Telugu Global
Andhra Pradesh

లోకేష్ మీద నమ్మకం లేదా?

చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేకంగా కమిటీని నియమించారు. కమిటీలో 14 మంది నేతలు ఉండ‌గా, లోకేష్ పేరు 14వ స్థానంలో ఉండటమే ఆశ్చర్యంగా ఉంది.

లోకేష్ మీద నమ్మకం లేదా?
X

లోకేష్ నాయకత్వం మీద చంద్రబాబునాయుడు నమ్మకం కోల్పోయారా? పార్టీలో ఇప్పుడు ఇదే అంశంపై చర్చ జోరుగా జరుగుతోంది. దీనికి కారణం ఏమిటంటే చంద్రబాబు ఆదేశాల ప్రకారం టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీని నియమించినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఈ కమిటీలో 14 మంది నేతలున్నారు. నేతల జాబితాలో చూస్తే 14వ పేరు నారా లోకేష్‌ది. యనమల రామకృష్ణుడు, కింజరాపు అచ్చెన్నాయుడు, చింతకాయల అయ్యన్నపాత్రడు, ఎండీ షరీఫ్, పయ్యావుల కేశవ్, నందమూరి బాలకృష్ణ, నిమ్మల రామానాయుడు, నక్కా ఆనందబాబు, కాలువ శ్రీనివాసులు, కొల్లు రవీంద్ర, బీసీ జనార్ధనరెడ్డి, వంగలపూడి అనిత, బీద రవిచంద్రయాదవ్, నారా లోకేష్ ఉన్నారు.

చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేకంగా కమిటీని నియమించారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తు పార్టీ నాయకత్వంలో నేతలు, క్యాడర్ వివిధ ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాలని డిసైడ్ అయ్యింది. కాకపోతే ఆ కార్యక్రమాలు ఎలా ఉండాలి? ఎప్పుడు మొదలుపెట్టాలి? చంద్రబాబు అక్రమ అరెస్టును జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి అనే విషయాలను చర్చించేందుకు, పర్యవేక్షించేందుకే కమిటీని నియమించినట్లు అచ్చెన్న చెప్పారు.

కార్యక్రమాలను టేకప్ చేయటం, ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీని నియమించటం బాగానే ఉంది. కానీ కమిటీలోని 14 మంది నేతల్లో లోకేష్ పేరు 14వ స్థానంలో ఉండటమే ఆశ్చర్యంగా ఉంది. మామూలుగా అయితే జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు కొడుకు హోదాలో లోకేషే ఈ కమిటీని లీడ్ చేయాల్సి ఉంటుంది. కానీ అందుకు విరుద్ధంగా నేతల జాబితాలో లోకేష్ పేరు చివరన ఉండటమే పార్టీ నేతలందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

అరెస్ట్‌కు భయపడే లోకేష్ ఏపీని వదిలేసి ఢిల్లీలో ఉన్నాడని, లోకేష్ ఎప్పుడైనా అరెస్టయ్యే అవకాశం ఉందనే ప్రచారం నేపథ్యంలో లోకేష్ పేరును చివరన పెట్టారా అని కూడా చర్చలు జరుగుతున్నాయి. ఏదేమైనా ఎన్నికేసులు పెట్టించుకుంటే పార్టీలో అంత పెద్ద నామినేటెడ్ పోస్టు ఇస్తామని నేతలు, క్యాడర్‌కు బంపరాఫర్ ఇచ్చిన లోకేషే చివరకు కేసులకు భయపడి పారిపోతే ఎలాగ అని సెటైర్లు పేలుతున్నాయి.


First Published:  25 Sep 2023 5:16 AM GMT
Next Story