Telugu Global
Andhra Pradesh

ఇంటింటికీ స్టిక్కర్ అతికించి ఒట్టు వేయించుకుంటారు జాగ్రత్త..

రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఇప్పుడు ఇంటింటికీ వచ్చి స్టిక్కర్లు వేస్తానంటే చూస్తూ ఊరుకోవద్దన్నారు. ఉదయాన్నే లేచి ఆయన మొహం చూడాలా అని ప్రశ్నించారు.

ఇంటింటికీ స్టిక్కర్ అతికించి ఒట్టు వేయించుకుంటారు జాగ్రత్త..
X

ఓవైపు నారా లోకేష్ యువగళం అంటూ పాదయాత్ర చేస్తున్నా, మరోవైపు చంద్రబాబు ఇందేం ఖర్మ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటన మొదలు పెట్టిన ఆయన.. సీఎం జగన్ పై మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సైకో పాలన పోవాలన్నారు. జగన్ కి సైకో అనే పదం కూడా సరిపోవడం లేదని, అంతకు మించి పెద్ద పదం కనిపెట్టాలన్నారు. మరోసారి జగన్ మాయలో పడి ఫ్యాన్ కి ఓటేస్తే, ఆ ఫ్యాన్ కే ప్రజలు ఉరేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఒక్క ఛాన్స్ అంటూ విచ్చలవిడి అవినీతితో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని అన్నారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీకీ నాలుగుసార్లు ఫౌండేషన్ వేశారంటూ ఎద్దేవా చేశారు. అదే ఆయన చేసిన ఘనకార్యం అన్నారు.


ఊసరవెల్లి సిగ్గుపడుతుంది..

రాజధానిపై జగన్ మాటలు వింటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుందని విమర్శించారు చంద్రబాబు. అమరావతికి పూర్తి స్థాయి మద్దతు ప్రకటించి, అక్కడే ఇల్లు కట్టుకున్నానని చెప్పిన జగన్, అధికారంలోకి వచ్చాక మాట మార్చేశారని, మూడు రాజధానులు అన్నారని, తీరా ఇప్పుడు మరోసారి మాట మార్చి విశాఖే రాజధాని అంటున్నారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ఓటుకు పదివేలు ఇచ్చేందుకు సైతం జగన్ వెనకాడబోరని చెప్పారు.

ముందస్తు ముచ్చట..

తొందరగా ఎన్నికలు పెడితే తానే నెగ్గేస్తాననే భ్రమలో జగన్ ఉన్నారని, అందుకే ఆయన ముందస్తుకి సిద్ధమయ్యారని జోస్యం చెప్పారు చంద్రబాబు. ‘ఎన్నికలకు నేను రెడీ.. 5 కోట్ల మంది ప్రజలూ రెడీ’ అన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఇప్పుడు ఇంటింటికీ వచ్చి స్టిక్కర్లు వేస్తానంటే చూస్తూ ఊరుకోవద్దన్నారు. ఉదయాన్నే లేచి ఆయన మొహం చూడాలా అని ప్రశ్నించారు. తాత, ముత్తాతలనుంచి వచ్చిన భూమిపై జగన్‌ ఫోటో వేస్తున్నారని, జనం ఆస్తిపై ఆయన ఫొటో ఏంటని ప్రశ్నించారు. పొద్దున లేచి ప్రజలు తమ ఇంట్లో పాస్‌ పుస్తకంపై ఉన్న జగన్ మొహం చూడాలా..? అన్నారు. వైఎస్ వివేకానందరెడ్డిని చంపింది తానేనంటూ నారాసుర రక్త చరిత్ర అని తప్పుడు ప్రచారం చేశారని, ఇప్పుడు బాబాయ్ ని ఎవరు చంపారో అందరికీ తెలిసింది కదా! అన్నారు. గృహసారథులు ఇంటింటికీ వచ్చి జగన్ కే ఓటు వేయాలంటూ అందరితో ఒట్టు వేయించుకుంటారని, వారితో జాగ్రత్తగా ఉండాలన్నారు చంద్రబాబు.

First Published:  16 Feb 2023 1:11 AM GMT
Next Story