Telugu Global
Andhra Pradesh

7 గంటలు, 50 ప్రశ్నలు.. ముగిసిన ఫస్ట్ డే కస్టడీ

చంద్రబాబు విచారణ ఆదివారం కూడా కొనసాగుతుంది. విచారణ నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్‌ జైలు దగ్గర పోలీసుల అలర్ట్‌ అయ్యారు.

7 గంటలు, 50 ప్రశ్నలు.. ముగిసిన ఫస్ట్ డే కస్టడీ
X

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసుకి సంబంధించి చంద్రబాబు తొలిరోజు సీఐడీ కస్టడీ ముగిసింది. మొత్తం 7 గంటలసేపు సీఐడీ బృందం ఆయన్ను విచారించినట్టు తెలుస్తోంది. 120 ప్రశ్నలు సిద్ధం చేసుకున్న అధికారులు, అందులో 50 ప్రశ్నలను సంధించారని సమాచారం. పూర్తి ప్రశ్నలు, సమాధానాలు.. సీఐడీ కోర్టుకి నివేదిక సమర్పించిన తర్వాతే తెలుస్తుంది. తొలిరోజు విచారణ మొత్తాన్ని వీడియో రికార్డ్ చేశారు.

రాజమండ్రి సెంట్రల్‌ జైలులోని కాన్ఫరెన్స్‌ హాల్‌ లో చంద్రబాబు విచారణ కొనసాగింది. ఉదయం, మధ్యాహ్నం రెండు దఫాలుగా అధికారులు చంద్రబాబుని ప్రశ్నించారు. భోజన విరామంతో పాటు విచారణలో మొత్తం నాలుగుసార్లు బ్రేకులు ఇచ్చారు. ఆయన వయసు రీత్యా ఒక వైద్య బృందాన్ని అందుబాటులో ఉంచారు. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలోని 12 మంది సభ్యుల బృందం విచారణలో పాల్గొంది. చంద్రబాబు తరపు న్యాయవాదులు దమ్మాలపాటి శ్రీనివాస్‌, సుబ్బారావు సమక్షంలో ఈ విచారణ కొనసాగింది. విచారణకు ముందు, తర్వాత చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఆదివారం కంటిన్యూ..

చంద్రబాబు విచారణ ఆదివారం కూడా కొనసాగుతుంది. విచారణ నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్‌ జైలు దగ్గర పోలీసుల అలర్ట్‌ అయ్యారు. తొలిరోజు విచారణ పూర్తయ్యాక సీఐడీ అధికారుల బృందం స్థానిక గెస్ట్‌ హౌస్ కి వెళ్లి బస చేసింది. ఆదివారం కూడా రాజమండ్రి సెంట్రల్‌ జైలు కాన్ఫరెన్స్‌ హాల్‌ లో చంద్రబాబును విచారిస్తారు. రెండోరోజు కూడా ఆయనకు వైద్య పరీక్షలు చేస్తారు.

First Published:  23 Sep 2023 7:03 PM GMT
Next Story