Telugu Global
Andhra Pradesh

చంద్ర‌బాబుకు ఇంటిపోరు త‌ప్ప‌దా..!?

తెలుగుదేశంలో అంతర్గత పోరు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. కింజ‌ర‌పు అచ్చెన్నాయుడు, రామ్మోహ‌న నాయుడు, కేశి నేని నాని, చిన్నిల వ్యవహారం ఎలా పరిష్కరించాలో అర్దంకాక బాబు తలపట్టుకుంటున్నారట.

Chandrababu Naidu
X

టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడు

రానున్న ఎన్నిక‌ల్లో ఎలాగైనా అధికారంలోకి రావాల‌న్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు ఇంటిపోరుతో స‌త‌మ‌తం అవుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా మినీ మహానాడులు నిర్వ‌హిస్తూ అభ్య‌ర్ధుల ఎంపిక‌లో త‌ల‌మున‌క‌ల‌వుతున్న ఆయ‌న‌కు కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌త్తిమీద సాము త‌ప్పేట్టు లేదు. ఇప్ప‌టికే శ్రీ‌కాకుళం జిల్లాలో ఎంపీ కింజ‌ర‌పు రామ్మోహ‌న నాయుడు వ్య‌వ‌హారం అధిష్టానానికి మింగుడుప‌డ‌డం లేదు. ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో అసెంబ్లీకి పోటీ చేయాల‌నుకుంటున్న‌ట్టు క‌రాఖండీగా చెప్పేశార‌ని అంటున్నారు. ఆయ‌న బాబాయ్ సీనియ‌ర్ నేత కింజ‌ర‌పు అచ్చెన్నాయుడు అసెంబ్లీకి పోటీ చేయ‌డం ఖాయంగా ఉన్న‌ప్పుడు రామ్మోహ‌న్ ను కూడా అసెంబ్లీకి పోటీ చేయిస్తే మ‌రింత త‌ల‌నొప్పులు ఎదుర‌వుతాయ‌ని పార్టీలో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఒక‌వేళ పార్టీ అధికారంలోకి వ‌స్తే బాబాయ్‌, అబ్బాయ్ ల‌కు ప‌ద‌వుల విష‌యంలో మ‌ళ్ళీ స‌మ‌స్య త‌లెత్త‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు. అందుకు అబ్బాయ్ ని స‌ముదాయించేందుకు చంద్ర‌బాబు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఆ ప్ర‌య‌త్నాలు ఎంత‌మేర‌కు ఫ‌లిస్తాయ‌నేది రానున్న‌రోజుల్లో తేల‌నుంది.

ఇదిలా ఉండ‌గా, విజ‌య‌వాడ పార్ల‌మెంటు స‌భ్యుడు కేశినేని నాని వ్య‌వ‌హారం టిడిపి కి మ‌రో త‌ల‌నొప్పిగా మారింది. కేశినేని నాని, ఆయ‌న సోద‌రుడు చిన్ని ల మ‌ధ్య ఏర్ప‌డిన బేదాభిప్రాయాలు చినికి చినికి గాలివాన‌లా మారాయి. చంద్ర‌బాబు ప్రోత్సాహంతోనే త‌న సోద‌రుడు చిన్ని త‌న‌కు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని నాని భావిస్తున్నారు. అంత‌కు ముందు నుంచే చంద్ర‌బాబు త‌న‌ను నిర్ల‌క్ష్యం చేస్తున్నార‌ని నాని కినుక‌తో ఉన్నారు. విజ‌య‌వాడ మేయ‌ర్ ప‌ద‌వికి నాని కూతురు పోటీ చేసినప్పుడు కొంద‌రు నాయ‌కులు కార్య‌ర్త‌లు ఈ విష‌యంలో త‌న‌కు స‌హ‌క‌రించ‌క‌పోగా వెన్నుపోటు పొడిచార‌ని అందుకే త‌న కూతురు ఓడిపోయింద‌నే బాధ నానికి ఉంది. ఈ విష‌యాన్ని ప‌లు సంద‌ర్భాల్లో ఆయ‌న అధిష్టానం వ‌ద్ద చెప్పినా వారిపై చంద్ర‌బాబు ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌నే అసంతృప్తి కూడా ఉంది.

ఈ మ‌ధ్య‌లో చిన్ని భార్య‌పై నాని కారు విష‌యంలో ఫిర్యాదు చేయ‌డంతో చిన్ని ఆగ్ర‌హంగా ఉన్నారు. ఈ వ్య‌వ‌హారంలో అన్న‌ద‌మ్ములిద్ద‌రూ బ‌హిరంగంగా విమ‌ర్శ‌లు చేసుకున్నారు. చిన్ని ఇంత దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తూ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను గంద‌ర‌గోళ ప‌రుస్తున్నార‌ని, అయినా అధిష్టానం ప‌ట్టించుకోవ‌డంలేద‌ని నాని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. పార్టీ మంచి కోసం తాను చెబుతున్న మాట‌ల‌ను చంద్ర‌బాబు ప‌ట్టించుకోకుండా త‌న చుట్టూ ఉన్న వ్య‌క్తుల‌కే ప్రాధాన్య‌మిస్తూ త‌న‌ను నిర్ల‌క్ష్యం చేస్తున్నార‌ని నాని అసంతృప్తిగా ఉన్నారు. ఇంత జ‌రుగుతున్నాచంద్ర‌బాబు మౌనంగా ఉండ‌డం నానికి మ‌రింత ఆగ్ర‌హం క‌లిగించింది.

ఇటీవ‌ల ఢిల్లీలో కొంద‌రు పార్ల‌మెంటు స‌భ్యుల‌కు నాని విందు ఏర్పాటు చేశారు. దానికి పలువురు వైసీపీ ఎంపీలు కూడా హాజ‌ర‌య్యారు. ఈ నేపథ్యంలోనే నాని పార్టీ మార‌నున్నార‌నే ఊహాగానాలు కూడా వెలువ‌డ్డాయి. అదే సంద‌ర్భంలో నాని వ్యాఖ్య‌లు కూడా వాటిని బ‌ల‌ప‌రిచేలా ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు మిన్న‌కుండి పోవ‌డంతో నాని ప‌ట్ల పార్టీ వైఖ‌రి ఏంటో తేట‌తెల్లం అవుతోంద‌ని ఆయ‌న అనుచ‌రులు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌రో సంచ‌ల‌నం..వంగ‌వీటితో చిన్ని భేటీ !

ఇంత జ‌రుగుతున్నా, అది కేశినేని కుటుంబ వ్య‌వ‌హార‌మ‌ని చంద్ర‌బాబు ఎలా జోక్యం చేసుకుంటార‌ని కొందరు టీడీపీ నేతలు ప్ర‌శ్నిస్తున్నారు. నాని అంటే చంద్ర‌బాబు కు ఎటువంటి వ్య‌తిరేక‌త లేద‌ని నాని పార్టీ కూడా మార‌బోర‌ని చెబుతున్నారు. మ‌రోవైపు కేశినేని చిన్ని రాజ‌కీయంగా మ‌రింత చురుకుగా దూసుకు పోతున్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో ఆయ‌న టిడిపి త‌ర‌పున పోటీ చేస్తార‌ని , అదీ విజ‌య‌వాడ పార్ల‌మెంటు స్థానంనుంచే బ‌రిలో దిగుతార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. చంద్ర‌బాబు కూడా ఆయ‌న వైపే మొగ్గు చూపుతున్నార‌ని అంటున్నారు. ఇప్ప‌టికే చిన్ని విజ‌య‌వాడ పార్ల‌మెంటు ప‌రిధిలోని నందిగామ‌, తిరువూరు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టించి కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. రానున్న రోజుల్లో మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా ప‌ర్య‌టించి మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టుకోవాల‌ని యోచిస్తున్న‌ట్టు స‌మాచారం. గ‌త ఎన్నిక‌ల్లో నాని గెలుపు కోసం చిన్ని గ‌ట్టిగా ప్ర‌య‌త్నించడంతో పార్టీ శ్రేణుల్లో ఆయ‌న‌కు కూడా మంచి ప‌ట్టు ఉంది.

ఈ నేప‌ద్యంలో సోమ‌వారంనాడు కేశినేని చిన్ని టిడిపి నేత వంగ‌వీటి రాధా తో స‌మావేశం కావ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో ముఖ్యంగా విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం రేపుతోంది. సామాజిక స‌మీక‌ర‌ణ‌ల ప్ర‌కారం వంగ‌వీటి రంగా, రాధా అభిమానుల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టుకోవ‌డం తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్ధికి ఇక్క‌డ చాలా అవ‌స‌రం. అందుకే రాధ‌తో చిన్ని స‌మావేశం ప్రాధాన్యం సంత‌రించుకుంది. వీరిరువురి భేటీకి ఎటువంటి రాజ‌కీయ ప్రాధాన్యం లేద‌ని కేవ‌లం మ‌ర్యాద పూర్వ‌క భేటీయేన‌ని వాళ్ళు పైకి చెబుతున్నా వారి మ‌ధ్య ఎన్నిక‌ల రాజ‌కీయాల‌పైనే చ‌ర్చ జ‌రిగింద‌ని వినిపిస్తోంది. మ‌రి రాధా ఈ అన్న‌ద‌మ్ముల్లో ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇస్తారు.. అస‌లు వ‌చ్చేఎన్నిక‌ల్లో నాని పోటీ చేస్తారా లేదా అనేది సందేహంగా ఉంది. చిన్ని ప్ర‌య‌త్నాలు చూస్తుంటే ఆయ‌నవైపే అధిష్టానం మొగ్గు చూపుతుంద‌నే అభిప్రాయాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఒక వేళ నాని ఇండిపెండెంటుగా కానీ లేక బిజెపిలో చేరి కానీ విజ‌య‌వాడ పార్ల‌మెంటు స్థానం నుంచి పోటీ చేస్తారా అనే అనుమానాలు కూడా వ్య‌క్త‌ప‌రిచేవారు లేక‌పోలేదు. నానిని బీజేపీలోకి తీసుకెళ్ళేందుకు ప్ర‌స్తుతం బిజెపిలో ఉన్నసీఎం ర‌మేష్ ప్ర‌య‌త్నిస్తున్నార‌నే వార్త‌లు వ‌చ్చాయి. వాటిని ఆయ‌న ఖండించ‌క‌పోగా న‌ర్మ‌గ‌ర్భంగా ఏదైనా జ‌ర‌గొచ్చ‌నే రీతిలో మాట్లాడ‌డం ఈ ఊహాగానాల‌కు మ‌రింత ఊత‌మిస్తోంది. మ‌రి ఈ వ్య‌వ‌హారం చంద్ర‌బాబుకు మ‌రింత సవాలుగా మారుతుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రి ఎన్నిక‌ల నాటికి ఇంటిపోరును చంద్ర‌బాబు ఎలా అధిగ‌మిస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

First Published:  1 Aug 2022 2:07 PM GMT
Next Story