Telugu Global
Andhra Pradesh

ఇద్దరికీ వేరే దిక్కులేదా?

ఎంత అసంతృప్తి ఉన్నా గంటా శ్రీనివాసరావును వదులుకునే పరిస్ధితిలో చంద్రబాబు లేరు. ప్రత్యామ్నాయం దొరకలేదు కాబట్టి టీడీపీలో కంటిన్యూ అవక గంటాకు వేరే దిక్కులేదు.

ఇద్దరికీ వేరే దిక్కులేదా?
X

ఇచ్చేవాళ్ళు ఒకందుకు ఇస్తే పుచ్చుకునే వాళ్ళు మరొకందుకు పుచ్చుకున్నారు అనే సామెత బాగా పాపులర్. ఈ సామెత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీలకు బాగా వర్తిస్తుంది. ఇంతకీ విషయం ఏమిటంటే మంగళవారం హైదరాబాద్‌లో లోకేష్ ఇంటికి వెళ్ళిన గంటా దాదాపు 50 నిముషాలు భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య జరిగిన చర్చలు ఏమిటనేది స్పష్టంగా తెలీదు. కాకపోతే పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఇక నుండి పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉంటానని లోకేష్‌కు గంటా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇక్కడ విషయం ఏమిటంటే పార్టీలో గంటా యాక్టివ్‌గా లేకపోయినా పార్టీ అధినాయకత్వం చేయగలిగిందేమీలేదు. గతంలో చంద్రబాబు వచ్చి కలవమని చెప్పినా కుదరదని చెప్పిన నేత గంటా. అలాంటి గంటాపై నాయకత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేకపోయింది. అసలు పార్టీలో ఉన్నారో లేదో కూడా తెలియ‌నంత‌ సైలెంటుగా ఉన్నారు గంటా ఇంతకాలం. పార్టీలో కనిపిస్తే ఉన్నాడని, కనబడకపోతే లేడని అనుకున్నారు ఇంత‌కాలం. అలాంటిది ఇక నుంచి గంటా పార్టీలో యాక్టివ్‌గా ఉంటే ఏమిటి లేకపోతే ఏమిటి?

గంటా విషయంలో చంద్రబాబు ఎంత అసంతృప్తిగా ఉన్నా చేసిందేమీలేదు. స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో రెండు సార్లు రాజీనామ చేసినా నాయకత్వం ప్రశ్నించలేకపోయింది. ఇక గంటా కోణంలో చూస్తే వైసీపీలో చేరాలని విశ్వప్రయత్నాలు చేసినా సాధ్యం కాలేదు. కాపులకు కొత్త పార్టీ పెట్టాలని చేసిన ప్రయత్నాలూ ఫెయిలయ్యాయి.

ఇవన్నీ సరిపోదన్నట్లు బీఆర్ఎస్ ఏపీ సారథ్యం విషయంలో కేసీఆర్‌ను కూడా కలిసినట్లు సమాచారం. అయితే ఎందువల్లో వర్కవుట్ కాలేదట. దాంతో ఏమి చేయాలో అర్ధంకాక చివరకు ఉన్నపార్టీలోనే యాక్టివ్ అయితే సరిపోతుందని డిసైడ్ అయినట్లున్నారు. అందుకనే జనవరి 1వ తేదీన తన ఫొటోతో పాటు చంద్రబాబు ఫొటోతో ఒక గ్రీటింగ్ కార్డు తయారు చేయించి సర్క్యులేట్ చేశారు. ఇపుడేమో లోకేష్‌తో భేటీ అయ్యారు. కాబట్టి ఎంత అసంతృప్తి ఉన్నా గంటాను వదులుకునే పరిస్ధితిలో చంద్రబాబు లేరు. ప్రత్యామ్నాయం దొరకలేదు కాబట్టి టీడీపీలో కంటిన్యూ అవక గంటాకు వేరే దిక్కులేదు.

First Published:  11 Jan 2023 6:10 AM GMT
Next Story