Telugu Global
Andhra Pradesh

రూ.200, రూ.500 నోట్లు రద్దు చేయాలి -చంద్రబాబు

ఈసారి కూడా క్యాష్ పార్టీలకే సీట్లు ఇచ్చానని పరోక్షంగా ఒప్పుకున్నారు చంద్రబాబు. పార్టీ పరంగానే కాకుండా సొంతంగా ఓట్లు వేయించుకోగలిగే అభ్యర్థులను ఎంచుకున్నామని చెప్పారు.

రూ.200, రూ.500 నోట్లు రద్దు చేయాలి -చంద్రబాబు
X

చంద్రబాబు మళ్లీ పాత స్టైల్ లోకి వచ్చేశారు. దేశాభివృద్ధికోసం అమూల్యమైన సూచనలు చేస్తున్నారు. పెద్దనోట్ల రద్దు తర్వాత ఆ ఐడియా ఇచ్చింది తానేనంటూ టముకు వేసుకున్న బాబు, మళ్లీ ఇప్పుడు రద్దు గురించి మాట్లాడారు. ఈసారి రూ.500, రూ.200 నోట్లు కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలతో జరిగిన మీటింగ్ లో.. సంబంధం లేకుండా ఇలా పెద్దనోట్ల రద్దు గురించి మాట్లాడి షాకిచ్చారు చంద్రబాబు.

వైసీపీ లాంటి పార్టీలను కట్టడి చేయాలంటే డిజిటల్ కరెన్సీ రావాలన్నారు చంద్రబాబు. ఇప్పుడున్న పెద్ద నోట్లు రద్దు కావాలనేదే తన ఆలోచన అని, ప్రధాని మోదీ అడుగులు కూడా అలాగే పడుతున్నాయని చెప్పారు. జగన్ రాజకీయాన్ని వ్యాపారం చేశారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో అన్నీ ఫేక్ వార్తలేనని ఎద్దేవా చేశారు. బీజేపీ అధ్యక్షురాలు రాజీనామా చేశారంటూ ఫేక్ లెటర్ పెట్టి ప్రచారం చేశారని, ఇది తాత్కాలిక పొత్తు అని తన పేరుతో ఫేక్ లెటర్లు వదిలారని చెప్పుకొచ్చారు. పురందేశ్వరి తన కుటుంబ సభ్యురాలే అయినా, ఆమె ముప్పై ఏళ్లకు పైగా వేరే పార్టీల్లో ఉన్నారని చెప్పారు. పురందేశ్వరి, పవన్ పై తప్పుడు వార్తలు రాస్తున్నారని అన్నారు బాబు.

త్యాగమూర్తులకు వందనం..

మూడు లిస్ట్ లతో సొంత పార్టీ నేతలకు ముప్పై షాకుల్చిచన చంద్రబాబు.. త్యాగమూర్తులకు వందనం అన్నారు. కొంతమందికి తాను సీట్లు ఇవ్వలేకపోయానని, కానీ వారు చేసిన త్యాగాన్ని తాను మరువలేనని అన్నారు. ఏపీలో సంప్రదాయ రాజకీయాలు ఉండి ఉంటే, తాను కూడా ట్రెడిషనల్ పాలిటిక్స్ చేసేవాడినని, కానీ ఇప్పుడా పరిస్థితులు లేవన్నారు. ఓటు చీలకూడదని సంకల్పం తీసుకునే కూటమి కట్టామన్నారు బాబు. పొత్తుల వల్ల కొందరికి టిక్కెట్లు ఇవ్వలేకపోయామని, మూడు పార్టీల్లోనూ సీట్లు త్యాగం చేసినవాళ్లు ఉన్నారని, టీడీపీ విషయానికొస్తే పార్టీకోసం పని చేసిన 31 మంది నేతలకు టిక్కెట్లు ఇవ్వలేకపోయానని చెప్పారు.

క్యాష్ పార్టీలకే సీట్లు..

ఈసారి కూడా క్యాష్ పార్టీలకే సీట్లు ఇచ్చానని పరోక్షంగా ఒప్పుకున్నారు చంద్రబాబు. పార్టీ పరంగానే కాకుండా సొంతంగా ఓట్లు వేయించుకోగలిగే అభ్యర్థులను ఎంచుకున్నామని చెప్పారు. సోషల్ ఇంజనీరింగ్ చేపట్టామని, ఇక సోషల్ రీ-ఇంజనీరింగ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాలను ఇంకా ప్రక్షాళన చేయగలిగితే.. మరింత మంది మంచి వారు ఈ రంగంలోకి వస్తారన్నారు చంద్రబాబు.

First Published:  23 March 2024 9:02 AM GMT
Next Story