Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు విలవిల్లాడుతున్నారా?

మార్గదర్శిలో జరుగుతున్న సోదాల తాలూకు సీఐడీ దెబ్బ ఛైర్మన్ రామోజీరావు మీద పడుతుంటే దాని నొప్పికి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నట్లున్నారు. టీడీపీ ట్విట్టర్ ఖాతాలో రామోజీకి మద్దతుగా చంద్రబాబు చేసిన ట్వీటే దీనికి ఉదాహరణగా నిలిచింది.

చంద్రబాబు విలవిల్లాడుతున్నారా?
X

ఎక్కడో స్విచ్చేస్తే ఇంకెక్కడో బల్బు వెలిగినట్లుంది వ్యవహారం. మార్గదర్శిలో సీఐడీ అధికారులు సోదాలు చేస్తు అక్రమాలు, అవినీతిని బయటకు తీస్తుంటే చంద్రబాబునాయుడు విలవిల్లాడిపోతున్నారు. మార్గదర్శిలో జరుగుతున్న సోదాల తాలూకు సీఐడీ దెబ్బ ఛైర్మన్ రామోజీరావు మీద పడుతుంటే దాని నొప్పికి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నట్లున్నారు. టీడీపీ ట్విట్టర్ ఖాతాలో రామోజీకి మద్దతుగా చంద్రబాబు చేసిన ట్వీటే దీనికి ఉదాహరణగా నిలిచింది. ట్వీట్లో రామోజీ జర్నలిజంకు చేసిన సేవలు, పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్న విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు.

రామోజీ లాంటి నిజాయితీపరుడు, చిత్తశుద్ది కలిగిన వ్యక్తి మరొకరు లేరని చంద్రబాబు చెప్పారు. అలాంటి మహోన్నత వ్యక్తిపై జగన్మోహన్ రెడ్డి శాడిజం చూపిస్తున్నట్లు మండిపడ్డారు. రామోజీకి వ్యతిరేకంగా జగన్ చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించవని జోస్యం కూడా చెప్పారు. యుద్ధం జరిగినప్పుడు చెడుపై మంచే అంతిమ విజయం సాధిస్తుందని చంద్రబాబు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. ఒకవైపు చట్టాలను, నిబంధలను రామోజీ ఉల్లంఘించి మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యాపారం చేస్తున్నట్లు ఆధారాలతో సహా సీఐడీ చూపిస్తోంది.

రామోజీ చేస్తున్న వ్యాపారంలో లొసుగులను, మోసాలను, అక్రమాలను సీఐడీ ఆధారాలతో సహా బయటపెడుతున్నా చంద్రబాబు మాత్రం రామోజీ నిష్కళంకుడే అని పదేపదే చెబుతున్నారు. అయినా మార్గదర్శిపై సీఐడీ సోదాలు చేసి అక్రమాలు బయటపెడుతుంటే చంద్రబాబు ఎందుకింత గోలచేస్తున్నారు? ఎందుకంటే జానపద సినిమాల్లో మాంత్రికుడి ప్రాణం చిలుకలో ఉన్నట్లు చూపించేవారు.

అదే పద్ధ‌తిలో చంద్రబాబు బలమంతా ఎల్లో మీడియానే అని అందరికీ తెలిసిందే. ఎల్లో మీడియాలో కూడా రామోజీరావు ఇంకా ముఖ్యుడు. అందుకనే ఇప్పుడు మార్గదర్శిలో అక్రమాలంటూ సీఐడీ ఆధారాలు బయటపెడుతంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. అసలే ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఎన్నికల సమయానికి చంద్రబాబు నమ్ముకున్నదే ఎల్లో మీడియా మద్దతును. ఎన్నికల సమయానికి మార్గదర్శిపై గట్టి దెబ్బపడితే రామోజీ తట్టుకోలేరు. రామోజీనే జగన్ దెబ్బను తట్టుకోలేకపోతే ఇక తానేంతనే భయం చంద్రబాబులో పెరిగిపోతున్నట్లుంది. అందుకనే ముందు ఎల్లో మీడియా తోకపత్రిక యజమానిని రామోజీకి మద్దతుగా దింపినట్లున్నారు. ఇప్పుడు డైరెక్టుగా చంద్రబాబే రంగంలోకి దిగేశారు. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

First Published:  22 Aug 2023 5:16 AM GMT
Next Story