Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు చేతులెత్తేస్తున్నారా..? భువనేశ్వరి మాటల్లోని ఆంతర్యమేంటి?

ఆయన్ను రెస్ట్‌ తీసుకోమని చెప్పుతున్నా.. నేనే ఇక్కడి నుంచి పోటీ చేద్దామని అనుకుంటున్నా..’’ అని సభకు వచ్చినవారిని ఉద్దేశించి నారా భువనేశ్వరి అన్నట్లు మీడియా వార్తలు వచ్చాయి.

చంద్రబాబు చేతులెత్తేస్తున్నారా..? భువనేశ్వరి మాటల్లోని ఆంతర్యమేంటి?
X

వైసీపీ దెబ్బకు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేతులెత్తేస్తున్నారా..? కుప్పంలో ఈసారి చంద్రబాబు పోటీకి దిగుతారా, లేదా అనే సందేహం కలుగుతోంది. ఆయన సతీమణి నారా భువనేశ్వరి మాటలు ఆ సందేహం కలగడానికి కారణమయ్యాయి. కుప్పం నగరానికి వైఎస్‌ జగన్‌ కొద్దిరోజుల్లో హంద్రీనీవా జ‌లాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. నియోజకవర్గంలోని వ్యవసాయ భూములకు ఇప్పటికే సాగునీరు అందుతోంది. వైయ‌స్ జ‌గ‌న్ అమ‌లు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందుకున్న ల‌బ్ధిదారులంతా వైసీపీకి సానుభూతిప‌రులుగా మారిపోతున్నారు. కుప్పంలో చంద్రబాబును ఓడించే లక్ష్యంతో మంత్రి పెద్దిరెడ్డి చాలా కాలంగా పనిచేస్తూ వస్తున్నారు.

‘‘కుప్పం వచ్చాను.. ఇక్కడ నాకొక కోరిక ఉంది. నా మనసులో ఎప్పటి నుంచో ఆ కోరిక ఉంది. నేనేమీ మిమ్మల్ని కొట్టను... తిట్టను. 35 ఏళ్లుగా చంద్రబాబు కుప్పం ఎమ్యెల్యేగా ఉన్నాడు. ఇప్పుడు నాకొక కోరిక ఉంది. ఆయన్ను రెస్ట్‌ తీసుకోమని చెప్పుతున్నా.. నేనే ఇక్కడి నుంచి పోటీ చేద్దామని అనుకుంటున్నా..’’ అని సభకు వచ్చినవారిని ఉద్దేశించి నారా భువనేశ్వరి అన్నట్లు మీడియా వార్తలు వచ్చాయి.

అయితే, తాను సరదాగా ఆ మాటలు అన్నానని, తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని భువనేశ్వరి అన్నట్లు కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, భువనేశ్వరి సరదాగానే ఆ మాటలు అన్నారా, దాంట్లో మతలబు ఏమైనా ఉందా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఓ ప్రకటన చేసి ప్రజల నాడిని పట్టుకోవడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో భాగంగానే భువనేశ్వరి చేత చంద్రబాబు అలా మాట్లాడి ఉండవచ్చునని అంటున్నారు.

First Published:  21 Feb 2024 12:44 PM GMT
Next Story