Telugu Global
Andhra Pradesh

మరో కృష్ణుడ్ని ప్రవేశపెట్టిన చంద్రబాబు.. అదే చేస్తే కూట‌మి ఓట‌మి ఖాయం

రాష్ట్రంలో పరిస్థితిపై ఆయన తాజాగా ఓ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో అవాకులు చెవాకులు పేలారు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగే పరిస్థితి లేదని ఆయన ఆందోళన కూడా వ్యక్తం చేశారు.

మరో కృష్ణుడ్ని ప్రవేశపెట్టిన చంద్రబాబు.. అదే చేస్తే కూట‌మి ఓట‌మి ఖాయం
X

వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలనే తాపత్రయంతో, ముఖ్యమంత్రి జగన్‌ను ఎదుర్కోలేమనే భయంతో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరో కృష్ణుడిని ప్రవేశపెట్టారు. ప్రశాంత్‌ కిశోర్‌, జయప్రకాశ్‌ నారాయణ్‌.. ఇలా ఒక్కొక్కరిని రంగంలోకి దింపిన ఆయన తాజాగా మాజీ సీఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను దించారు. ఆయన చేత చిలుక పలుకులు పలికించారు. వాలంటీర్ల వ్యవస్థపై నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ తనదైన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. నిమ్మగడ్డ ఎవరివైపో రాష్ట్ర ప్రజలకే కాదు, లోకానికంతా తెలుసు.

రాష్ట్ర సీఈసీగా ఆయన వైఎస్‌ జగన్‌పై ఎంత కక్షపూరితంగా వ్యవహరించారో తెలియంది కాదు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. జగన్‌ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని తలపెట్టినప్పుడు వాటిని జ‌ర‌గ‌నీయలేదు. తన ఇష్టప్రకారం కూడా ఎన్నికల తేదీలను ప్రకటించారు. ఆయనకు ఆ స్వేచ్ఛ ఉండవచ్చు. కానీ, జగన్‌ను చిక్కుల్లో పడేసి స్థానిక సంస్థ ఎన్నికలను టీడీపీకి అనుకూలంగా మలిచేందుకు నిమ్మ‌గ‌డ్డ ప్ర‌య‌త్నించార‌ని ఆరోప‌ణ‌లున్నాయి.

రాష్ట్రంలో పరిస్థితిపై ఆయన తాజాగా ఓ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో అవాకులు చెవాకులు పేలారు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగే పరిస్థితి లేదని ఆయన ఆందోళన కూడా వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలోని సంఘటనలను కూడా ప్రస్తావించి ఉంటే బాగుండేది. సరే, ఆ విషయాన్ని పక్కన పెడుదాం. వాలంటీర్‌ వ్యవస్థపై ఆయన ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికలు ముగిసే వరకు వాలంటీర్లను సేవలకు దూరంగా పెట్టాలని ఆయన కోరారు.

లబ్ధిదారులు సచివాలయాలకు వెళ్లి పింఛన్లు తీసుకుంటారని ఆయన అంటున్నారు. అంటే, చంద్రబాబు ప్రభుత్వ హయాంలోని పరిస్థితిని పునరుద్ధరించాలని ఆయన కోరుతున్నారు. దానివల్ల పరిస్థితి ఎదురు తిరుగుతుందని ఆయన అనుకోవడం లేదు. తమకు అత్యంత సులభంగా, కాలు కదపకుండా అందే ప్రయోజనాలను టీడీపీ కాకుండా చేసిందనే ఆగ్రహం ప్రజల్లో కలిగే అవకాశం ఉంది. అది టీడీపీకే ఎదురు తిరుగుతుంది. వారి కొంప వారే ముంచుకునేందుకే ఆ ప్రయత్నం చేస్తున్నారు.

టీడీపీ వస్తే మళ్లీ ఇదే పరిస్థితి వస్తుందని ప్రజలు భావించి, జగన్‌కు అనుకూలంగా ప్రజలు మరింతగా పోలరైజ్‌ అవకాశం ఉంటుంది. అయితే, వాలంటీర్ల వ్యవస్థనే వైఎస్‌ జగన్‌ను తిరిగి అధికారంలోకి తెస్తుందనే భయం కన్నా వారి ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను దెబ్బ తీసే ప్రమాదం ఉందనే భయం లోలోపల చంద్రబాబుకు ఉంది. దాన్ని అడ్డుకోవడం ఆయన తరం కాదనేది ఆయనకూ తెలుసు. అందుకే పొంతన లేని, అనాలోచిత చర్యలకు దిగుతున్నారు.

First Published:  24 March 2024 4:40 AM GMT
Next Story