Telugu Global
Andhra Pradesh

చంద్రబాబుకు కొత్త తలనొప్పి ...స్వంత పార్టీ నాయకుల నుండే ఇబ్బందులు

స్థానిక సమస్యలపై ప్రజలను కదిలించాలని, స్థానిక ఎమ్మెల్యేల‌ అవినీతి, ప్రజా వ్యతిరేక కార్యకలాపాలపై పోరాడాలని నియోజకవర్గ ఇంచార్జులందరికీ చంద్రబాబు స్వయంగా ఆదేశాలిచ్చినా చాలా మంది పట్టించుకోవడం లేదట. ఎప్పుడో ఒక సారి స్థానిక తెలుగు దేశం కార్యాలయానికి వెళ్ళి, పది మంది అనుచరులతో కలిసి ఫోటోలు దిగి వాటినే కేంద్ర కార్యాలయానికి పంపి కాలం వెళ్ళదీస్తున్నారట.

చంద్రబాబుకు కొత్త తలనొప్పి ...స్వంత పార్టీ నాయకుల నుండే ఇబ్బందులు
X

ఏపీలో తెలుగుదేశం అధినాయకత్వానికి కొత్త తలనొప్పి పట్టుకుందట. ఏరికోరి తాము నియమించిన నియోజకవర్గ ఇంచార్జులు కొందరు పార్టీ బలోపేతానికి కృషి చేయకుండా స్థానిక వైసీపీ ఎమ్మెల్యేల‌తో, నేతలతో రాసుకపూసుక తిరుగుతున్నారట. నియోజకవర్గానికి సంబంధించి అధినాయకత్వానికి తప్పుడు రిపోర్టులు ఇస్తూ పక్కదోవపట్టిస్తున్నారట. ఇప్పుడు ఈ విషయంపై ఆ పార్టీ సర్కిల్ లో తీవ్ర చర్చ జరుగుతోంది.

స్థానిక సమస్యలపై ప్రజలను కదిలించాలని, స్థానిక ఎమ్మెల్యేల‌ అవినీతి, ప్రజా వ్యతిరేక కార్యకలాపాలపై పోరాడాలని నియోజకవర్గ ఇంచార్జులందరికీ చంద్రబాబు స్వయంగా ఆదేశాలిచ్చినా చాలా మంది పట్టించుకోవడం లేదట. ఎప్పుడో ఒక సారి స్థానిక తెలుగు దేశం కార్యాలయానికి వెళ్ళి, పది మంది అనుచరులతో కలిసి ఫోటోలు దిగి వాటినే కేంద్ర కార్యాలయానికి పంపి కాలం వెళ్ళదీస్తున్నారట.

ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ సంఘటన అధిష్టానం దృష్టిలో పడిందని సమాచారం. నరసరావుపేటలో కొద్ది రోజుల క్రితం టీడీపీకి చెందిన ఓ ముస్లిం నాయకుడి హత్య జరిగింది. అయితే అతని హత్యపై స్థానిక టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ అరవింద్ బాబు కానీ, ఇతర నాయకులు కానీ ఏ మాత్రం పట్టించుకోకపోగా ఆ హతుడికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ప్రచారం కూడా చేశారట. అంతే కాదు ఈ హత్య పై నిజానిజాలు తెలుసుకునేందుకు పార్టీ అధిష్టానం నజీర్ అనే ఓ నాయకుడిని నర్సారావు పేటకు పంపారు. అయితే స్థానిక నాయకులు ఆ నజీర్ కు ఏ మాత్రం సహకరించకపోగా వెనక్కి వెళ్ళిపోవాలని వెంటపడ్డారట. ఇక్కడ అసలు సమస్యేలేదు మీరు వెళ్ళిపోతేనే మంచిది అంటూ ఆయన వెళ్ళిపోయిందాకా పలువురు నేతలు ఆయనను వదిలిపెట్టలేదట. గత్యంతరం లేక వెనుతిరిగి విజయవాడకు వెళ్ళిపోయిన నజీర్ అక్కడ జరిగిన విషయాన్ని నాయకత్వానికి నివేదించాడు.

విషయమంతా తెలుసుకున్న టీడీపీ నాయకత్వం ఎందుకిలా జరిగిందనే విషయం ఆరా తీయగా నరసారావు పేటలో టీడీపీ ముఖ్యనేతలందరికీ వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తేలిందట. దా‍ంతో ఉలిక్కిపడ్డ బాబు అక్కడ ఒక్క చోటేనా లేదా ఇలా మరిన్ని నియోజక వర్గంలో కూడా జరుగుతుందా అంటూ ఆరా తీస్తున్నారట.

ఒకవైపు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావడం కోసం ఒకవైపు పవన్ కళ్యాణ్ తో స్నేహం చేస్తూ, బీజేపీకి కూడా దగ్గర కావాలని ప్రయత్నిస్తూ, తాను స్వయంగా ఊరూరు తిరుగుతూ కష్టపడుతూ ఉంటే, మరో వైపు లోకేష్ కూడా పాదయాత్ర మొదలుపెడుతున్న సమయంలో స్వంత పార్టీ నాయకులే తమకు హ్యాండిచ్చి అధికార పక్షంతో చెట్టాపట్టాలేసుకొని తిరగడాన్ని చంద్రబాబు భరించలేకపోతున్నారట.

మరి అలా‍ంటి నాయకులపై తెలుగుదేశం అధిష్టానం చర్యలు తీసుకుంటుందా లేక చూసీ చూడనట్టు ఊరుకుంటుందా అనేది తేలాల్సి ఉంది.

First Published:  30 Dec 2022 8:01 AM GMT
Next Story