Telugu Global
Andhra Pradesh

వైసీపీ బ‌లుపు.. టీడీపీకి బ‌ల‌మైంది..

జీవీ రెడ్డి అక్కడ అవమానాలు భరించలేక వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందు ఆయన పలు టీవీ చర్చల్లో పాల్గొనేవారు. చర్చా కార్యక్రమాల్లో జీవీ రెడ్డి సబ్జెక్టును పరిశీలించిన చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా పిలిపించుకొని ఆయన్ను టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమించారు.

వైసీపీ బ‌లుపు.. టీడీపీకి బ‌ల‌మైంది..
X

సోషల్ మీడియా విభాగంపై తెలుగుదేశం పార్టీ మరింత శ్రద్ధ వహిస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ ఓటమిలో వైసీపీ సోషల్ మీడియా ప్రచారం కీలకపాత్ర పోషించిందని టీడీపీ భావిస్తోంది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టేందుకు అదే సోషల్ మీడియాను టీడీపీ విస్తృతంగా వాడుకుంటోంది. ఐ- టీడీపీ పేరుతో ప్రత్యేకంగా ఒక వింగ్‌ను కూడా ఏర్పాటు చేసి ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది.

ఐ -టీడీపీకి ఇన్‌చార్జిగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ వ్యవహరిస్తూ వచ్చారు. విజ‌య్ చేయించిన కొన్ని ప్రచారాలు తీవ్రస్థాయిలో వివాదాస్పదమయ్యాయి. ముఖ్యమంత్రి సతీమణి వైయస్ భారతిపై భారతీపే అంటూ చేసిన ప్రచారం చివరకు అతడి పై కేసులు నమోదుకు కారణమైంది. చింతకాయల విజయ్ పోలీసుల కంటపడకుండా అజ్ఞాతంలో గడపాల్సి వచ్చింది.

టీడీపీ సోషల్ మీడియా విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కీలకమైన వ్యక్తులకు తాజాగా బాధ్యతలు అప్పగించారు. ఉర‌వ‌కొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, టీడీపీ అధికార ప్రతినిధి జీవి రెడ్డిలను చంద్రబాబు రంగంలోకి దింపారు. పయ్యావుల, జీవీ రెడ్డిలను టీడీపీ సోషల్ మీడియా సలహాదారులుగా నియమించారు. జీవీ రెడ్డికి టీడీపీ సోషల్ మీడియా బాధ్యతలు పూర్తిగా అప్పగిస్తారని తొలుత ప్రచారం జరిగింది. కానీ, పయ్యావుల కేశవ్ ను కూడా జీవీ రెడ్డి హోదాలో నియమించారు.

పయ్యావుల కేశవ్ నేతృత్వంలో జీవీ రెడ్డి టీడీపీ సోషల్ మీడియాను నడిపిస్తారని చెబుతున్నారు . తెలుగుదేశం పార్టీ కీలకమైన సోషల్ మీడియా విభాగానికి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జీవీరెడ్డిని నియమించడం చర్చనీయాంశం అయింది. వైఎస్ మీద అభిమానంతో జీవీ రెడ్డి తొలుత వైసీపీలోనే ప‌ని చేరారు. అయితే అక్కడ జగన్ కోటరీలోని ఒక కీలకమైన వ్యక్తి తనను పదేపదే అవమానించేవాడని, చులకనగా మాట్లాడేవాడని, ఒకరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు బొకే తీసుకొని వెళ్తే దాన్ని పక్కకు విసిరేశాడని, దురుసుగా మాట్లాడారని గతంలో జీవీ రెడ్డి వివరించారు.

దీంతో జీవీ రెడ్డి అక్కడ అవమానాలు భరించలేక వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందు ఆయన పలు టీవీ చర్చల్లో పాల్గొనేవారు. చర్చా కార్యక్రమాల్లో జీవీ రెడ్డి సబ్జెక్టును పరిశీలించిన చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా పిలిపించుకొని ఆయన్ను టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమించారు.

ఆర్థికపరమైన అంశాల్లో వైసీపీ ప్రభుత్వాన్ని కార్నర్ చేయడంలో జీవీ రెడ్డి టీడీపీ తరఫున ముందుంటున్నారు. ఇప్పుడు జీవీ రెడ్డిని కీలకమైన సోషల్ మీడియాకు సలహాదారుగా నియమించడం ద్వారా చంద్రబాబు తమ పార్టీలో కులాన్ని చూసి పదవులు ఇవ్వడం ఉండదు అన్న అభిప్రాయాన్ని కలిగించేందుకు ప్రయత్నించినట్టుగా ఉంది.

వైసీపీ సోషల్ మీడియా బాధ్యతల్ని ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డికి జగన్ అప్పగించారు. సో.. ఇప్పుడు రెండు ప్రధాన పార్టీల సోషల్ మీడియా విభాగాలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల ఆధ్వర్యంలోనే నడవబోతున్నాయి. టీడీపీ సోషల్ మీడియా విభాగంలో పయ్యావుల కేశవ్ పాత్ర కూడా కీలకంగానే ఉంటుంది.

First Published:  11 Jan 2023 2:57 AM GMT
Next Story