Telugu Global
Andhra Pradesh

ఈ నియోజకవర్గంలో లోకల్‌కే ఛాన్సా?

జనసేన మద్దతు+లోకల్ సింపతి+నేతలంతా గట్టిగా పనిచేస్తే రావి గెలిచేందుకు ఎక్కువ అవకాశాలున్నట్లు పార్టీలో టాక్ నడుస్తోంది. దీనికి చంద్రబాబు కూడా సానుకూలంగానే ఉన్నట్లు సమాచారం.

ఈ నియోజకవర్గంలో లోకల్‌కే ఛాన్సా?
X

వచ్చే ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గంలో పోటీ చేయటానికి ఎంతమంది ప్రయత్నిస్తున్నా అవకాశం మాత్రం లోకల్ నేతకే ఇవ్వాలని చంద్రబాబునాయుడు దాదాపు డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాల సమాచారం. లోకల్ లీడరంటే మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే రావి చాలా సంవత్సరాలుగా నియోజకవర్గాన్నే అంటిపెట్టుకుని ఉండటం అడ్వాంటేజ్ అని చంద్రబాబు అనుకుంటున్నారట.

గుడివాడలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానిని ఓడించాలన్నది చంద్రబాబు అండ్ కో పట్టుదల. వ్యక్తిగతంగా చంద్రబాబుకే కాకుండా మొత్తం పార్టీకే కొడాలి పెద్ద సమస్యగా మారారు. చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమా అంటే తోకతొక్కిన తాచులాగ కొడాలి రెచ్చిపోతుంటారు. పదేపదే చంద్రబాబు, లోకేష్‌ను చాలా డ్యామేజింగ్‌గా మాట్లాడటం కొడాలికి బాగా అలవాటైపోయింది. ఇక్కడ గమనించాల్సిందేమంటే టీడీపీ నేతలు కావాలనే కొడాలిని గిల్లి వదిలేస్తుంటారు. ఆ గిల్లుడుతో మాజీ మంత్రి రెచ్చిపోతుంటారు.

వచ్చే ఎన్నికల్లో కొడాలిని ఓడించేందుకు చంద్రబాబు చాలా ప్లాన్లే వేస్తున్నారు. అయితే ఈ మాజీ మంత్రికి ధీటైన అభ్యర్ధి దొరకటం లేదు. ఈ నేపథ్యంలోనే శిష్ట్లా, వెనిగండ్ల రాము అనే ఎన్ఆర్ఐ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మధ్యలో నందమూరి తారకరత్న, దేవినేని ఉమ పేర్లు కూడా వినబడింది. ఎన్నిపేర్లను పరిశీలించినా కొడాలికి ధీటైన అభ్యర్ధులుగా చంద్రబాబుకు అనిపించలేదట. అందుకనే చివరకు మాజీ ఎమ్మెల్యే రావి వైపే చంద్రబాబు మొగ్గినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

టికెట్ దక్కకపోయినా రావి సంవత్సరాల తరబడి నియోజకవర్గంలో పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు. ఈయనపైన పార్టీ నేతలు, క్యాడర్లో బాగా సింపతి ఉందట. కొత్తగా వచ్చినవాళ్ళు, బయటవాళ్ళకన్నా లోకల్ నేత రావి అయితేనే కొడాలికి గట్టి పోటీ ఇస్తారని కొందరు నేతలు చెప్పారట. జనసేన మద్దతు+లోకల్ సింపతి+నేతలంతా గట్టిగా పనిచేస్తే రావి గెలిచేందుకు ఎక్కువ అవకాశాలున్నట్లు పార్టీలో టాక్ నడుస్తోంది. దీనికి చంద్రబాబు కూడా సానుకూలంగానే ఉన్నట్లు సమాచారం. గుడివాడలో పోటీ చేయాలని గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నవాళ్ళ చూపు ఇప్పుడు పామర్రు వైపు మళ్ళిందట. మరి చివరకు చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.

First Published:  11 Jan 2023 6:29 AM GMT
Next Story