Telugu Global
Andhra Pradesh

టీడీపీ పుట్టిముంచిన చంద్రబాబు.. 41 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి..

వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సిఎం రమేష్‌, గరికపాటి రామ్మోహన్‌ రావు, టీజీ వెంకటేశ్‌లను చంద్ర‌బాబు బీజేపీలోకి పంపించారు.

టీడీపీ పుట్టిముంచిన చంద్రబాబు.. 41 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి..
X

నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పుట్టిముంచారు. టీడీపీ 41 ఏళ్ల చరిత్రలో రాజ్యసభలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోతోంది. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదు. టీడీపీ ఏకైక రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్‌ పదవీకాలం ఏప్రిల్ 2తో ముగుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. వాటిలో ఒక్కటి కూడా గెలిచే అవకాశం టీడీపీకి లేదు.

ఎన్నికలు జరిగే మూడు స్థానాలను కూడా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ (వైసీపీ) గెలుచుకునే అవకాశాలున్నాయి. రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్‌ కోటా 11. నిజానికి, 2019 ఎన్నికలకు ముందు వైసీపీకి ఇద్దరు, టీడీపీకి 9 మంది రాజ్యసభ సభ్యులున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ 50 శాతం ఓట్లతో 151 శాసనసభా స్థానాలను గెలుచుకుంది. టీడీపీ 23 స్థానాలను గెలుచుకుంది.

వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సిఎం రమేష్‌, గరికపాటి రామ్మోహన్‌ రావు, టీజీ వెంకటేశ్‌లను చంద్ర‌బాబు బీజేపీలోకి పంపించారు. కనకమేడల ఒక్కరే టీడీపీలో ఉండిపోయారు. ప్రస్తుతం జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఒక్కో సభ్యుడి ఎన్నికకు కనీసం 44 మంది శాసనసభ్యుల మద్దతు అవసరం.

ప్రస్తుతం శాసనసభలో ఉన్న బలంతో వైసీపీ మూడు స్థానాలను అల‌వోక‌గా తన ఖాతాలో వేసుకోగ‌ల‌దు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌ రావు రాజీనామాను స్పీకర్‌ ఆమోదించారు. దాంతో టీడీపీ (తిరుగుబాటు ఎమ్యెల్యేలను కూడా పరిగణనలోకి తీసుకుంటే) 22 మంది సభ్యుల బలం ఉంది. వచ్చే ఎన్నికల్లో టికెట్లు రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు తమకు మద్దతు ఇవ్వవచ్చునని చంద్రబాబు భావించారు. దాంతో చంద్రబాబు ఓ అభ్యర్థిని పోటీకి దింపాలని తొలుత అనుకున్నారు. అయితే, అది అంత సులభం కాదని భావించి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

First Published:  12 Feb 2024 6:51 AM GMT
Next Story