Telugu Global
Andhra Pradesh

బాబుకు మింగుడు పడని బీజేపీ మెలిక.. భువనేశ్వరికి తప్పదా..?

లోక్‌సభకు పోటీ చేయాలని బీజేపీ అగ్రనేతలు చంద్రబాబుకు, పవన్‌ కల్యాణ్‌కు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రం విషయం తాము చూసుకుంటామని కూడా చెప్పారని సమాచారం.

బాబుకు మింగుడు పడని బీజేపీ మెలిక.. భువనేశ్వరికి తప్పదా..?
X

పొత్తు కోసం బీజేపీ అగ్రనేతలు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మింగుడు పడని షరతు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. దాంతో ఆయన కక్కలేక మింగలేక ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ఈ స్థితిలో కుప్పంలో నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం చేకూరుతోంది. సరదాగానే ఆమె ఆ వ్యాఖ్యలు చేశారని అంటున్నన్పటికీ అందులో గూఢమైన విషయం దాగి ఉన్నట్లు అర్థమవుతోంది. చంద్రబాబుకు రెస్ట్‌ ఇద్దాం, నేను కుప్పం నుంచి పోటీ చేస్తా అని భువనేశ్వరి అనడం వెనక బీజేపీ పెట్టిన మెలిక కారణమని భావిస్తున్నారు.

లోక్‌సభకు పోటీ చేయాలని బీజేపీ అగ్రనేతలు చంద్రబాబుకు, పవన్‌ కల్యాణ్‌కు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రం విషయం తాము చూసుకుంటామని కూడా చెప్పారని సమాచారం. దీనివల్లనే బీజేపీతో పొత్తుపై చంద్రబాబు గానీ, పవన్‌ కల్యాణ్‌ గానీ పెద్దగా మాట్లాడడం లేదని అంటున్నారు. ఇద్దరూ లోక్‌సభకు పోటీ చేసి గెలిచి వస్తే కేంద్రంలో మంత్రి పదవులు ఇస్తామని కూడా వారు హామీ ఇచ్చారని సమాచారం. ఈ స్థితిలో కుప్పం నుంచి భువనేశ్వరిని పోటీ చేయించడానికి చంద్రబాబు గ్రౌండ్ ప్రిపేర్‌ చేస్తున్నట్లు అనుకోవచ్చు.

ఇదే సందర్భంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్‌ రెడ్డి చేసిన ప్రకటనను కూడా గుర్తుచేసుకోవాలి. టీడీపీ, జనసేన కూటమితో తమ పార్టీ కలిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి తమ పార్టీకే దక్కాలని ఆయన అన్నారు. విష్ణువర్ధన్‌ రెడ్డిని బీజేపీ కేంద్ర నాయకత్వం మందలించినట్లు వార్తలు వచ్చాయి. కానీ, జాతీయ నాయకత్వం ఆలోచన తెలిసే విష్ణువర్ధన్‌ రెడ్డి ఆ మాట అని ఉంటారనేది స్పష్టం. మొత్తం మీద, చంద్రబాబుకు వెనక్కి రాలేని, ముందుకు పోలేని స్థితిని బీజేపీ కల్పించినట్లు అర్థం చేసుకోవచ్చు.

First Published:  22 Feb 2024 6:57 AM GMT
Next Story