Telugu Global
Andhra Pradesh

కేఏపాల్ తప్ప అందరితోనూ బాబు పొత్తులు

తాము ఎన్నికలకు సిద్ధం అంటుంటే.. పొత్తుల కోసం సిద్ధం అంటూ అమిత్ షా ఇంటి ముందు చంద్రబాబు, పవన్ నిలబడ్డారని ఎద్దేవా చేశారు మంత్రి అమర్నాథ్.

కేఏపాల్ తప్ప అందరితోనూ బాబు పొత్తులు
X

చంద్రబాబు పొత్తుల హిస్టరీ చూస్తే రాజకీయాల్లో ఇలాంటి నాయకులు కూడా ఉంటారా అనిపించకమానదు. ఏపీ, తెలంగాణల్లో దాదాపు అన్నిపార్టీలతోనూ చంద్రబాబు పొత్తులు పెట్టుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు, బీఆర్ఎస్, జనసేన.. ఎవ్వర్నీ వదిలిపెట్టలేదు. ప్రజారాజ్యంతో ఆ అవసరం రాలేదు, వైసీపీ ఆ ఛాన్స్ లేకుండా చేసింది కాబట్టి ఆ రెండు పార్టీలతో చంద్రబాబు పొత్తు అనేది లేకుండా పోయింది. తాజాగా బీజేపీతో మరోసారి ఆయన పొత్తుపెట్టుకోవడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇది ఊహించిన విషయమే. కాకపోతే బీజేపీ ఛీ కొట్టినా, చీదరించుకున్నా.. కావాలని వెళ్లి కమలనాథుల్ని కౌగిలించుకున్నారు బాబు. పొత్తు సాధించుకున్నారు. ఈ పొత్తు వ్యవహారంపై వైసీపీ నేతలు కౌంటర్లిస్తున్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ టీడీపీ పొత్తులపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

కేఏ పాల్ తప్ప మిగతా అందరితోనూ పొత్తు పెట్టుకున్న చరిత్ర చంద్రబాబుదంటూ సెటైర్లు పేల్చారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ప్రజలకు జరిగిన మేలు చూసి ఓటేయాలని సీఎం జగన్ అడుగుతుంటే.. పొత్తు చూసి ఓటేయమని చంద్రబాబు బతిమిలాడుకుంటున్నారని అన్నారు. అందరూ కలిస్తే తప్ప వైసీపీకి పోటీ ఇవ్వలేమని తెలిసి.. ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు ఏకమయ్యాయని మండిపడ్డారు అమర్నాథ్.

తాము ఎన్నికలకు సిద్ధం అంటుంటే.. పొత్తుల కోసం సిద్ధం అంటూ అమిత్ షా ఇంటి ముందు చంద్రబాబు, పవన్ నిలబడ్డారని ఎద్దేవా చేశారు మంత్రి అమర్నాథ్. పొత్తుల తెరపైకి ఇప్పుడు మూడో కృష్ణుడిని తెచ్చారని చెప్పారు. బీజేపీ, వైసీపీ మధ్య సంబంధాలున్నాయని ఇన్నాళ్లూ ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేసిన చంద్రబాబు.. ఇప్పుడేం సమాధానం చెబుతారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు తప్ప అక్రమ రాజకీయ సంబంధాలు తమ పార్టీకి అవసరం లేదన్నారు. తెరవెనుక మిత్రులు ఎవరో ఇప్పుడు తేలిపోయిందని చెప్పారు. ప్రత్యక్షంగా బీజేపీతో, పరోక్షంగా కాంగ్రెస్ తో చంద్రబాబు సంబంధాలు కొనసాగించడం చూస్తేనే వారి ఓటమి భయం అర్థమవుతోందని చెప్పారు మంత్రి గుడివాడ అమర్నాథ్.

First Published:  9 March 2024 2:58 PM GMT
Next Story