Telugu Global
Andhra Pradesh

నోరు జారిన చంద్రబాబు.. అది కోర్టు ఉల్లంఘనే అంటున్న వైసీపీ

సుప్రీంకోర్టులోనూ ఈ కేసు విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన హైకోర్టు బెయిల్‌ నిబంధనలను బేఖాతరు చేస్తూ ఈ కేసు గురించి బహిరంగంగా విమర్శలు గుప్పించడం గమనార్హం.

నోరు జారిన చంద్రబాబు.. అది కోర్టు ఉల్లంఘనే అంటున్న వైసీపీ
X

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో బెయిల్‌పై విడుదలైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం నోరు జారారు. స్కిల్‌ స్కామ్‌లో ఎలాంటి ఆధారాలూ లేకుండా తనను అక్రమంగా జగన్‌ జైలుపాలు చేశాడని మండిపడ్డారు. తాను న్యాయపరంగా గాని, సాంకేతికంగా గాని ఎలాంటి తప్పూ చేయలేదని, అయినా సరే తనను జైలులో పెట్టారని జగన్‌పై నిప్పులు చెరిగారు. తుపాను బాధితులను పరామర్శించేందుకు తెనాలి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అవే హాట్‌ టాపిక్‌గా మారాయి.

ప్రస్తుతం చంద్రబాబు నాయుడు స్కిల్‌ స్కామ్‌ కేసులో బెయిల్‌పై ఉన్నారు. మరోపక్క సుప్రీంకోర్టులోనూ ఈ కేసు విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన హైకోర్టు బెయిల్‌ నిబంధనలను బేఖాతరు చేస్తూ ఈ కేసు గురించి బహిరంగంగా విమర్శలు గుప్పించడం గమనార్హం. హైకోర్టు నిబంధనల నేపథ్యంలో ఇప్పటివరకు ఎక్కడా ఈ కేసు గురించి మాట్లాడని చంద్రబాబు శుక్రవారం మాత్రం దీనిపై మాట్లాడారు. సీఎం జగన్‌పై విమర్శలు చేశారు.

ఇప్పుడు వైసీపీ నేతలకు అదే ఆయుధంగా మారింది. చంద్రబాబు హైకోర్టు నిబంధనలను ఉల్లంఘించారని, అది కోర్టు ఉల్లంఘనేనని చెబుతున్నారు. కోర్టులో కేసు విచారణలో ఉండగా.. సుప్రీంకోర్టు సైతం ఈ కేసు గురించి ఎక్కడా ప్రస్తావించవద్దని ఆదేశించినా.. చంద్రబాబు పట్టించుకోకుండా ఈ కేసు గురించి మీడియా ముందు మాట్లాడారంటే ఆయనకు కోర్టులన్నా, చట్టాలన్నా గౌరవం లేదని అర్థమవుతోందని విమర్శిస్తున్నారు. కోర్టు ఉల్లంఘనకు పాల్పడిన చంద్రబాబు బెయిల్‌ ఎందుకు రద్దు చేయకూడదని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

First Published:  9 Dec 2023 3:20 AM GMT
Next Story