Telugu Global
Andhra Pradesh

వాళ్లు వస్తే ఎలా అడ్జెస్ట్ చేయాలి! డైలమాలో చంద్రబాబు..

చంద్రబాబు వ్యూహాలకో.. నిజంగానే వైసీపీలో ఇమడలేకనో.. వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదనే అనుమానంతోనే చాలా మంది అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నేతలు టీడీపీలోకి జంప్ అవ్వాలని భావిస్తున్నారు.

వాళ్లు వస్తే ఎలా అడ్జెస్ట్ చేయాలి! డైలమాలో చంద్రబాబు..
X

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఎదుర్కుంటున్న పరిస్థితికి పార్టీ నాయకులే విస్తుపోతున్నారు. సాధారణంగా ఇతర పార్టీల నుంచి ఎవరైనా ఎమ్మెల్యేలు, నేతలు పార్టీలో చేరతామని అడగగానే కాదనకుండా ఓకే చెప్పే చంద్రబాబుకు.. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రాజకీయాలు తలనొప్పిగా మారాయి. అధికార వైసీపీని అధికారం నుంచి కూలగొట్టడానికి ఎన్నో వ్యూహాలు రచిస్తున్న చంద్రబాబు.. జనసేన, బీజేపీ పొత్తుకోసం పాకులాడుతున్నారు. అదే సమయంలో వైసీపీని బలహీనపరిచే వ్యూహాలు కూడా సిద్ధం చేసి, ఇప్పటికే అమలు చేస్తున్నారు.

చంద్రబాబు వ్యూహాలకో.. నిజంగానే వైసీపీలో ఇమడలేకనో.. వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదనే అనుమానంతోనో చాలా మంది అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నేతలు టీడీపీలోకి జంప్ అవ్వాలని భావిస్తున్నారు. ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి వంటి సీనియర్లు పార్టీ మారుతున్నామని బహిరంగంగానే సిగ్నల్స్ ఇచ్చారు. ఇది నిజంగా చంద్రబాబుకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చే వార్తలే. ఇలా అధికార పార్టీకి చెందిన వారు.. ఎంత మందిని వచ్చినా చేర్చుకుందామనే ఆలోచనతోనే చంద్రబాబు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఇక్కడే పెద్ద సమస్య వచ్చి పడింది.

నాలుగేళ్లుగా అధికారానికి దూరమై.. పార్టీనే అంటిపెట్టుకొని.. వచ్చే సారైనా గెలుస్తామనే ధీమాతో చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రభుత్వంపై పోరాడుతున్న నేతలు మాత్రం ఈ చేరికలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇన్నాళ్లు మేం చేసిన పోరాటాలు మరిచిపోయి.. కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇస్తే మా గతేంటని కొంత మంది ఇప్పటికే చంద్రబాబు వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తున్నది.

లోకేశ్ పాదయాత్ర కోసం మేము ఏర్పాట్లు చేస్తూ.. దాన్ని విజయవంతం ఎలా చేయాలని కష్టపడుతుంటే.. కొత్తగా పార్టీలో చేరే వారికి టికెట్ హామీ ఇచ్చి చేర్చుకుంటాననడం ఎంత వరకు భావ్యమని వారు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ నుంచి వచ్చే వారిని చేర్చుకుందామనే ఆనందాన్ని కాస్తా.. సొంత పార్టీ నేతలు ఆవిరి చేస్తున్నారు. దీంతో చంద్రబాబు అసలు ఏం చేయలేని డైలమాకు చేరుకున్నట్లు చర్చ జరుగుతోంది.

ప్రస్తుతానికి ఇతర పార్టీల వారిని టీడీపీలో చేరేలా ప్రోత్సహించండి.. మీకు మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకుండా చూసుకుంటానని చంద్రబాబు భరోసా ఇస్తున్నట్లు తెలుస్తున్నది. ఉత్తరాంధ్ర, నెల్లూరు జిల్లాల్లో చాలా మంది టీడీపీ నేతలు చంద్రబాబు ఇలాంటి చేరికలను ప్రోత్సహించడం పట్ల గుర్రుగా ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే.. ఎన్నికల వరకు ఓపిక పట్టాలని.. ప్రస్తుతానికి టీడీపీని బలోపేతం చేసే చర్యలను మాత్రం అడ్డుకోవద్దని చెప్పినట్లు సమాచారం. మొత్తానికి కొత్తగా వచ్చే వారిని పార్టీలో ఎలా అడ్జెస్ట్ చేయాలనే మీమాంసలో మాత్రం చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తున్నది.

First Published:  12 Feb 2023 7:57 AM GMT
Next Story