Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు ప్రయోగాలు చేయబోతున్నారా?

ఇప్పుడు టీడీపీకి ఉన్నది ముగ్గురు ఎంపీలు మాత్రమే. వచ్చే ఎన్నికల్లో పోటీకి ముగ్గురు ఎంపీలు ఎందుకనో పెద్దగా ఆసక్తి చూపటం లేదు. దీంతో యువకులను ఎంపిక చేస్తే పార్టీకి ఫ్రెష్ లుక్ వస్తుందన్నది చంద్రబాబు ఆలోచనట.

చంద్రబాబు ప్రయోగాలు చేయబోతున్నారా?
X

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంతో వ్యూహాలు రచిస్తున్న చంద్రబాబునాయుడు ఒక ప్రయోగం చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ ప్రయోగం ఏమిటంటే పార్లమెంటు నియోజకవర్గాల్లో వీలైనంతమందిని యువకులను నిలబెట్టడం. ఈ యువకులను కూడా ఆర్థిక, సామాజికవర్గాల కోణంలో బలమైనవాళ్ళని ఎంపిక చేస్తే దాని ప్రభావం అసెంబ్లీ నియోజకవర్గాల గెలుపుపైన కూడా ఉంటుందని నమ్ముతున్నారట. ఇప్పుడు టీడీపీకి ఉన్నది ముగ్గురు ఎంపీలు మాత్రమే. వచ్చే ఎన్నికల్లో పోటీకి ముగ్గురు ఎంపీలు ఎందుకనో పెద్దగా ఆసక్తి చూపటం లేదు.

విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీలో పెద్ద తలనొప్పిగా తయారయ్యారు. కాబట్టి ఆయన ప్లేస్‌లో అభ్యర్థిగా ఆయన తమ్ముడు కేశినేని శివధర్ (చిన్ని)ని దాదాపు ఎంపిక చేసినట్లే. అలాగే శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు నరసన్నపేట అసెంబ్లీకి పోటీ చేయాలని డిసైడ్ అయిపోయారు. రాబోయే ఎన్నికల్లో ఎంపీగానే పోటీ చేయాలని చంద్రబాబు చెప్పినా రామ్మోహన్ వినిపించుకోవటంలేదు. అసెంబ్లీ నియోకవర్గానికి మాత్రమే పరిమితమై తిరగేస్తున్నారు. ఇక గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పార్టీలో ఉన్నారో లేదో కూడా అనుమానమే.

ఈ నేపథ్యంలోనే ఎలాగూ 22 నియోజకవర్గాలకు కొత్త అభ్యర్థుల‌ను చూడాల్సిందే. కాబట్టి చూసేదేదో కొత్తవాళ్ళని, యువకులను ఎంపిక చేస్తే పార్టీకి ఫ్రెష్ లుక్ వస్తుందన్నది చంద్రబాబు ఆలోచనట. కొత్తవాళ్ళంటే ఎన్నికలకు కొత్తవాళ్ళే కానీ రాజకీయాలకు కాదు. వారసుల రూపంలో ఇప్పటికే నియోజకవర్గాల్లో బాగా పాపులరైనవాళ్ళే. విశాఖపట్నంకు చింతకాయల విజయ్ లేదా భరత్, అనంతపురంలో పరిటాల శ్రీరామ్, నరసరావుపేటలో పుట్టా మహేష్ యాదవ్, అమలాపురంలో మోకా ఆనంద్ సాగర్ లేదా గంటి హరీష్, రాజంపేటలో నరహరి, కడపలో శ్రీనివాసులరెడ్డి, నెల్లూరులో బీద రవిచంద్రయాదవ్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.

ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళని అభ్యర్థులుగా ఎంపిక చేయటం చంద్రబాబుకు కొత్తేమీకాదు. కాకపోతే ఈసారి సామాజికవర్గాలను కూడా పక్కాగా అమలు చేయాలని డిసైడ్ అయ్యారట. ఇందుకోసం నియోజకవర్గాల్లో రాబిన్ శర్మ టీమ్ అవసరమైన కసరత్తు చేస్తోంది. ఎంపీలుగా వీలైనంతమందిని బలమైన కొత్తవాళ్ళని రంగంలోకి దింపితే అసెంబ్లీ అభ్యర్థుల‌తో కో ఆర్డినేషన్ జాగ్రత్తగా చేసుకుంటారని, అధిష్టానం మాట జవదాటకుండా ఉంటారన్నది అసలు ఆలోచన. చివరకు ఏమవుతుందో చూడాలి.

Next Story