Telugu Global
Andhra Pradesh

మరో కేసులో బాబుకి బెయిల్.. అయినా లాభం లేదు

అంగళ్లు కేసులో చంద్రబాబుని ఏ-1గా చేర్చారు పోలీసులు. హత్యాయత్నంతోపాటు ఇతర సెక్షన్లు జోడించారు. ఈ కేసులో మొత్తం 179మంది పేర్లు చేర్చారు. ఇప్పటికే పలువురికి బెయిల్ మంజూరుకాగా.. తాజాగా చంద్రబాబుకి కూడా ముందస్తు బెయిల్ రావడం విశేషం.

మరో కేసులో బాబుకి బెయిల్.. అయినా లాభం లేదు
X

బెయిల్ పిటిషన్ల వరుస తిరస్కరణలతో తల బొప్పి కట్టిన చంద్రబాబుకి ఇప్పుడిప్పుడే రోజులు కలిసొస్తున్నట్టుగా ఉన్నాయి. ఇటీవల ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబుని అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులివ్వగా.. ఇప్పుడు అంగళ్లు కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం విశేషం. అయితే ఎన్ని బెయిళ్లు వచ్చినా.. ప్రస్తుతం స్కిల్ కేసులో జైలులో ఉండటంతో ఆయనకు ఒరిగేదేమీ లేదని చెప్పాలి.

అంగళ్లు అల్లర్ల కేసులో ఈనెల 12(గురువారం)వరకు ఆయన్ను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఇదివరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అయితే చంద్రబాబు ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. లక్ష రూపాయల పూచీకత్తు సమర్పించాలని పేర్కొంది.

అంగళ్లు పర్యటనలో చంద్రబాబు వర్గమే పోలీసులపై దాడి చేసి గాయపరిచిందనేది అసలు కేసు. అయితే వైసీపీ వాళ్లు తమను రెచ్చగొట్టారని, బాధితులపైనే కేసు పెట్టారంటూ టీడీపీ నేతలంటున్నారు. అంగళ్లు కేసులో చంద్రబాబుని ఏ-1గా చేర్చారు పోలీసులు. హత్యాయత్నంతోపాటు ఇతర సెక్షన్లు జోడించారు. ఈ కేసులో మొత్తం 179మంది పేర్లు చేర్చారు. ఇప్పటికే పలువురికి బెయిల్ మంజూరుకాగా.. తాజాగా చంద్రబాబుకి కూడా ముందస్తు బెయిల్ రావడం విశేషం. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో చంద్రబాబుని 16వ తేదీ (సోమవారం) వరకు అరెస్టు చేయొద్దని కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. మిగిలినవి ఫైబర్ నెట్ కేసు, స్కిల్ డెవలప్మెంట్ కేసు. వీటిల్లో చంద్రబాబుకి బెయిల్ వచ్చినా, ఆయన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో అనుకూల తీర్పువచ్చినా.. రాజమండ్రి జైలునుంచి ఆయనకు తాత్కాలిక విముక్తి లభించే అవకాశముంది.


First Published:  13 Oct 2023 6:58 AM GMT
Next Story