Telugu Global
Andhra Pradesh

ఏకాంత చర్చలు.. ఏపీ మీడియాలో చిలువలు పలువలు..

ఇద్దరి మధ్య ఏకాంతంగా చర్చలు జరిగాయనే ఆసక్తికర ప్రచారం ఏపీ మీడియాలో జరుగుతోంది. అందులో నిజమెంతుందో తెలియదు కానీ, 2024 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు ఖరారైందన్నట్టు కూడా ప్రచారం జోరందుకోవడం విశేషం.

ఏకాంత చర్చలు.. ఏపీ మీడియాలో చిలువలు పలువలు..
X

మొత్తానికి చంద్రబాబు అనుకున్నది సాధించారు. ఇన్నాళ్లూ మోదీ దర్శన భాగ్యమే లేదనుకుంటూ కుమిలిపోతున్న ఆయనకు, ఆయన పార్టీ నేతలకు.. ఇప్పుడు ప్రధాని అపాయింట్ మెంట్ లభించింది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ అయ్యారు. అయితే అంతకు మించి ఇద్దరి మధ్య ఏకాంతంగా చర్చలు జరిగాయనే ఆసక్తికర ప్రచారం ఏపీ మీడియాలో జరుగుతోంది. అందులో నిజమెంతుందో తెలియదు కానీ, 2024 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు ఖరారైందన్నట్టు కూడా ప్రచారం జోరందుకోవడం విశేషం.

చంద్రబాబుని క్షమించేశారా..?

2019 ఎన్నికల వేళ.. చంద్రబాబు తన తప్పుల్ని కప్పి పుచ్చుకునేందుకు నెపమంతా బీజేపీపై వేయాలని చూశారు. బీజేపీపై పొత్తు వల్ల చాలా నష్టపోయామని, అందుకే ఏపీకి ఏమీ తేలేకపోయామని, ఈసారి గెలిపిస్తే, కేంద్రం ముక్కుపిండి అన్నీ తెస్తామని హడావిడి చేశారు. మోదీ ఏపీ పర్యటన వేళ, నల్లబెలూన్లు ఎగురవేసి, ఆయన బ్యానర్లు చింపేసి మరీ ఆక్రోశం వెలిబుచ్చారు. ఆ తర్వాత మోదీ, బాబు మధ్య గ్యాప్ బాగా పెరిగింది. ఒకరకంగా ఇది టీడీపీ సృష్టించుకున్నదే. అయితే ఒంటరిగా వెళ్తే బాబు బలం 23 దగ్గర ఆగిపోతుందనే విషయం ఆ పార్టీకి బాగా అర్థమైంది. ఆ తర్వాత మోదీ ప్రాపకం కోసం పాకులాడినా మూడేళ్లుగా అది సాధ్యం కాలేదు. ఏపీలో చంద్రబాబు ఎన్ని పొర్లుదండాలు పెట్టినా ఢిల్లీ నుంచి కరుణరసం కురవలేదు. దీంతో అది వన్ సైడ్ లవ్ గానే మిగిలిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు మోదీ కరుణించి చంద్రబాబుకి అపాయింట్ మెంట్ ఇవ్వడంతో టీడీపీ నేతలు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. టీడీపీ అనుకూల మీడియా సంతోషానికి అవధులు లేకుండా పోయింది.

ఏకాంత చర్చలు..

చంద్రబాబు, మోదీ ఏకాంత చర్చలంటూ టీడీపీ మీడియాలో వరుస కథనాలొస్తున్నాయి. ఈ ఏకాంత చర్చల సారాంశం ఏంటో తెలియదు కానీ, టీడీపీ మాత్రం ఇది తమ ఘన విజయంగా చెప్పుకుంటోంది. అయితే ఎక్కడా అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం లేదు. నోరుజారి ఏపీలో బీజేపీ, టీడీపీ పొత్తు ఖరారైందని మాట్లాడితే మొదటికే మోసం వస్తుందని అనుకుంటున్నారు నేతలు. దీంతో భేటీతో ఏదో జరిగిపోయిందని మాత్రమే టీడీపీ నేతలంటున్నారు. మెయిన్ మీడియా కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది. చిగురిస్తున్న స్నేహాన్ని మొగ్గలో తుంచేయకుండా జాగ్రత్తపడుతోంది. మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం దీన్ని చంద్రబాబు విజయంగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. మొత్తానికి ఢిల్లీలో బాబు, మోదీ భేటీ.. ఏపీలో టీడీపీ అనుకూల మీడియాకి మాత్రం చేతినిండా పని కల్పించింది.

First Published:  7 Aug 2022 1:55 AM GMT
Next Story