Telugu Global
Andhra Pradesh

జగన్ అధికారంలోకి వస్తాడనుకుంటే నేను ‘లా’ చేసేవాడిని

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ 30శాతం దొంగ ఓట్లు చేర్చిందని ఆరోపించారు చంద్రబాబు. నిజమైన పట్టభద్రులు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారో లేక నాశనం చేసుకుంటారో ఆలోచన చేయాలని సూచించారు.

జగన్ అధికారంలోకి వస్తాడనుకుంటే నేను ‘లా’ చేసేవాడిని
X

ఎంఏ ఎకనామిక్స్ చదవడం వల్ల తన ఆలోచనలన్నీ సంపద సృష్టి, అభివృద్ధిపైనే ఉండేవని చెప్పారు చంద్రబాబు. వైసీపీ లాంటి ప్రభుత్వం వస్తుందని ఊహించి ఉంటే తాను కూడా ‘లా’ చేసేవాడినని, తనని తాను డిఫెండ్ చేసుకోవడానికైనా న్యాయవాదిని అయి ఉండేవాడినని సెటైర్లు వేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని డాక్టర్లు, లాయర్లు. టీచర్లు, యువతతో వర్చువల్ గా చంద్రబాబు సమావేశమయ్యారు. సీబీఎన్ కనెక్ట్ కార్యక్రమంలో పాల్గొని టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఈనెల 13న పోలింగ్ జరగాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ రెండిటికీ పోటీ చేస్తోంది. పీడీఎఫ్ బలపరచిన అభ్యర్థులు సంప్రదాయం ప్రకారం తమదే విజయం అంటున్నారు. ఇక టీడీపీ కేవలం గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లో మాత్రమే అభ్యర్థులను బరిలో దించింది, ఉపాధ్యాయ నియోజకవర్గం విషయంలో ఏపీటీఎఫ్ ని బలపరచింది. గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి సంబంధించి తొలి ప్రాధాన్య ఓటు టీడీపీ బలపరచిన అభ్యర్థికి వేయాలని, రెండో ప్రాధాన్య ఓటు పీడీఎఫ్ కి వేయాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. టీచర్స్ నియోజకవర్గానికి సంబంధించి తొలి ప్రాధాన్య ఓటు ఏపీటీఎఫ్ అభ్యర్థికి, రెండో ప్రాధాన్య ఓటు పీడీఎఫ్ అభ్యర్థికి వేయాలని సూచించారు. వైసీపీకి ఎవరూ ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు. 2024 లో జరగబోయే ఎన్నికలకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు నాందిగా అభివర్ణించారాయన.

ఓవైపు వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపై కీలక విచారణ జరుగుతుంటే, మరోవైపు దానిపైనుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు స్కిల్ డెవలప్ మెంట్ పై తప్పుడు కేసులు పెట్టారంటూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు చంద్రబాబు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ 30శాతం దొంగ ఓట్లు చేర్చిందని ఆరోపించారు. నిజమైన పట్టభద్రులు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారో లేక నాశనం చేసుకుంటారో ఆలోచన చేయాలని సూచించారు. శాసన మండలిలో ఉపాధ్యాయ సమస్యలపై పోరాడే వారికే ఓటు వేయాలన్నారు చంద్రబాబు. అవినీతి డబ్బుతో ఉపాధ్యాయుల ఓట్లు కొనేందుకు వైసీపీ సిద్ధమైందని, వారికి గట్టి గుణపాఠం చెప్పాలన్నారు

First Published:  10 March 2023 3:58 PM GMT
Next Story