Telugu Global
Andhra Pradesh

ఖైదీలకు చంద్రబాబు పరామర్శ.. పెద్దిరెడ్డిపై ఘాటు విమర్శ

మంత్రి పెద్దిరెడ్డి చెప్పినట్టల్లా పోలీసులు ఆడుతున్నారని మండిపడ్డారు. పోలీసులు ఇకనైనా పద్ధతి మార్చుకోవాలన్నారు. పెద్దిరెడ్డి పనైపోయిందని, ఆయనకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని అన్నారు.

ఖైదీలకు చంద్రబాబు పరామర్శ.. పెద్దిరెడ్డిపై ఘాటు విమర్శ
X

పీలేరు సబ్ జైలులో ఉన్న ఖైదీలను ప్రతిపక్ష నేత చంద్రబాబు పరామర్శించారు. తమ పార్టీకి చెందిన ఫ్లెక్సీలు చింపి, చివరకు తమ వారిపైనే కేసులు పెట్టి, వారినే జైలులో పెట్టారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. మంత్రి పెద్దిరెడ్డి చెప్పినట్టల్లా పోలీసులు ఆడుతున్నారని, మండిపడ్డారు. పోలీసులు ఇకనైనా పద్ధతి మార్చుకోవాలన్నారు. పెద్దిరెడ్డి పనైపోయిందని, ఆయనకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని అన్నారు.

అన్నమయ్య జిల్లా పీలేరు సబ్‌ జైలులో ఉన్న పుంగనూరు టీడీపీ నేతలు, కార్యకర్తలను చంద్రబాబు పరామర్శించారు. నారావారి పల్లెలో సంక్రాంతి వేడుకలకోసం కుటుంబ సమేతంగా వచ్చిన ఆయన, కనుమ పండగ రోజున ఖైదీలను కలిసేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా పోలీస్ యాక్ట్-30ని అమలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. తనను పీలేరు రాకుండా అడ్డుకున్నారని పోలీసులపై మండిపడ్డారు.


ఏం తప్పు చేశారని టీడీపీ నేతలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ప్రశ్నించారు చంద్రబాబు. అక్రమ కేసులు పెట్టడమే కాకుండా వారిని తీవ్రంగా కొట్టారని, తప్పు ఒప్పుకోవాలని ఒత్తిడి చేశారని అన్నారు. సీఐ, ఎస్సై దారుణంగా వ్యవహరించారన్నారు. వారందర్నీ పోలీసులు భయపెట్టి మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారన్నారు. ఎంతమందిని జైల్లో పెడతారో చూస్తామంటూ హెచ్చరించారు. అక్రమ కేసులు పెడితే ఊరుకునేది లేదన్నారు చంద్రబాబు. మరోవైపు చంద్రబాబు పీలేరు జైలుకి వస్తున్న సందర్భంగా.. ఆయనకు వ్యతిరేకంగా అక్కడ ఫ్లెక్సీలు వేశారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు రాసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి.

First Published:  16 Jan 2023 11:57 AM GMT
Next Story