Telugu Global
Andhra Pradesh

పంచాయతీలను నాశనం చేసింది చంద్రబాబు కాదా..?

అసలు పంచాయతీలు నిర్వీర్యమైపోవటానికి ప్రధాన కారణమే చంద్రబాబు. ఎలాగంటే.. తన హయాంలో పంచాయతీల గడువు ముగిసినా ఎప్పుడూ ఎన్నికలు నిర్వహించలేదు.

పంచాయతీలను నాశనం చేసింది చంద్రబాబు కాదా..?
X

చంద్రబాబునాయుడు వైఖరి అపరిచితుడి క్యారెక్టర్ వ‌లే మారిపోతోంది. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా వ్యవహరించి ప్రతిపక్షంలోకి రాగానే మ‌రోలా వ్యవహరిస్తారు. ఇప్పుడు విషయం ఏమిటంటే.. పంచాయతీ రాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో సర్పంచుల శంఖారావం జరిగింది. ఆ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. చాలా హామీలిచ్చేశారు. అవేమిటంటే స్థానిక సంస్థ‌లకే సర్వాధికారాలు ఇస్తారట. విధులు, నిధులు, గౌరవమిస్తారట. బడ్జెట్లో పంచాయతీలకు ఏకంగా 5 శాతం నిధులు కేటాయిస్తారట.

పంచాయతీల్లో వసూలయ్యే పన్నులన్నీ పంచాయతీలకే చెందేట్లు చేస్తారట. ఉపాధి పనులన్నింటినీ పంచాయతీల ద్వారానే జరిపిస్తానన్నారు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ సర్పంచుల ఆధ్వర్యంలోనే జరిపిస్తామని మాటిచ్చారు. సర్పంచులకు గౌరవ వేతనాలు పెంచుతారట. ఇప్పుడు ఇచ్చిన హామీలన్నింటికీ అధికారంలో ఉన్నప్పుడు విరుద్ధంగా వ్యవహరించిందే చంద్రబాబు. అధికారం కోసం ఎలాంటి హామీలనైనా ఇచ్చేసి అధికారంలోకి రాగానే వాటిని తుంగలో తొక్కటంలో చంద్రబాబును మించిన వారులేరని చాలాసార్లు రుజువైంది.

అసలు పంచాయతీలు నిర్వీర్యమైపోవటానికి ప్రధాన కారణమే చంద్రబాబు. ఎలాగంటే.. తన హయాంలో పంచాయతీల గడువు ముగిసినా ఎప్పుడూ ఎన్నికలు నిర్వహించలేదు. సకాలంలో ఎన్నికలు నిర్వహించకుండా అధికారులను పర్సన్ ఇన్చార్జిలుగా నియమించేవారు. అంటే ప్రజలు ఎన్నుకున్న సర్పంచుల ద్వారా కాకుండా అధికారుల ద్వారానే పంచాయతీలను నడిపించేవారు. పంచాయతీల నిధులను దారిమళ్ళించారు. సర్పంచులకు చెక్ పవర్ లేకుండా రద్దుచేశారు. పంచాయతీ నిధులను ఖర్చులు పెట్టుకోవలంటే పంచాయతీ సెక్రటరీల సంతకాలు లేకుండా చెక్కులు చెల్లవనే ఆదేశాలు జారీచేయించారు. పంచాయతీల్లో వసూలయ్యే పన్నులను సర్పంచులు ఖర్చులు పెట్టేందుకు లేకుండా అడ్డుకున్నారు.

పదవీకాలం పూర్తయిన వెంటనే ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలిచ్చినా.. వాటిని బాబు ఖాత‌రు చేయ‌లేదు. అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీలను అన్నీ విధాలుగా నిర్వీర్యం చేసిన చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు నోటికొచ్చినట్లు హామీలిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీలను పూర్తిగా దెబ్బకొట్టి మళ్ళీ అధికారంలోకి వస్తే అది చేస్తాను.. ఇది చేస్తానని చంద్రబాబు హామీలు గుప్పిస్తుండటమే విచిత్రంగా ఉంది. చంద్రబాబు వ్యవహారం అప్పట్లో సర్పంచులుగా పనిచేసిన వారందరికీ అనుభవంలో ఉన్నదే. జగన్మోహన్ రెడ్డి వ్యవహారశైలితో టీడీపీకి ఓట్లేయాలే కానీ, చంద్రబాబు హామీలను నమ్మి ఎవరు ఓట్లేయరు.

First Published:  4 Jan 2024 4:48 AM GMT
Next Story