Telugu Global
Andhra Pradesh

ఓటమి భయం తెలిసిపోతోందా?

భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో చంద్రబాబు ప్రకటించిన మ్యానిఫెస్టోలో ఆరు హామీలు సంక్షేమ పథకాలకు సంబంధించింనవే.. ఎంతసేపు అభివృద్ధి, అభివృద్ధి అని జపం చేసినా జనాలు పట్టించుకోరని, సంక్షేమ పథకాల ద్వారా మాత్రమే జనాలను ఆకర్షించగలమని చంద్రబాబుకు అర్థ‌మైనట్లుంది.

ఓటమి భయం తెలిసిపోతోందా?
X

రాజమండ్రి మహానాడులో చంద్రబాబు నాయుడు ప్రకటించిన మొదటి విడత మ్యానిఫెస్టోను చూసిన తర్వాత ఓటమి భయం వెంటాడుతోందా అని అనుమానంగా ఉంది. లేకపోతే చంద్రబాబు ప్రకటించిన మ్యానిఫెస్టోలో ఒక్కటంటే ఒక్కటి కూడా అభివృద్ధికి సంబంధించిన హామీ లేదు. భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో ప్రకటించిన ఆరు హామీలు కూడా సంక్షేమ పథకాలకు సంబంధించింనవే కావటం గమనార్హం. ఎంతసేపు అభివృద్ధి, అభివృద్ధి అని జపం చేసినా జనాలు పట్టించుకోరని, సంక్షేమ పథకాల ద్వారా మాత్రమే జనాలను ఆకర్షించగలమని చంద్రబాబుకు అర్థ‌మైనట్లుంది.

అందుకనే ఎలాంటి మొహమాటం లేకుండా వైసీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఆప్ పథకాలను హ్యాపీగా కాపీ కొట్టేశారు. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఏపీ శ్రీలంకలాగ అయిపోతోందని చంద్రబాబు అండ్ కో ఎంత గోల చేశారో అందరూ చూసిందే. మరి ఇప్పటికన్నా మరింత ఎక్కువగా సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చంద్రబాబు హామీ ఇవ్వటంలో అర్థ‌మేంటి?

జగన్ అమలు చేస్తున్న పథకాలతో శ్రీలంకలాగ అయిపోతున్న ఏపీ చంద్రబాబు హామీలతో అమెరికాలాగ తయారవుతుందా? మొత్తంమీద మ్యానిఫెస్టోను చూస్తే అర్థ‌మవుతున్నదేమంటే చంద్రబాబులో ఓటమి భయం పెరిగిపోతోందని. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి రావటానికి జగన్ ఎంచుకున్న మార్గం సంక్షేమ పథకాల అమలే అని చంద్రబాబు గట్టిగా నమ్ముతున్నారు. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు కాబట్టి జగన్ నమ్ముకున్నారంటే అర్థ‌ముంది. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే గాలికొదిలేసిన చంద్రబాబు ఏ విధంగా తన హామీలను నమ్ముతారని అనుకుంటున్నారో ఆశ్చర్యంగా ఉంది.

2014 ఎన్నికల్లో ఆచరణ సాధ్యంకాని అనేక హామీలిచ్చారు చంద్రబాబు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు. దాని ఫలితమే 2019లో టీడీపీ ఘోర పరాజయం. అయితే జగన్ అలాకాదు. 2019 ఎన్నికల్లో నవరత్నాల రూపంలో ఇచ్చిన హామీలను చాలా వరకు అమలు చేస్తున్నారు. పథకాల అమలులో జగన్ ప్రభుత్వంపై ఎక్కడా ఫిర్యాదులు లేవు. అందుకనే తన ప్రభుత్వాన్ని జగన్ సంక్షేమ ప్రభుత్వంగా చెప్పుకుంటున్నది. ఇక్కడే హామీల అమలులో జగన్ - చంద్రబాబు మధ్య తేడాను జనాలు బేరీజు వేసుకుంటారు. మరి దాని ఫలితం 2024 ఎన్నికల్లో ఎలాగుంటుందో చూడాలి.

First Published:  30 May 2023 5:40 AM GMT
Next Story