Telugu Global
Andhra Pradesh

కాపు సంఘాల నేతలతో చంద్రబాబు భేటీ.. అసలు విషయం ఏంటి..?

టీడీపీ ప్రారంభం నుంచి కాపులు, బీసీలు తమ పార్టీకి అండగా ఉన్నారని, చిరంజీవి పార్టీ పెట్టిన తర్వాతే టీడీపీతో కాపులకు కొంత గ్యాప్ వచ్చిందని అంటున్నారు ఆ పార్టీనేత చినరాజప్ప. కాపు యువత కాస్త అటూ ఇటుగా ఉన్నా కూడా, కాపు పెద్దలు చంద్రబాబుపై నమ్మకంతో ఉన్నారన్నారు.

కాపు సంఘాల నేతలతో చంద్రబాబు భేటీ.. అసలు విషయం ఏంటి..?
X

ఇటీవల అమలాపురం అల్లర్ల కేసుల్ని వైసీపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇందులో ఎక్కువగా లాభపడింది కాపు సామాజికవర్గం వారే. కోనసీమ జిల్లా పేరు మార్పుపై జరిగిన ఆందోళనల్లో మంత్రి, ఎమ్మెల్యే ఇంటిపై జరిగిన దాడిలో ఎక్కువగా కాపు వర్గానికి చెందిన యువతే కేసులు ఎదుర్కొంది. ఆ కేసులన్నీ ప్రభుత్వం ఉపసంహరించిన సందర్భంలో కాపు సంఘాల నాయకులు సీఎం జగన్ ని కలసి ధన్యవాదాలు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీకి కృతజ్ఞతలు చెప్పారు. సామాజికవర్గాల వారీగా ఎప్పుడూ విడిపోబోమని మాటిచ్చారు. కట్ చేస్తే.. వారం రోజుల గ్యాప్ లో చంద్రబాబు కూడా కాపు వర్గం వారితో మీటింగ్ పెట్టారు. రాష్ట్రంలోని కాపు సంఘాల నాయకులతో భవిష్యత్ రాజకీయాలపై చర్చ చేపట్టారు.

కాపులతో గ్యాప్..

టీడీపీ ప్రారంభం నుంచి కాపులు, బీసీలు తమ పార్టీకి అండగా ఉన్నారని, చిరంజీవి పార్టీ పెట్టిన తర్వాతే టీడీపీతో కాపులకు కొంత గ్యాప్ వచ్చిందని అంటున్నారు ఆ పార్టీనేత చినరాజప్ప. గత ఎన్నికల్లో పవన్ పార్టీ విడిగా పోటీ చేయడంతో రాజకీయంగా నష్టపోయామని చెప్పుకొచ్చారు. కాపులకు చంద్రబాబు ఎంతో లబ్ది చేకూర్చినా కొందరు దుష్ప్రచారం చేశారని అందుకే గ్యాప్ వచ్చిందని చెబుతున్నారు. కాపు యువత కాస్త అటూ ఇటుగా ఉన్నా కూడా, కాపు పెద్దలు చంద్రబాబుపై నమ్మకంతో ఉన్నారన్నారు.

జనసేనతో పొత్తు ఎంతవరకు..?

జనసేనతో పొత్తుపెట్టుకోవాలని టీడీపీ అనుకుంటున్నా.. సీట్ల విషయంలో తకరారు మొదలైంది. 20, 30 సీట్లకు ఈసారి పవన్ లొంగేలా లేరు. అంతకంటే ఎక్కువ ఇస్తే అసలుకే మోసం వస్తుందనేది బాబు భయం. మరోవైపు హరిరామజోగయ్య వంటి కాపు సంఘాల నేతలు పవన్ కల్యాణ్ ని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాపు సంఘాల నాయకులతో చంద్రబాబు సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీపై అటు జనసేన కూడా ఆసక్తిగా ఉంది.

First Published:  1 April 2023 11:52 AM GMT
Next Story