Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు చివరి కోరిక చాలా పెద్దదే..!

ఇంతకీ చంద్రబాబు ఆశ ఏమిటంటే ఏపీని వరుసగా తాను పాతికేళ్ళు ఎదురులేకుండా పరిపాలించాలనట. కానీ అవకాశం దక్కలేదని తెగ బాధపడిపోయారు. నిజంగానే అంతటి అవకాశం దక్కుంటే ఏపీ బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగి ఉండేదన్నారు.

చంద్రబాబు చివరి కోరిక చాలా పెద్దదే..!
X

ఇంతకాలానికి చంద్రబాబునాయుడు తన మనసులోని కోరిక‌ను బయటపెట్టుకున్నారు. ఇంతకీ చంద్రబాబు ఆశ ఏమిటంటే ఏపీని వరుసగా తాను పాతికేళ్ళు ఎదురులేకుండా పరిపాలించాలనట. కానీ అవకాశం దక్కలేదని తెగ బాధపడిపోయారు. నిజంగానే అంతటి అవకాశం దక్కుంటే ఏపీ బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగి ఉండేదన్నారు. కుప్పంలో మూడు రోజుల పర్యటనలో చివరగా మీట్ ది ప్రెస్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒడిస్సాలో నవీన్ పట్నాయక్‌ను అక్కడి ప్రజలు వరుసగా ఐదుసార్లు ముఖ్యమంత్రిని చేసినట్లు చెప్పారు.

ఇక్కడే చంద్రబాబు మనసులోని ఆశ ఏంటో బయటపడింది. నవీన్‌ను అక్కడి జనాలు వరుసగా ఐదుసార్లు ముఖ్యమంత్రిని చేశారని చెబుతున్న చంద్రబాబు ఎందుకు గెలిపించారని మాత్రం ఆలోచించటంలేదు. నవీన్ మీద ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదు. సంక్షేమ పథకాలు, అభివృద్ధిని నవీన్ బ్యాలెన్స్ చేస్తున్నారు. నవీన్ పాలన జనరంజకంగా ఉంది కాబట్టే వరుసగా గెలిపిస్తున్నారు. తాను కూడా నవీన్‌లా పాలించాలని చంద్రబాబు ఎప్పుడైనా ఆలోచించారా? ప్రయత్నించారా?

నలుగురు తన పేరును చెప్పుకోవాలని ఎప్పుడూ ఆలోచించలేదన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ అంతర్జాతీయ విమనాశ్రయం నిర్మించింది తానే అని జనాలు చెప్పుకోకపోయినా పర్వాలేదన్నారు. ఇక్కడే చంద్రబాబులోని అసలు రూపం బయటపడింది. ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ విమానాశ్రయాన్ని నిర్మించింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్సారే కానీ చంద్రబాబు కాదు. ఎవరో చేసిన పనులను కూడా తన ఖాతాలో వేసుకుని క్రెడిట్ కొట్టేయాలని అనుకునే చంద్రబాబు నిరంతరం పేరు కోసం, ప్రచారం కోసమే పాకులాడుతారన్న విషయం అందరికీ తెలుసు.

వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీనే గెలవాలని జగన్మోహన్ రెడ్డి అనగానే చంద్రబాబు అభ్యంతరం చెబుతున్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్‌కు మరో అవకాశం ఎందుకివ్వాలని నిలదీస్తున్నారు. తాను మాత్రం పాతికేళ్ళు ఎదురులేకుండా పాలించాలని అనుకోవటం చంద్రబాబుకు తప్పనిపించలేదు. రాష్ట్రాన్ని ఎవరు పాలించాలో డిసైడ్ చేయాల్సింది జనాలే కానీ చంద్రబాబో లేకపోతే జగనో కాదు. తామే అధికారంలో ఉండాలని ఎవరికి వాళ్ళే అనుకోవచ్చు తప్పులేదు. కానీ అంతిమ నిర్ణేతలు మాత్రం ప్రజలే.

First Published:  17 Jun 2023 5:15 AM GMT
Next Story