Telugu Global
Andhra Pradesh

జగన్ పద్మవ్యూహంలో బాబు !

ఎల్లో మీడియాను, పవన్‌ కల్యాణ్‌ను చంద్ర‌బాబు నమ్ముకుంటే.. ముఖ్యమంత్రి జగన్‌ ప్రజలను మాత్రమే నమ్ముకున్నారు. రాష్ట్రం, సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్తు తరాల గురించి జగన్ ప్రతిచోటా ప్రస్తావిస్తున్నారు. హింస, అశాంతి, అరాచకం, రెచ్చగొట్టడం లాంటి మాటలు చంద్రబాబు నోట వెలువడుతున్నాయి.

జగన్ పద్మవ్యూహంలో బాబు !
X

ఏపీ సీఎం వైఎస్ జగన్ పద్మవ్యూహంలో చంద్రబాబు చిక్కుకున్నారు. ఆయన చేతిలో మీడియా, ధనబలం, అపార అనుభవం అనే ఆయుధాలున్నప్పటికీ జగన్‌తో పోరాడలేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 2019 నుంచే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి కాలం కలిసి రావడం లేదు. పరిస్థితి అనుకూలంగా లేకపోతే తాడు కూడా పాము అయి కరుస్తుందనే నానుడి చంద్రబాబుకు సరిగ్గా సరిపోతోంది. ఎల్లో మీడియాను, పవన్‌ కల్యాణ్‌ను ఆయన నమ్ముకుంటున్నారు. కానీ ముఖ్యమంత్రి జగన్‌ ప్రజలను మాత్రమే నమ్ముకున్నారు. రాష్ట్రం, సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్తు తరాల గురించి జగన్ ప్రతిచోటా ప్రస్తావిస్తున్నారు. హింస, అశాంతి, అరాచకం, రెచ్చగొట్టడం లాంటి మాటలు చంద్రబాబు నోట వెలువడుతున్నాయి. 40 ఏళ్ల రాజకీయ అనుభవం నుంచి నేర్చుకున్నదేమిటో కనిపించడం లేదు. 14 ఏళ్ల పాటు సీఎంగా గడించిన రాజకీయ పాండిత్యం ఎక్కడికి పోయిందో అంతుచిక్కడం లేదు.

15 ఏళ్లు ప్రతిపక్ష నాయకునిగా చంద్రబాబు పోరాడినదాని కంటే ఆయన తరపున 'ఈనాడు' చేసిన పోరాటమే ఎక్కువ అన్నది జగద్వితం. చంద్రబాబు సీఎంగా, ప్రతిపక్ష నాయకుడిగా సక్సెస్ గ్రాఫ్ ఏమిటో అందరికీ తెలుసు. చంద్రబాబు మాటలు చెబుతాడని, అరచేతిలో స్వర్గం చూపిస్తాడని, ఆయన పాలనలో సంపన్నులు మరింత సంపన్నులుగా మారారని విమర్శలున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఒక్క శాతం ప్రయోజనాన్ని కూడా చంద్రబాబు చేయలేకపోయారన్న అపవాదు ఉంది.

చంద్రబాబు సభలకు ప్రజలు ఎందుకు రావాలని సీఎం జగన్ కీలకమైన ప్రశ్న వేస్తున్నారు. ఆయన ప్రశ్నలో లోతైన అర్థం ఉంది. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఏమీ చేయలేదని జగన్ చేస్తున్న వ్యాఖ్యలు ప్రజల్ని సూటిగా తాకుతున్నాయి. తన సభలకు ప్రజలు రారని చంద్రబాబు అభిప్రాయానికి వచ్చారేమో! అందుకే ఇరుకు సందుల్లో సభలు ,ర్యాలీలు. ఫలితంగా 11 మంది మృతి. దీని మీద పవన్ కల్యాణ్ స్పందించిన తీరుపై ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద చర్చే జరుగుతోంది. కందుకూరులో 8 మంది చనిపోయినప్పుడు 'దురదృష్టకరం' అని, గుంటూరులో ముగ్గురు చనిపోయినప్పుడు 'దిగ్బ్రాంతికరం' అంటూ చేతులు దులుపుకున్నాడు. కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఇప్పటంలో మొండి గోడలకు ఉన్న విలువ, 11 మంది ప్రాణాలకు లేదా అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కానీ ఒక్కటి మాత్రం స్పష్టమైంది. పవన్‌ కల్యాణ్ అనే నాయకుడు నాయకుడు కాదు ఆయన చంద్రబాబు దత్తపుత్రుడే అని కందుకూరు, గుంటూరు ఘటనలపై ఆయన స్పందించిన తీరుతో రాష్ట్ర ప్రజలకు అర్థమైంది.

వీకెండ్‌లో హైదరాబాద్‌ నుంచి ఏపీలో వాలిపోయే పవన్‌ కల్యాణ్.. కందుకూరు ఘటన తరువాత రాష్ట్రంలో అడుగుపెట్టలేదు ఎందుకు..? చంద్రబాబుకు పవన్‌ కల్యాణ్ రక్తం పంచుకుని పుట్టిన కొడుకు కాకపోయినప్పటికీ అంత కంటే ఎక్కువ సేవ చేస్తున్నాడన్న విమర్శలను పవన్ మూట కట్టుకుంటున్నారు. పవన్ తోక పట్టుకొని 2024 ఎన్నికల గోదారిని ఈదాలనే చంద్రబాబు ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో అంచనాకు అందడం లేదు. కందుకూరు, గుంటూరు దుర్ఘటనల తర్వాత జగన్ ప్రభుత్వం జీవో నెంబర్ 1 తీసుకురావడంతో విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.

తాను ఇక అధికారంలోకి రాలేనన్న అనుమానాలు చంద్రబాబుకు ఉన్నాయి. ఇంకోవైపు తన కుమారుడు రాజకీయ జీవితం కూడా చంద్రబాబుకు అంధకారంగానే కనిపిస్తోంది. టీడీపీ రోజురోజుకూ నిర్వీర్యమై పోతుందని అంతర్గత సమావేశాల్లో చంద్రబాబు అన్న మాటలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి.

దత్తపుత్రుడుగా ఆరోపణలకు గురవుతున్న పవన్ కల్యాణ్ మాటలూ జనం నమ్మడం లేదు. సొంత పుత్రుడు లోకేష్ బయటకు వస్తే ఆయన మాట్లాడే మాటలకు జనం నవ్వుకుంటున్నారు. జనవరి 27 నుంచి తలపెట్టిన పాదయాత్రలో లోకేశ్ తనను తాను ఒక నాయకునిగా ఆవిష్కరించుకోవాల్సి ఉంది. ఎల్లో మీడియా వార్తలనూ ప్రజలు విశ్వసించడం లేదు. ఒక పక్క సీఎం జగన్ సభలు కళకళ లాడుతున్నాయి. చంద్రబాబు సభలకూ కొన్ని చోట్ల జనం బాగానే హాజరవుతున్నారు. టీడీపీ రాజకీయ వ్యూహకర్త రాబిన్ శర్మ తన బుర్రకు తట్టిన ఓ ఐడియాను బాబు చెవిలో పడేశారు. ఆ ఐడియా ప్రకారమే ఇరుకు సందుల్లో, ఇరుకు రోడ్లపై సభలు పెట్టి జనం బాగా వచ్చారని ఎల్లో మీడియాలో ప్రచారం ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. రాబిన్‌ శర్మ వ్యూహం ఇప్పుడు టీడీపీ ఉనికిని ప్రశ్నార్ధకం చేసింది.

మూడున్నరేళ్ల తన పాలనలో వైఎస్‌ జగన్‌ రూ. 3.30 లక్షల కోట్లు ప్రజలకు ప్రత్యక్షంగా ఇచ్చారు. దీనిలో రూ.1.85 కోట్లు డీబీటీ ద్వారా ఇచ్చారు. దీనిలో అత్యధికంగా లాభ పడింది 134 కులాలు ఉన్న బీసీలు. 1982లో టీడీపీ స్థాపించిన తరువాత బీసీలే ఆ పార్టీకి వెన్నుముకగా ఉన్నారు. కానీ టీడీపీలో పెత్తనం కమ్మ సామాజిక వర్గానిదే. 1995లో ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన తరువాత బీసీలను ఓటు బ్యాంకుగానే చూశారు. కానీ..జగన్ ఈ మూడున్నరేళ్లలో బీసీలను వెన్నుముకగా మార్చారు. బీసీలే కాదు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు చంద్రబాబుకు దూరమయ్యారు. వైఎస్‌ఆర్‌సీపీకి ఉన్న 8 మంది రాజ్యసభ సభ్యుల్లో నలుగురు బీసీలే. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఇద్దరు బీసీలనే రాజ్యసభకు పంపారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనను, జగన్ ప్రస్తుత పాలనను ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు.

ఇప్పుడు చంద్రబాబుకు అర్జంట్‌గా బీజేపీ అనే ఊతకర్ర అవసరం. అందుకోసం.. 'ఇరుకు విన్యాసాలు' చేస్తున్నారు. ఏపీలో 'ఇరుకు విజువల్స్‌' చూపించి తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనేది చంద్రబాబు ఆలోచన. డ్రోన్‌ విజువల్స్‌ ఢిల్లీలో చూపించి, రానివారిని వచ్చినట్లుగా చూపించి రాజకీయ లబ్ధి పొందాలనేది రాబిన్ శర్మ, చంద్రబాబు ఆలోచన.

పెద్దలు చేసిన పాపాలు పిల్లలకు తగులుతాయంటారు.'దత్తతండ్రి' చేసిన పాపాలు 'దత్తపుత్రుడి'కి తగులుతున్నాయి. పవన్ కల్యాణ్ చేత జనసేన పార్టీ పెట్టించి చంద్రబాబు, రామోజీరావులే నిధులు సరఫరా చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చర్చ ఉంది. జనసేన ప్రయోజనాలు చంద్రబాబు చుట్టూ బొంగరంలా తిరుగుతున్నాయి. 2014లో ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేయకుండా కాపుల ఓట్లు కొంత శాతం చంద్రబాబుకు బదిలీ అయ్యేలా చూశారు. తాజాగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీ రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. పొత్తులు, సీట్లు..ఇతర అంశాలపై ఇద్దరూ చర్చించుకున్నారు. కానీ బీజేపీ వైఖరిని బట్టి రెండు పార్టీల మధ్య 'అవగాహన' ఖరారు అవుతుంది.

Next Story