Telugu Global
Andhra Pradesh

ఐటీ వల్ల నేను నష్టపోయా.. చంద్రబాబు కామెడీ

ఐటీ పితామహుడిగా తనని తాను ప్రొజెక్ట్ చేసుకునే చంద్రబాబు పదే పదే సోషల్ మీడియాకు బలవుతుంటారు. తాజాగా ఆయన మరోసారి ట్రోలింగ్ కి గురయ్యారు.

ఐటీ వల్ల నేను నష్టపోయా.. చంద్రబాబు కామెడీ
X

చాలా కాలం తర్వాత చంద్రబాబు కడుపుబ్బా నవ్వించారు. ఐటీ నేనే సృష్టించా, సెల్ ఫోన్ ని, కంప్యూటర్ ని నేనే కనిపెట్టా, బిల్ గేట్స్ ని ఇండియాకు తెచ్చా.. ఇలాంటి పాచిపోయిన డైలాగులతోపాటు మరో కొత్త డైలాగ్ కొట్టి అందర్నీ నవ్వించారు. ఐటీ వల్ల టీడీపీ పరోక్షంగా నష్టపోయిందన్నారు. ఐటీ నేర్చుకుని ఏపీ నుంచి యువత ఉద్యోగాలకోసం విదేశాలకు తరలి వెళ్లిందని, అలా టీడీపీ ఓట్లన్నీ విదేశాలకు వెళ్లిపోయాయని అన్నారు చంద్రబాబు. చంద్రబాబు ఏ రేంజ్ లో కోతలు కోస్తారో చెప్పడానికి ఇది లేటెస్ట్ ఉదాహరణ.


ఇంతకీ చంద్రబాబు ఏమన్నారంటే..?

"ఒకప్పుడు ఐటీ చదువుకోవాలంటే అందరూ నవ్వారు, ఐటీ ఎక్కడుంది అని అనేవారు. నేను ప్రపంచమంతా తిరిగి చెప్పాను, ఐటీ వల్ల జీవితాల్లో మార్పు వస్తుంది. మీ పిల్లలకు ఎంత భూమి ఇస్తారనేది ముఖ్యం కాదు, ఎంత చదివిస్తారనేది ముఖ్యం. దాంతో చాలామంది గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చి ఉన్నత చదువులు చదివించారు. ఐటీ వల్ల ఉద్యోగాలు వచ్చాయి, వారంతా విదేశాలకు వెళ్లి సెటిలయ్యారు. ఒకరకంగా చాలామంది నన్ను విమర్శిస్తుంటారు, మీ వల్ల టీడీపీ ఓట్లన్నీ విదేశాలకు వెళ్లిపోయాయి అనేవారు. నేను నష్టపోయా, కానీ వారు బాగుపడ్డారు." ఇలా రెచ్చిపోయారు చంద్రబాబు.

సోషల్ మీడియాలో ట్రోలింగ్..

ఐటీ పితామహుడిగా తనని తాను ప్రొజెక్ట్ చేసుకునే చంద్రబాబు పదే పదే సోషల్ మీడియాకు బలవుతుంటారు. తాజాగా ఆయన మరోసారి ట్రోలింగ్ కి గురయ్యారు. ఐటీ ఉద్యోగులుగా విదేశాలకు వెళ్లిన వాళ్లంతా టీడీపీ ఓటర్లేనా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. అదే నిజమైతే విదేశాల్లో కూడా చంద్రబాబు సపోర్ట్ చేసిన పార్టీలే గెలుస్తున్నాయి కాబోలు.. అంటూ వెటకారం చేస్తున్నారు. మొత్తమ్మీద ఐటీ ఉద్యోగాలు, విదేశాలకు టీడీపీ ఓటర్లు అంటూ చంద్రబాబు మంచి వినోదాన్ని పంచారు.

First Published:  13 March 2024 2:22 PM GMT
Next Story