Telugu Global
Andhra Pradesh

చంద్రబాబుకి 'కుప్పం' భయం

వైనాట్ 175 అంటున్న సీఎం జగన్, కుప్పంని కూడా వదిలేలా లేరు. దీంతో బాబు దిగిరాక తప్పలేదు. గత సంప్రదాయానికి భిన్నంగా 'కుప్పం'కు ఎక్కువ టైమ్ కేటాయిస్తున్నారు చంద్రబాబు.

చంద్రబాబుకి కుప్పం భయం
X

టీడీపీ-జనసేన కూటమిని అధికారంలోకి తీసుకురావడం కంటే ముందు చంద్రబాబు మరో పెద్ద సవాల్ ఎదుర్కొంటున్నారు. తన సొంత నియోజకవర్గం 'కుప్పం'లో గెలుపు ఆయన్ను కలవరపెడుతోంది. టీడీపీకి అచ్చొచ్చిన కుప్పం నియోజకవర్గం గత స్థానిక ఎన్నికల్లో చంద్రబాబుకి షాకిచ్చింది. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో కూడా వైసీపీ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తుంది. ముందుగానే అభ్యర్థిని ప్రకటించి మరీ చంద్రబాబుకి సవాల్ విసురుతున్నారు సీఎం జగన్. ఈ నేపథ్యంలో చంద్రబాబుకి కుప్పం గెలుపుపై అనుమానాలున్నాయి. అందుకే ఆయన పదే పదే కుప్పంపై సమీక్షలు నిర్వహిస్తున్నారు.

గతంలో చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పెద్దగా ప్రచారం నిర్వహించేవారు కాదు. ఆయన తరపున కుటుంబ సభ్యులే నామినేషన్ పత్రాలు దాఖలు చేసేవారు. కానీ ఈసారి పరిస్థితి మారింది. కుప్పంని చంద్రబాబు లైట్ తీసుకున్నట్టే ప్రజలు కూడా ఆయన్ను లైట్ తీసుకునే టైమ్ వచ్చింది. స్థానిక ఫలితాలే దానికి నిదర్శనం. పైగా వైసీపీ క్రమక్రమంగా కుప్పంలో పుంజుకుంటోంది. వైనాట్ 175 అంటున్న సీఎం జగన్, కుప్పంని కూడా వదిలేలా లేరు. దీంతో బాబు దిగిరాక తప్పలేదు. గత సంప్రదాయానికి భిన్నంగా 'కుప్పం'కు ఎక్కువ టైమ్ కేటాయిస్తున్నారు. స్కిల్ స్కామ్, జైలు, బెయిలు.. వ్యవహారం నుంచి కాస్త కోలుకున్న చంద్రబాబు కుప్పం నాయకులతో తాజాగా సమీక్ష ఏర్పాటు చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కుప్పం నాయకులతో సమావేశమయ్యారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే కుప్పం నియోజకవర్గంలో వైసీపీ అరాచకాల వల్ల అశాంతి, హింసా సంస్కృతి మొదలయ్యాయని, రాజకీయ వేధింపులు పెరిగిపోయాయని మండిపడ్డారు. తనను ఇబ్బంది పెట్టేందుకు స్థానిక నాయకులపై అక్రమ కేసులు పెట్టారని, టీడీపీ నాయకుల్ని జైళ్లకు పంపించారని ఆరోపించారు చంద్రబాబు.

త్వరలో పర్యటన..

త్వరలోనే తాను కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తానని నాయకులతో చెప్పారు చంద్రబాబు. కష్టకాలంలో తనకు అండగా నిలబడ్డవారిని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానన్నారు. కుప్పం కార్యకర్తల త్యాగాలు మర్చిపోను అని చెప్పారు. పార్టీ కేడర్‌ మరింత ఉత్సాహంగా పనిచేయాలని, కుప్పంలో నాయకుల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తానని పేర్కొన్నారు.

మొత్తమ్మీద వైసీపీ దూకుడుతో చంద్రబాబులో ఆందోళన మొదలైంది. మొదటికే మోసం వచ్చేలా ఉందని ఆయన సొంత నియోజకవర్గంపై ఫోకస్ పెంచారు. గత ఎన్నికల్లో లోకేష్, పవన్ కల్యాణ్ కి జరిగిన పరాభవం ఈసారి తనకు జరగకుండా ఉండాలని ఆయన సేఫ్ గేమ్ మొదలు పెట్టారు. కుప్పం జపం చేస్తున్నారు.

First Published:  14 Dec 2023 5:29 AM GMT
Next Story