Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు గట్టిగా ఇరుక్కున్నట్టేనా..?

బ్లాక్ మనీ, ముడుపులు, ఆధారాలు, సబ్ కాంట్రాక్టుల గురించి చంద్రబాబు ఎక్కడా ప్రస్తావించలేదు. అప్పట్లో చంద్రబాబు ఇచ్చిన నోటీసును ఐటీ శాఖ తిరస్కరించి మరో షోకాజ్ నోటీసు జారీచేసింది.

చంద్రబాబు గట్టిగా ఇరుక్కున్నట్టేనా..?
X

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి ఇప్పుడు ఏమిచేయాలో అర్థం కావటంలేదు. సమస్య ఏమిటంటే.. ముందుకు పోలేరు, అలాగని వెనక్కూ వెళ్ళలేరు. అందుకనే ఇప్పుడు సమస్యలో నుంచి ఎలా బయటపడాలో అర్థం కావటంలేదు. రాజధాని అమరావతి నిర్మాణాలకు సంబంధించిన కుంభకోణంలో చంద్రబాబు రూ. 118 కోట్ల ముడుపులు అందుకున్నారని ఐటీ శాఖ లెక్క తేల్చింది. తాము తేల్చిన లెక్కల ప్రకారం రూ.118 కోట్లు చంద్రబాబు దగ్గర బ్లాక్ మనీ ఉన్నట్లే అని ఉన్నతాధికారులు తేల్చేశారు.

ఆగస్టు 4వ తేదీన జారీచేసిన షోకాజ్ నోటీసుకు చంద్రబాబు సమాధానం ఇచ్చితీరాలి. అంతకుముందు అంటే 2022, సెప్టెంబర్ 22వ తేదీనే మొదటిసారి చంద్రబాబుకు ఐటీ శాఖ ఇదే విషయమై నోటీసిచ్చింది. అందులో చంద్రబాబుకు ముడుపులు అందినట్లుగా తమకు దొరికిన ఆధారాలను కూడా ఐటీ శాఖ వివరించింది. దీనిపై సమాధానం చెప్పమని నోటీసులో కోరింది. అయితే ఐటీ శాఖ అడిగినట్లుగా వివరణ పంపకుండా అసలు తనను విచారించే అధికారమే ఐటీ శాఖకు లేదని ఎదురుదాడి మొదలుపెట్టారు. తనకు నోటీసిచ్చిన ఐటీ శాఖ పరిధిలోకి తాను రాననే వితండవాదన వినిపించారు.

బ్లాక్ మనీ, ముడుపులు, ఆధారాలు, సబ్ కాంట్రాక్టుల గురించి చంద్రబాబు ఎక్కడా ప్రస్తావించలేదు. అప్పట్లో చంద్రబాబు ఇచ్చిన నోటీసును ఐటీ శాఖ తిరస్కరించి మరో షోకాజ్ నోటీసు జారీచేసింది. ఇప్పుడు గనుక ఐటీ శాఖ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే చంద్రబాబు ఇరుక్కున్నట్లే. సమాధానం చెప్పకపోతే ముడుపుల రూపంలో రూ.118 కోట్లు అందుకున్నది నిజమే అని అంగీకరించినట్లవుతుంది.

తనపైన ఐటీ శాఖ చేస్తున్న ఆరోపణలు తప్పని చెప్పేందుకు లేదు. ఎందుకంటే కాంట్రాక్టు సంస్థ‌ యజమాని మనోజ్ వాసుదేవ్ పర్ధాసాని నుంచి 118 కోట్ల రూపాయలను చంద్రబాబు పీఏగా పనిచేసిన శ్రీనివాస్ అందుకున్నట్లు ఐటీశాఖ దగ్గర సాక్ష్యాలున్నాయి. ఆ ఆధారాల ప్రకారమే ఐటీ శాఖ నోటీసిచ్చింది. అలాగని 118 కోట్ల రూపాయలు ముట్టినట్లు అంగీకరించలేరు. ఇదే సమయంలో అదంతా అబద్ధమని కొట్టిపారేయలేరు. చంద్రబాబు ఇప్పుడు విచిత్రమైన పరిస్థితుల్లో ఇరుక్కున్నారు. ముడుపులు తీసుకున్నట్లు ఐటీ శాఖ కోర్టులో నిరూపిస్తే చంద్రబాబుకు జైలు శిక్షపడుతుంది, అధికార పదవులను కోల్పోతారు, పోటీకి అనర్హుడవుతారు, అందుకున్న ముడుపులకు మూడు రెట్లు పెనాల్టీ కట్టాలి. విచారణ జరగకుండా స్టే కోసం కోర్టుకు వెళ్ళటం తప్ప చంద్రబాబుకు వేరేదారిలేదు. అప్పుడు కోర్టు ఏమంటుందో చూడాలి.

*

First Published:  4 Sep 2023 5:48 AM GMT
Next Story