Telugu Global
Andhra Pradesh

బీసీల పవర్ ఏంటో ఇప్పుడు తెలిసిందా?

టీడీపీ వల్ల బీసీలు బాగా లబ్దిపొందిన మాట వాస్తవమే. అయితే అదంతా ఎన్టీయార్ పుణ్యమే తప్ప చంద్రబాబు హయాంలో కాదు. బీసీలు దశాబ్దాల మద్దతును చంద్రబాబు చెడగొట్టుకున్నారు. అధికారంలో ఉన్నపుడు బీసీ సంఘాలపై నోటికొచ్చినట్లు మాట్లాడారు.

బీసీల పవర్ ఏంటో ఇప్పుడు తెలిసిందా?
X

వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు నాయుడు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. గెలవకపోతే పార్టీ భవిష్యత్తు ఏమిటో అందరికన్నా చంద్రబాబుకే బాగా తెలుసు. మరి గెలవాలంటే ఏమి చేయాలి? ముందుగా పార్టీకి దూరమైపోయిన బీసీలను మళ్ళీ దగ్గరకు తీసుకోవాలి. ఎందుకంటే బీసీలు కన్నెర్ర చేస్తే ఏమవుతుందో 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు బాగా అర్ధమైంది. దశాబ్దాలుగా పార్టీకి మద్దతుగా నిలస్తున్న బీసీలు మొదటిసారి వైసీపీకి మద్దతుగా నిలిచిన ఫలితమే టీడీపీ ఘోర ఓటమి.

సరే ఇక వర్తమానానికి వస్తే బీసీలను మంచి చేసుకునేందుకు చంద్రబాబు నానా అవస్తలు పడుతున్నారు. తాజాగా జంగారెడ్డి గూడెంలో నిర్వహించిన బీసీల సదస్సులో ఈ విషయం అర్ధమైపోయింది. అధికారంలో ఉన్నపుడు బీసీలకు పార్టీ ఎంత మద్దతుగా నిలిచింది చెప్పారు. పార్టీకి దూరమైపోయిన బీసీలందరు మళ్ళీ మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి, చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎర్రనాయుడు లాంటి ఉద్ధండులను టీడీపీనే తయారుచేసిందన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే అది చేస్తా ఇది చేస్తానంటు చాలా హామీలు గుప్పించారు.

ఇక్కడ విషయం ఏమిటంటే టీడీపీ వల్ల బీసీలు బాగా లబ్దిపొందిన మాట వాస్తవమే. అయితే అదంతా ఎన్టీయార్ పుణ్యమే తప్ప చంద్రబాబు హయాంలో కాదు. బీసీలు దశాబ్దాల మద్దతును చంద్రబాబు చెడగొట్టుకున్నారు. అధికారంలో ఉన్నపుడు బీసీ సంఘాలపై నోటికొచ్చినట్లు మాట్లాడారు. కుల సంఘాల నేతలను తోకలు కత్తిరిస్తానని బెదిరించారు. సెక్రటేరియట్‌లోకి ఎవరు రానిచ్చారని అందరి ముందు నేతలను అవమానించారు. జైల్లోకి తోస్తానని వార్నింగులిచ్చారు. ఇలాంటి చేష్టలతోనే బీసీల్లో మార్పొచ్చింది.

ఇదే సమయంలో బీసీలకు జగన్మోహన్ రెడ్డి బాగా ప్రాధాన్యతివ్వటం మొదలుపెట్టారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీల టికెట్లు ఎక్కువగా బీసీలకే కేటాయించారు. అధికారంలోకి రాగానే మంత్రివర్గంలో బీసీలకే అగ్రపీఠం వేశారు. 56 కార్పొరేషన్లు పెట్టి ఛైర్మన్లు, డైరెక్టర్లను నియమించారు. నామినేటెడ్ పోస్టుల్లో, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, మున్సిపల్, కార్పొరేషన్ ఛైర్మన్లు, మేయర్ పోస్టుల్లో బీసీలకు మెజారిటి కేటాయించారు. దీంతో బీసీల్లో మ్యాగ్జిమమ్ వైసీపీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఇదంతా చూసిన తర్వాత చంద్రబాబులో వణుకు మొదలైంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బీసీల పవర్ ఏమిటో తెలిసినట్లుంది. అందుకనే మద్దతు కోసం నానా అవస్తలు పడుతున్నారు.

Next Story