Telugu Global
Andhra Pradesh

ఇలాంటి డ్రామాలు వర్కవుటవుతాయా?

పోలవరం లాంటి ప్రాజెక్టులను సందర్శించాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలని తెలీదా? హఠాత్తుగా ప్రాజెక్టు నిర్మాణాన్ని పరిశీలిస్తానంటే.. వందలాది మందిని వెంటేసుకుని వెళతానంటే ఏ ప్రభుత్వమైనా అనుమతిస్తుందా?

ఇలాంటి డ్రామాలు వర్కవుటవుతాయా?
X

చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారో ఆయనకే అర్ధమవుతున్నట్లు లేదు. గురువారం రాత్రి హఠాత్తుగా పోలవరం వెళ్ళే రోడ్డుపై నిర‌స‌న‌కు దిగారు. పోలవరం ప్రాజెక్టును చూడటానికి తనను పోలీసులు అనుమతించకపోవటంతో చంద్రబాబు రోడ్డుపైనే బైఠాయించారు. చంద్రబాబుతో పాటు వందలాది మంది నేతలు, కార్యకర్తలు ఒకవైపు పోలీసులు మరోవైపు మోహరించటంతో పోలవరం ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కూడా ప్రచారం కోసం చీప్‌ ట్రిక్కులకు పాల్పడటమే ఆశ్చర్యంగా ఉంది.

ఇక్కడ చంద్రబాబువి చీప్ ట్రిక్సని అనటం ఎందుకంటే పోలవరం లాంటి ప్రాజెక్టులను సందర్శించాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలని తెలీదా? హఠాత్తుగా ప్రాజెక్టు నిర్మాణాన్ని పరిశీలిస్తానంటే ప్రభుత్వం ఎలా అనుమతిస్తుంది? వందలాది మందిని వెంటేసుకుని వెళతానంటే ఏ ప్రభుత్వమైనా అనుమతిస్తుందా? అంతెందుకు తాను అధికారంలో ఉన్నపుడు వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలను అనుమతించలేదు కదా. అప్పుడు కూడా పోలీసులను మోహరించి అందరినీ అడ్డుకున్న విషయం తెలిసిందే.

వందల మందిని వెంటేసుకుని వెళితే అక్కడ జరిగే పనులకు అడ్డుపడటం తప్ప ఇంకేమైనా ఉపయోగముంటుందా? ఇక్కడ చంద్రబాబుకు కావాల్సిందేమంటే తాను ప్రాజెక్టును సందర్శించటానికి వెళితే ప్రభుత్వం అడ్డుకోవటమే కావాల్సింది. అయినా చలికాలంలో సాయంత్రం 6 గంటలకే చీకటి పడిపోతుందని తెలిసీ 7 గంటల ప్రాంతంలో ప్రాజెక్టుకు దగ్గరకు వెళ్ళటం పూర్తిగా రాజకీయమే కనిపిస్తోంది. చీకట్లో ప్రాజెక్టు దగ్గరకు వెళ్ళి చంద్రబాబు చూసేదేముంటుంది?

అక్కడ ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది? మళ్ళీ ప్రభుత్వాన్నే కదా నిందించేది. నిజంగానే చిత్తశుద్ది ఉంటే ప్రాజెక్టు సందర్శనకు అనుమతి తీసుకోవాలి. ఒకవేళ ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తే కోర్టులో పిటిషన్ వేసి అనుమతి తీసుకోవచ్చు. వైజాగ్‌లో రుషికొండ సందర్శనకు సీపీఐ కార్యదర్శి నారాయణ ఇలాగే కదా కోర్టులో పిటిషన్ వేసి అనుమతి తెచ్చుకున్నది. అలాచేస్తే రాజకీయం చేయటానికి అవకాశం ఉండదు కాబట్టి హఠాత్తుగా ప్రాజెక్టు సందర్శన పేరుతో డ్రామాకు తెరలేపారు.

First Published:  2 Dec 2022 5:38 AM GMT
Next Story