప్పారు. కుప్పంలో కూరగాయలు పండించి విదేశాల్లో అమ్మేందుకు ప్రత్యేకంగా విమానాలను వేయిస్తానని హామీలివ్వటమే విచిత్రంగా ఉంది.

కుప్పంను ప్రపంచ దేశాలతో అనుసంధానం చేయటం ఏమిటి..? కూరగాయలు అమ్ముకునేందుకు ప్రత్యేకంగా విమానాలు వేయించటం ఏమిటో అర్థంకావటంలేదు. తనను తాను ప్రపంచమేథావిగా చెప్పుకునే చంద్రబాబేనా ఇలాంటి హామీలిస్తున్నదనే చర్చ జనాల్లో పెరిగిపోతోంది. ఒకప్పుడు కుప్పంలో అమలుచేసిన ఇజ్రాయెల్ ప్రాజెక్టు కూడా కూరగాయలు, ఆకుకూరలు విదేశాల్లో అమ్మేందుకే. మరా ప్రాజెక్టు ఏమైందో చంద్రబాబే చెబితే బాగుంటుంది.

First Published:  31 Dec 2023 4:34 AM GMT
Next Story