Telugu Global
Andhra Pradesh

అనపర్తి ఫార్ములానే కంటిన్యూ చేస్తారా?

పోలీసులు అడ్డంగా రోడ్డుపైన కూర్చున్నా, బ్యారికేడ్లు అడ్డంపెట్టినా చంద్రబాబు, తమ్ముళ్ళు, క్యాడర్ పట్టించుకోకుండా పక్కకు తోసేసి అనపర్తి పట్టణంలోని దేవీచౌక్ దగ్గరకు చేరుకుని సభలో మాట్లాడారు. దీంతో పోలీసుల ఆంక్షలను చంద్రబాబు అతిక్రమించి మరీ సభను విజయవంతం చేసినట్లుగా విపరీతమైన ప్రచారం జరిగింది.

అనపర్తి ఫార్ములానే కంటిన్యూ చేస్తారా?
X

భవిష్యత్తులో కూడా అనపర్తి ఫార్ములానే కంటిన్యూ చేయాలని చంద్రబాబు నాయుడు డిసైడ్ అయ్యారట. అనపర్తి ఫార్ములా అంటే ఏమిటంటే తమను అడ్డగించే పోలీసులను తోసుకుని ముందుకెళ్ళిపోవటం. ఇప్పటివరకు ఏమి జరుగిందంటే పోలీసులు చంద్రబాబును ఎక్కడైనా అడ్డగిస్తే అక్కడే నిలబడి వాళ్ళతో వాగ్వాదం చేస్తున్నారు. లేదంటే ఎక్కడ అడ్డుకుంటే అక్కడే రోడ్డుపైన బైఠాంచి నిరసన తెలుపుతున్నారు. మొదటిసారి తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గంలో పోలీసులతో ఒకవైపు ఘర్షణ పడుతునే వాళ్ళని తోసేసుకుని ముందుకెళ్ళారు.

పోలీసులు అడ్డంగా రోడ్డుపైన కూర్చున్నా, బ్యారికేడ్లు అడ్డంపెట్టినా చంద్రబాబు, తమ్ముళ్ళు, క్యాడర్ పట్టించుకోకుండా పక్కకు తోసేసి అనపర్తి పట్టణంలోని దేవీచౌక్ దగ్గరకు చేరుకుని సభలో మాట్లాడారు. దీంతో పోలీసుల ఆంక్షలను చంద్రబాబు అతిక్రమించి మరీ సభను విజయవంతం చేసినట్లుగా విపరీతమైన ప్రచారం జరిగింది. నిజానికి చంద్రబాబుకు కావాల్సింది కూడా ఇదే. తమ్ముళ్ళు ఎంతవరకు పోలీసులకు వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడతారో అనే అనుమానం వల్లే చంద్రబాబు ఇంతకాలం ధైర్యం చేయలేకపోయారు.

అనపర్తి ఘటన చంద్రబాబులోని భయాన్ని పటాపంచలు చేసిందనే చెప్పాలి. చంద్రబాబు, తమ్ముళ్ళే పోలీసులను రెచ్చగొట్టి పరిస్ధితిని కావాలనే దిగజార్చారా? లేకపోతే పోలీసుల ఓవరాక్షన్ వల్లే పరిస్థితులు దిగజారాయా అన్నది స్పష్టంగా తెలీదు. ఏదేమైనా తాజా ఘటనతో చంద్రబాబుకు మంచి మైలేజ్ అయితే వచ్చిందన్నది వాస్తవం. ఇంత గొడవలో 73 ఏళ్ళ వయసులో కూడా చంద్రబాబు సుమారు 7 కిలోమీటర్లు నడవటం మామూలు విషయం కాదు.

పైగా పెద్దాపురం, జగ్గంపేట, అనపర్తిలోని తమ్ముళ్ళు, క్యాడర్ పోలీసులపై తిరగబడినట్లు గతంలో ఏ నియోజకవర్గంలోనూ జరగలేదు. అందుకనే తమను అడ్డుకునే పోలీసులపై అనపర్తిలో తిరగబడినట్లే ప్రతిచోటా తిరగబడాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారట. దీనివల్ల తమ్ముళ్ళు, క్యాడర్లో ఆత్మస్థైర్యం పెరుగుతుంది, జనాల్లో మంచి మైలేజ్ వస్తుందనేది చంద్రబాబు భావనట. తామేంచేసినా విపరీతంగా హైప్ చేసి హైలైట్ చేసే మీడియా ఉండనే ఉంది. సదరు మీడియా మద్దతుతోనే చంద్రబాబు ఇక నుండి రెచ్చిపోవాలని నిర్ణయించుకున్నారట. మరి తర్వాత పర్యటనల్లో ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

First Published:  20 Feb 2023 6:20 AM GMT
Next Story