Telugu Global
Andhra Pradesh

ఈ కోర్టు నోటీసుతో చంద్రబాబు పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి..

కేవలం స్కిల్ స్కామ్ ఒక్కటే కాదు, ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్ని కూడా సీఐడీ పరిధి నుంచి తప్పించి, సీబీఐకి అప్పగిస్తే తమకేమీ అభ్యంతరం లేదని తెలిపారు ఏజీ. దీంతో హైకోర్టు చంద్రబాబు సహా ప్రతివాదులకు నోటీసులిచ్చింది.

ఈ కోర్టు నోటీసుతో చంద్రబాబు పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి..
X

చంద్రబాబు కోర్టు కేసుల వ్యవహారంలో ఈ రోజు కీలక పరిణామం జరిగింది. ఇప్పటి వరకూ కక్ష సాధింపు అంటూ కోడై కూస్తున్న చంద్రబాబు అండ్ కోకి.. ఈ పరిణామం పెద్ద షాక్ అని చెప్పాలి. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుపై ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిటిషన్ విచిత్రమైన మలుపు తీసుకుంది. ఈ కేసుని సీబీఐకి అప్పగించాలని ఉండవల్లి ఏపీ హైకోర్టుని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ ని విచారణకు స్వీకరించిన కోర్టు చంద్రబాబు సహా 44మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

అన్నీ ఇచ్చేయండి..

నోటీసులు జారీ చేసే ముందు హైకోర్టు, సీఐడీ తరపున రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ హైకోర్టులో సమాధానం ఇచ్చారు. కేవలం స్కిల్ స్కామ్ ఒక్కటే కాదు, ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్ని కూడా సీఐడీ పరిధి నుంచి తప్పించి, సీబీఐకి అప్పగిస్తే తమకేమీ అభ్యంతరం లేదని తెలిపారు ఏజీ. సీబీఐతో ఎంక్వయిరీకి సమ్మతిస్తున్నట్టు చెప్పారు. దీంతో హైకోర్టు చంద్రబాబు సహా ప్రతివాదులకు నోటీసులిచ్చింది. సీబీఐ ఎంక్వయిరీపై వారి అభిప్రాయాలు చెప్పాలని కోరింది.

ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. ఈ కేసుల్ని సీబీఐకి ఇవ్వాలని చెప్పలేని పరిస్థితి బాబుది. ఈ కేసులన్నీ సీబీఐ పరిధిలోకి వెళ్తే ఆయన ఇంకా కూరుకుపోతారు. చీటికీ మాటికీ జైలులో ఆరోగ్యం బాలేదు, దోమలు కుడుతున్నాయంటూ కుటుంబ సభ్యులు గోల చేయలేరు. రోజూ నిరసనలు, నిరాహార దీక్షలు.. అంటూ టీడీపీ కార్యకర్తలు హడావిడి చేయలేరు. సీబీఐ ఎంటరై అరెస్ట్ చేసినా, జైలుశిక్ష పడినా సానుభూతి ఉండదు. జగన్ ని కార్నర్ చేయడం, ఎన్నికల్లో సానుభూతి కోసం వైసీపీపై బురదజల్లడం సాధ్యం కాదు.

ఒకవేళ సీబీఐ వద్దు అంటే..?

ఈ కేసులను సీబీఐకి ఇవ్వొద్దు అన్నా కూడా చంద్రబాబుకి సమస్యే. సీబీఐ విచారణ వద్దు అన్నారంటే.. సీఐడీ విచారణను పరోక్షంగా ఒప్పుకున్నట్టే లెక్క. అంటే సీఐడీ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది, రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధిస్తోంది అని అనడానికి ఛాన్స్ ఉండదు. సీఐడీపై, రాష్ట్ర ప్రభుత్వంపై తనకు నమ్మకం లేదన్న స్టేట్ మెంట్ లు కూడా ఇవ్వలేని పరిస్థితి. సీబీఐ ఎంక్వయిరీకి ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా చంద్రబాబుకి ఇబ్బందే. ముందు సీఐడీ, వెనక సీబీఐ.. చంద్రబాబు భలే ఇరుక్కుపోయారని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

First Published:  13 Oct 2023 10:58 AM GMT
Next Story