Telugu Global
Andhra Pradesh

మందుబాబులకు సాయంత్రమైతే నేనే గుర్తొస్తా –చంద్రబాబు

తన దగ్గర మంచిగా పని చేసిన పోలీసులు ఇప్పుడు సైకో దగ్గర పనిచేస్తున్నారని, ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు చంద్రబాబు.

మందుబాబులకు సాయంత్రమైతే నేనే గుర్తొస్తా –చంద్రబాబు
X

మందుబాబులకు సాయంత్రం అయితే తానే జ్ఞాపకం వస్తానని అన్నారు చంద్రబాబు. జగన్ కి మాత్రం తిట్లే తిట్లు అని అన్నారు. తాను అధికారంలోకి వస్తే మందు రేట్లు తగ్గుతాయని, వారి ఆరోగ్యం బాగుంటుందని, నాణ్యమైన బ్రాండ్లు అందుబాటులో ఉంటాయని.. మందుబాబులు అకుంటున్నారని చెప్పారు. అవునా కాదా తమ్ముళ్లూ అంటూ నెల్లూరు జిల్లా కావలి ప్రజల్ని ఉత్సాహ పరిచారు. వైన్ షాపుల్లో ఆన్ లైన్ పేమెంట్ల పద్ధతి ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. బూమ్ బూమ్ అనే వెరైటీ ఎక్కడా తానింతవరకు చూడలేదన్నారు. దేశంలో ఎక్కడా లేని బ్రాండ్లు ఇక్కడ దొరుకుతాయని ఎద్దేవా చేశారు.

కందుకూరు దుర్ఘటన తర్వాత నెల్లూరు జిల్లాలో చంద్రబాబు తన పర్యటన కొనసాగించారు. కావలిలో ఆయన రోడ్ షో, బహిరంగ సభ నిర్వహించారు. కందుకూరులో చనిపోయిన వారికి సంతాప సూచకంగా మౌనం పాటించారు. బాధిత కుటుంబాలకు తాను అండగా ఉంటానన్నారు. ప్రధాని మోదీ సాయం ప్రకటించడంపై కృతజ్ఞతలు తెలిపారు, కనీసం సీఎం జగన్, మృతులకు సంతాపం తెలియజేయలేదని మండిపడ్డారు. రాష్ట్రంకోసం పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు చంద్రబాబు.

ఎమ్మెల్యే తోక కత్తిరిస్తా..

స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై నిప్పులు చెరిగారు చంద్రబాబు. ఆయన రౌడీయిజాన్ని జనం తట్టుకోలేకపోతున్నారని, ఆయన రౌడీయిజం తోక కత్తిరిస్తానని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖబడ్దార్ ఎమ్మెల్యే అని అన్నారు. తన దగ్గర మంచిగా పని చేసిన పోలీసులు ఇప్పుడు సైకో దగ్గర పనిచేస్తున్నారని, ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. కొందరు పోలీసులు సైకోని ఆనందపరచటానికి టీడీపీ శ్రేణులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కందుకూరులో అనుకున్న చోట సభ పెట్టలేదని పోలీసులు అసత్యాలు చెబుతున్నారని, ఈరోజు ఏర్పాటు చేసిన బందోబస్తు, నిన్న కూడా ఏర్పాటు చేసి ఉంటే కందుకూరులో అంత ఘోరం జరిగి ఉండేది కాదన్నారు చంద్రబాబు.

First Published:  29 Dec 2022 5:16 PM GMT
Next Story