Telugu Global
Andhra Pradesh

జూ.ఎన్టీఆర్‌పై కక్షతోనే బుచ్చయ్య చౌదరిపై వేటు?

తెలుగుదేశం పార్టీలో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఊసు లేకుండా చేయాలని చంద్రబాబు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, టీడీపీ పుంజుకోవాలంటే జూనియర్‌ ఎన్టీఆర్‌ రావాలని బుచ్చయ్య చౌదరి గతంలో అన్నారు.

జూ.ఎన్టీఆర్‌పై కక్షతోనే బుచ్చయ్య చౌదరిపై వేటు?
X

సినీ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌పై కక్షతోనే పార్టీ సీనియర్‌ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరికి తిరిగి రాజమండ్రి రూరల్‌ సీటు దక్కకుండా టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్లాన్‌ వేసినట్లున్నారు. రాజమండ్రి రూరల్‌ శాసనసభ నియోజకవర్గం అభ్యర్థిగా కందుల దుర్గేష్‌ పేరును జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. దీంతో పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్‌ సీటు జనసేనకు వెళ్లినట్లే లెక్క. ఈ కారణంగా ఐదుసార్లు ఎమ్యెల్యేగా గెలిచిన గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఆ సీటు దక్కే అవకాశం లేకుండా పోయింది. మరో సీటును చంద్రబాబు కేటాయిస్తారనే నమ్మకం కూడా ఆయ‌న‌కు లేదు.

తెలుగుదేశం పార్టీలో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఊసు లేకుండా చేయాలని చంద్రబాబు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, టీడీపీ పుంజుకోవాలంటే జూనియర్‌ ఎన్టీఆర్‌ రావాలని బుచ్చయ్య చౌదరి గతంలో అన్నారు. పార్టీలోకి జూనియర్‌ ఎన్టీఆర్‌ను ఆహ్వానించాలని కూడా చంద్ర‌బాబుకు సూచించారు. ఇది చంద్రబాబుకు ఏ మాత్రం నచ్చి ఉండదనేది వేరుగా చెప్పాల్సిన పని లేదు. దీంతోనే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి పార్టీలో గొంతు లేకుండా చేయాలని ఆయన చూస్తున్నట్లు అర్థమవుతోంది.

నిజానికి, బుచ్చయ్య చౌదరి చాలా సీనియర్‌. చంద్రబాబు వద్ద ఆయన చేతులు కట్టుకుని కూర్చోలేరు. దానికితోడు, నారా లోకేష్‌కు బుచ్చయ్య చౌదరి అంటే అసలు గిట్టదు. దానివల్ల కూడా ఆయనకు వ్యతిరేకంగా చక్రం తిప్పినట్లు భావిస్తున్నారు.

First Published:  21 Feb 2024 9:11 AM GMT
Next Story