Telugu Global
Andhra Pradesh

చంద్రబాబుకు నిద్రలేకుండా చేస్తున్న ‘2జీ’ లు

వైసీపీకి గట్టిపట్టున్న నియోజకవర్గాల్లో గెల‌వాలంటే టీడీపీ తరపున గట్టి అభ్యర్థులను ముందే ప్రకటించాలన్న చిన్న లాజిక్‌ను చంద్రబాబు మిస్ అయ్యారు. ఏదేమైనా గుడివాడ‌, గ‌న్న‌వ‌రం నియోజకవర్గాల్లో జరుగుతున్న పరిణామాలు చంద్రబాబుకు నిద్రలేకుండా చేస్తున్నాయన్నది మాత్రం వాస్తవం.

చంద్రబాబుకు నిద్రలేకుండా చేస్తున్న ‘2జీ’ లు
X

వచ్చే ఎన్నికల్లో కుప్పం, మంగళగిరి నియోజకవర్గాల్లో గెలుపును పక్కన పెట్టేస్తే మరో రెండు నియోజకవర్గాలు చంద్రబాబునాయుడుకు నిద్రలేకుండా చేస్తున్నాయనే చెప్పాలి. ఇంతకీ ఆ నియోజకవర్గాలేవంటే గుడివాడ-గన్నవరం. 2 జీలుగా పాపులరైన ఈ జంట నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపు చంద్రబాబుకు అత్యంత ప్రతిష్టగా మారిపోయింది. గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల్లో వైసీపీ తరపున అత్యంత బలమైన అభ్యర్ధులున్నారు. రాబోయే ఎన్నికల్లో గుడివాడ నుండి మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం నుండి వల్లభనేని వంశీ మోహన్ పోటీ ఖాయమైపోయింది.

టీడీపీ నుండి ఎవరిని పోటీ చేయించాలో చంద్రబాబుకు అర్థంకావటంలేదు. నిజానికి నాని, వంశీని ఢీ కొట్టేంత గట్టి అభ్యర్థులు పార్టీలో లేరు. అందుకనే రకరకాల పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. నాని, వంశీ ఇద్దరు కమ్మ నేతలే అయినప్పటికీ జనాలందరితో కలివిడిగా ఉంటారు. జనాల్లో ఈజీ యాక్సెస్ ఉండటంతో ఇద్దరికీ అన్నీవర్గాల్లోనూ మంచి పట్టుంది. ఇలాంటి వాళ్ళని ఢీ కొట్టేందుకు ఇప్పటికే గట్టి నేతలను తయారుచేసుకోవాల్సిన చంద్రబాబు ఆపని చేయలేదు.

గుడివాడలో ఇప్పటికి రావి వెంకటేశ్వరరావు, దేవినేని ఉమ, పేర్నాటి రాములు, గద్దె రామ్మోహన్ రావు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఎవరిని నిలబెడతారో తెలీదు. ముందే అభ్యర్థిని ప్రకటించేస్తే సమస్యలను అధిగమించే అవకాశం ఉందని తెలిసి కూడా చంద్రబాబు ఆ పని చేయటంలేదు. ఇక గన్నవరంలో వంశీకి ప్రత్యామ్నాయంగా గట్టి నేతను తయారు చేసుకునే అవకాశం ఉన్నా కూడా చంద్రబాబు ఉపయోగించుకోలేదు. ఏవేవో పేర్లను పరిశీలించటంతోనే పుణ్యకాలాన్ని గడిపేస్తున్నారు.

ఇంత కాలానికి పట్టాభిరామ్ పేరు ప్రచారంలోకి వచ్చింది. అదికూడా వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పోటీచేయబోయేది తానే అని పట్టాభి తనంతట తానుగా ప్రకటించుకుంటేనే. చంద్రబాబు మనసులో ఏముందో తెలియ‌దుకానీ వచ్చే ఎన్నికల్లో గుడివాడ, గన్నవరంలో టీడీపీ గెలిచి తీరాలని పదేపదే చెబుతుంటారు. వైసీపీకి గట్టిపట్టున్న నియోజకవర్గాలను గెలుచుకోవాలని అనుకున్నపుడు టీడీపీ తరపున గట్టి అభ్యర్థులను ముందే ప్రకటించాలన్న చిన్న లాజిక్‌ను చంద్రబాబు ఎందుకు ఆలోచించటం లేదో అర్థం కావటంలేదు. ఏదేమైనా పై రెండు నియోజకవర్గాల్లో జరుగుతున్న పరిణామాలు చంద్రబాబుకు నిద్రలేకుండా చేస్తున్నాయన్నది మాత్రం వాస్తవం.

First Published:  26 Feb 2023 5:57 AM GMT
Next Story