Telugu Global
Andhra Pradesh

తనయుడు లోకేష్‌పై చంద్రబాబుకు నమ్మకం లేదా..?

నారా లోకేష్‌కు టీడీపీ పగ్గాలు అప్పగించడానికి, తన వారసత్వాన్ని అందించడానికి మార్గాన్ని ఏర్పాటు చేయడంలో ఆయన గత కొన్నేళ్లుగా నిమగ్నమై ఉన్నారు.

తనయుడు లోకేష్‌పై చంద్రబాబుకు నమ్మకం లేదా..?
X

తన ముద్దుల తనయుడు నారా లోకేష్‌పై టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి నమ్మకం లేనట్లుంది. ఈ ఎన్నికల్లో నారా లోకేష్‌ సేవలను ఆయన పెద్దగా వాడుకోవడం లేదు. దాంతో లోకేష్‌ తెర వెనకనే ఉండిపోతున్నారు. కొద్ది నెలల్లో జరిగే ఎన్నికల్లో చంద్రబాబు చావో రేవో తేల్చుకోవాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో టీడీపీ పరాజయం పాలైతే చంద్రబాబు తెరమరుగు అవుతారు. టీడీపీ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకమవుతుంది. ఆయన వయస్సు క్రియాశీలక రాజకీయాలు చేయడానికి అనుమతి ఇవ్వకపోవచ్చు. తాను రాజకీయాల నుంచి తప్పుకునేలోగా నారా లోకేష్‌ను తన స్థానంలో నిలబెట్టాలని చాలా కాలంగా చంద్రబాబు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

నారా లోకేష్‌కు టీడీపీ పగ్గాలు అప్పగించడానికి, తన వారసత్వాన్ని అందించడానికి మార్గాన్ని ఏర్పాటు చేయడంలో ఆయన గత కొన్నేళ్లుగా నిమగ్నమై ఉన్నారు. అందుకు అడ్డు వస్తాడని భావించిన సినీ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ను పక్కన పెట్టారు. టీడీపీకి జీవం పోయడానికి జూనియర్‌ ఎన్టీఆర్‌ను పార్టీలోకి ఆహ్వానించాలని పార్టీ సీనియర్‌ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరిలాంటి వాళ్లు కోరుతున్నా.. చంద్రబాబు ప‌ట్టించుకోవ‌డం లేదు. జూనియర్‌ ఎన్టీఆర్‌ను పక్కకు తప్పించే క్రమంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి నాయకులను వదులుకోవడానికి కూడా బాబు వెనకాడలేదు.

నారా లోకేష్‌ అంతా తానై పార్టీని నడిపించాల‌నుకున్నాడు కానీ, ఆయన కృషి పెద్దగా ఫలించలేదు. నారా లోకేష్‌ వ్యవహార శైలి వల్ల సీనియర్‌ నాయకులు కొంత మంది పార్టీకి దూరమయ్యే పరిస్థితి కూడా వచ్చింది. వచ్చే ఎన్నికలు చంద్రబాబు భవిష్యత్తునే కాకుండా టీడీపీ భవిష్యత్తును కూడా నిర్ణయిస్తాయి, నారా లోకేష్‌కు నాయకత్వం అప్పగించే ప్రక్రియను కూడా నిర్ణయిస్తాయి. అందువల్ల చంద్రబాబు లోకేష్‌ వల్ల కాదని భావించి, ఆయనపై నమ్మకం లేక తానే ముందుండి అన్నీ నడిపిస్తున్నట్లు తోస్తోంది.

వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే నారా లోకేష్‌కు తన వార‌సత్వాన్ని అందించే విషయంపై ఆలోచించవచ్చునని చంద్ర‌బాబు అనుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే, వైఎస్‌ జగన్‌కు ఉన్న నాయకత్వ లక్షణాలు లోకేష్‌కు లేకపోవడం పెద్ద మైనస్‌ పాయింట్‌గా కనిపిస్తోంది. జగన్‌తో సరితూగే సత్తా లోకేష్‌కు లేద‌నేది అందరికీ తెలిసిన విషయమే. ఇటువంటి స్థితిలో జగన్‌కు నారా లోకేష్‌ను పోటీ పెట్టడం చంద్రబాబుకు ఇష్టం లేదు. తానే జగన్‌ను ఎదుర్కోవడానికి పవన్‌ కల్యాణ్‌ను అరువు తెచ్చుకున్నారు. నారా లోకేష్‌ పవన్‌ కల్యాణ్‌తో వ్యవహారాలు నడపడమనేది కలలో మాట. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నారా లోకేష్‌ను పక్కన పెట్టి అన్నీ తానే అయి చంద్రబాబు వ్యవహరిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.

First Published:  6 Feb 2024 11:00 AM GMT
Next Story