Telugu Global
Andhra Pradesh

కూటమి సీట్లలో మళ్లీ మార్పులు.. బీజేపీ అభ్యర్థులకు చంద్రబాబు షాక్

రెండు సీట్లలో మార్పులకోసం పట్టుబడుతున్నారు చంద్రబాబు. ఆ మార్పులు కూడా టీడీపీకి అనుకూలంగా ఉంటాయి, బీజేపీ మాత్రం త్యాగం చేయాల్సి ఉంటుంది.

కూటమి సీట్లలో మళ్లీ మార్పులు.. బీజేపీ అభ్యర్థులకు చంద్రబాబు షాక్
X

కూటమిలో బీజేపీ, జనసేనకు దక్కిన సీట్లు ఆయా పార్టీల హక్కు కాదు, అది చంద్రబాబు దయాదాక్షిణ్యం అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆల్రడీ ఒకసారి వారికి సీట్లు కేటాయించిన తర్వాత కూడా చంద్రబాబు పదే పదే మార్పుల పేరుతో వారిని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటికే జనసేన, బీజేపీ తరపున కొందరు టీడీపీ అభ్యర్థులను బరిలో దింపిన బాబు.. మరో రెండు సీట్లలో మార్పులకోసం పట్టుబడుతున్నారు. ఆ మార్పులు కూడా టీడీపీకి అనుకూలంగా ఉంటాయి, బీజేపీ మాత్రం త్యాగం చేయాల్సి ఉంటుంది.

తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి సీటు ఆల్రడీ బీజేపీకి కేటాయించారు. కానీ దాన్ని ఇప్పుడు తిరిగివ్వాలని కోరుతున్నారు చంద్రబాబు. ఆ స్థానంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని టీడీపీ తరపున పోటీకి దింపాలనేది బాబు ప్లాన్. అనపర్తి సీటు త్యాగం చేయడానికి బీజేపీ ఒప్పుకుంది కానీ, దాని బదులు ఉంగుటూరు కావాలని కోరింది. ఉంగుటూరు సీటు జనసేనకు ఇచ్చామని అది ఇవ్వలేమని, బదులుగా అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె సీటును ఇస్తామని ఆఫర్ ఇచ్చారు చంద్రబాబు. తంబళ్లపల్లె ఎలాగూ టీడీపీ ఓడిపోయే సీటే, అందుకే దాన్ని బీజేపీకి అంటగట్టాలనుకుంటున్నారు.

రఘురామకృష్ణంరాజు కోసం..

రఘురామకృష్ణంరాజు కోసం కూడా చంద్రబాబు లాబీయింగ్ మొదలు పెట్టారు. నరసాపురం లోక్ సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ ఆల్రడీ ప్రచారం చేసుకుంటున్నారు. ఆయన్ను పక్కనపెట్టి టీడీపీ అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజుని బరిలో దింపాలనేది చంద్రబాబు ఆలోచన. బదులుగా శ్రీనివాస వర్మకు ఉండి అసెంబ్లీ టికెటి ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. ఉండిలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుని బలిపశువుని చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. ఆ సీటు రఘురామకు ఇస్తామంటే రామరాజు తిరుగుబాటు చేశారు, దీంతో పొత్తుల పేరు చెప్పి ఆ సీటుని బీజేపీకి అప్పగించాలనుకున్నారు. రఘురామకృష్ణంరాజు కోసం నర్సాపురంలో బీజేపీని ఖాళీ చేయిస్తున్నారు.

ప్రస్తుతానికి బీజేపీ రాష్ట్ర నాయకత్వం సూత్రప్రాయంగా ఈ మార్పులకు అంగీకరించింది, బీజేపీ అధిష్టానం అనుమతి తర్వాత రెండు పార్టీలు అధికారికంగా ప్రకటన విడుదల చేస్తాయి. ఈ రెండు మార్పుల వల్ల టీడీపీకే లాభం, నష్టపోయేది మాత్రం బీజేపీనే.

First Published:  13 April 2024 2:50 AM GMT
Next Story