Telugu Global
Andhra Pradesh

జనాల్లోకి చంద్రబాబు కుటుంబం?

స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారనేందుకు తగిన ఆధారాలు లేవని జడ్జి అభిప్రాయపడ్డారు. ఆ వ్యాఖ్యలను అవకాశంగా తీసుకుని చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్ తొందరలోనే జనాల్లోకి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు.

జనాల్లోకి చంద్రబాబు కుటుంబం?
X

రెండు కారణాలతో చంద్రబాబు కుటుంబం రెట్టించిన ఉత్సాహంతో జనాల్లోకి వెళ్ళటానికి రెడీ అవుతోంది. మొదటి కారణం ఏమిటంటే మెడికల్ గ్రౌండ్‌పై తాత్కాలిక బెయిల్ స్థానంలో రెగ్యులర్ బెయిల్ మంజూరవ్వటం. ఇక రెండో కారణం ఏమిటంటే రెగ్యులర్ బెయిల్ ఇచ్చే సమయంలో జడ్జి చేసిన వ్యాఖ్యలే. నిజానికి చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది డాక్టర్లు ఇచ్చిన మెడికల్ రిపోర్టు ఆధారంగా మాత్రమే. కాబట్టి రెగ్యులర్ బెయిల్ ఇచ్చే విషయానికి మాత్రమే జడ్జి పరిమితమై ఉంటే బాగుండేది.

కానీ స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారనేందుకు తగిన ఆధారాలు లేవని జడ్జి అభిప్రాయపడటం, అవినీతిని నిరూపించటంలో సీఐడీ ఫెయిలైందని చెప్పటం, స్కామ్ సొమ్ములు టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరాయనే ఆధారాలు లేవని చెప్పటం లాంటి అనేక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను చూసినపుడు కేసు విచారణ జరిగి తీర్పిచ్చినట్లుగానే అనిపిస్తోంది. నిజానికి కేసు విచారణ కోర్టులో అసలు మొదలే కాలేదు. కోర్టులో విచారణ మొదలుకాకుండానే తీర్పిచ్చేసినట్లుగా ఉంది జడ్జి వ్యాఖ్యలు.

జడ్జి వ్యాఖ్యలను పట్టుకుని లోకేష్ అండ్ కో ఆకాశమే హద్దుగా రెచ్చిపోతున్నారు. కోర్టు విచారణలో చంద్రబాబు క్లీన్ చిట్‌తో బయటపడ్డట్లుగా బిల్డప్ ఇస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్ తొందరలోనే జనాల్లోకి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు. చంద్రబాబుపైన అక్రమంగా అవినీతి కేసుపెట్టి 53 రోజులు జైల్లో ఉంచారని చెప్పటమే వీళ్ళ ఉద్దేశం. ఈనెల 24 నుండి యువగళం పాదయాత్రను లోకేష్ పునఃప్రారంభించబోతున్నారని పార్టీవర్గాలు చెప్పాయి.

అలాగే 26వ తేదీ నుండి ‘నిజం గెలిచింది’అనే నినాదంతో భువనేశ్వరి బస్సుయాత్రను మళ్ళీ మొదలుపెట్టబోతున్నారట. చంద్రబాబు జైలులో ఉన్నపుడు ‘నిజం గెలవాలని’ యాత్రలు చేశారు. జడ్జి తాజా వ్యాఖ్యలతో నిజం గెలిచిందనే యాత్రకు రెడీ అవుతున్నారట. చివరగా డిసెంబర్ మొదటి వారంలో చంద్రబాబు కూడా భవిష్యత్తుకు గ్యారెంటీ యాత్రలు చేయచ్చని అంటున్నారు. భవిష్యత్తుకు గ్యారెంటీ యాత్రలో ఉండగానే సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో అరెస్టయ్యారు. కాబట్టి అదే యాత్రను చంద్రబాబు తిరిగి ప్రారంభించబోతున్నట్లు సమాచారం. మొత్తానికి ముగ్గురు కూడా తమ యాత్రలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా హోరెత్తించేయబోతున్నట్లు అర్థ‌మవుతోంది.


First Published:  21 Nov 2023 5:34 AM GMT
Next Story