Telugu Global
Andhra Pradesh

మరోసారి బకరా అవ్వడం ఖాయమా?

రేపు డిసెంబర్ మీటింగ్‌లో కూడా ఎల్లో మీడియా రెచ్చిపోవటం ఖాయం. చంద్రబాబు విషయంలో లేనిది ఉన్నట్లు ఎల్లో మీడియా ఊదరగొట్టడం చివరకు 40 ఇయర్స్ఇండస్ట్రీ బకరా అయిపోవటం మామూలైపోయింది.

మరోసారి బకరా అవ్వడం ఖాయమా?
X

40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు మరోసారి బకరా అవటానికి వేదిక సిద్ధమైంది. డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు నరేంద్ర మోడీ అధ్యక్షతన జరగబోతున్న దేశంలోని వివిధ రాజకీయ పార్టీల అధినేతల సమావేశానికి హాజరుకావాలని చంద్రబాబుకు ఆహ్వానం అందింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నుండి చంద్రబాబుకు ఆహ్వానం అందటమే కాకుండా స్వయంగా ఫోన్ చేసి మరీ ఆహ్వానించారు. కేంద్రమంత్రి ఆహ్వానించటం, చంద్రబాబు వెళ్ళటం చాలా మామూలు విషయాలు.

అయితే ఇక్కడ గమనించాల్సిందేమంటే ఎల్లో మీడియా చేసే అతే చాలా ఎక్కువగా ఉంటుంది. కేంద్ర మంత్రి దగ్గర నుండి ఆహ్వానం రావటం ఆలస్యం మోడీ-చంద్రబాబు మధ్య మరోసారి భేటీ జరగబోతోందంటూ ఎల్లో మీడియాలో రచ్చ మొదలైపోయింది. మరోసారి అంటే ఇంతకు ముందోసారి భేటీ జరిగిందన్నట్లుగా కలరింగ్ ఇస్తోంది. 2018 నుండి చంద్రబాబును మోడీ అసలు కలవనేలేదు. చంద్రబాబును కలవటానికి మోడీ ఏమాత్రం ఇష్టపడటం లేదన్న విషయం అందరికీ తెలిసిందే.

వచ్చే నెలలో జరగబోయే సమావేశంలో కూడా దేశంలోని అన్నీ పార్టీల అధినేతలకు ఆహ్వానాలు పంపారు కాబట్టే చంద్రబాబుకు కూడా అందిందంతే. ఇందులో చంద్రబాబుకు ప్రత్యేకంగా పంపిన ఆహ్వానం ఏమీలేదు. ఆ మధ్య రాష్ట్రపతి భవన్లో జరిగిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఆ సందర్భంగా చంద్రబాబుతో మోడీ మాట్లాడారు. ఎందుకు మాట్లాడారంటే సమావేశానికి వచ్చిన నేతలందరితో మాట్లాడినట్లే చంద్రబాబుతో కూడా మాట్లాడారంతే. ఇంతోటిదానికే చంద్రబాబుతో మోడీ ప్రత్యేకంగా మాట్లాడారని ఎల్లో మీడియా రెచ్చిపోయింది.

అసలు ఢిల్లీకి ఎందుకు రావటంలేదని, పీఎంవో మీ ఆఫీసే అనుకోండని, మీతో చాలా మాట్లాడాల్సుందని చంద్రబాబుతో మోడీ అన్నట్లు ఎల్లోబ్యాచ్ విపరీతంగా ఊదరగొట్టేసింది. చివరకు అదంతా తప్పేనని బీజేపీయే ఖండించాల్సొచ్చింది. అప్పుడు చంద్రబాబు బకరా అయిపోయారు. మళ్ళీ ఇప్పుడు అలాంటి ప్రచారమే మొదలైంది. రేపు డిసెంబర్ మీటింగ్‌లో కూడా ఎల్లో మీడియా రెచ్చిపోవటం ఖాయం. చంద్రబాబు విషయంలో లేనిది ఉన్నట్లు ఎల్లో మీడియా ఊదరగొట్టడం చివరకు 40 ఇయర్స్ఇండస్ట్రీ బకరా అయిపోవటం మామూలైపోయింది.

Next Story