Telugu Global
Andhra Pradesh

రోడ్ షో లో బాలయ్య డైలాగులు చెబుతున్న చంద్రబాబు

టీడీపీ అన్ స్టాపబుల్ అని, రాష్ట్ర భవిష్యత్తుకోసం బుల్లెట్ లా దూసుకుపోదామా అంటూ హుషారెత్తించారు. పదే పదే ఎన్టీఆర్ ప్రస్తావన తెస్తూ, ఆయన యుగపురుషుడంటూ కొనియాడారు. సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీఆర్ అని గుర్తు చేశారు.

రోడ్ షో లో బాలయ్య డైలాగులు చెబుతున్న చంద్రబాబు
X

"సమయం లేదు మిత్రమా. రణమా, శరణమా" అంటూ బాలకృష్ణ సినిమా డైలాగ్ లు చెప్పి కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు చంద్రబాబు. నెల్లూరు జిల్లాలోని కోవూరుతో ఆయన 3 రోజుల పర్యటన ముగిసింది. సైకో, సైకిల్ అంటూ పడికట్టు పదాలనే వల్లె వేసినా, ఈసారి సినిమా డైలాగులపై ఆసక్తి చూపించారు చంద్రబాబు. టీడీపీ అన్ స్టాపబుల్ అని, రాష్ట్ర భవిష్యత్తుకోసం బుల్లెట్ లా దూసుకుపోదామా అంటూ హుషారెత్తించారు. పదే పదే ఎన్టీఆర్ ప్రస్తావన తెస్తూ, ఆయన యుగపురుషుడంటూ కొనియాడారు. సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీఆర్ అని గుర్తు చేశారు.

కందుకూరు దుర్ఘటన తర్వాత చంద్రబాబు నెల్లూరు జిల్లా యాత్ర కొనసాగుతుందా లేదా అనే అనుమానాలు వెంటాడాయి. ఒకవేళ ఆయన ముందుకెళ్లినా జనం ఆసక్తి చూపిస్తారా లేదా అనే సందేహాలు కూడా బయటకొచ్చాయి. కానీ చంద్రబాబు మాత్రం మూడు నియోజకవర్గాల్లో పర్యటన ముగించుకున్నారు. ఇరుకు సందుల్లో సభలు పెడుతున్నారని, చుట్టూ బ్యానర్లు పెట్టి మధ్యలో జనాల్ని తోలారని, డ్రోన్ షాట్లకోసం జనాల్ని ఇబ్బంది పెట్టారని.. వైసీపీ విమర్శలు చేస్తున్నా కూడా చంద్రబాబు రోడ్ షో లలో ఎలాంటి మార్పులేదు, కాకపోతే కాస్త పోలీస్ బందోబస్తు పెరిగిందంతే.

రాష్ట్రంలో ఏ ఒక్కరూ ప్రశాంతంగా లేరని, అందుకే ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటూ తాను ఈ ప్రచారం చేపట్టానని అన్నారు చంద్రబాబు. నేనేమైనా తొందర పడ్డానా తమ్ముళ్లూ అని ప్రశ్నించారు. ఆవు చేలో మేస్తుంటే, వైసీపీ ఎమ్మెల్యేలు గట్టున ఎందుకు మేస్తారని చెప్పారు. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ అడిగే సరికి ప్రజలు మోసపోయారని, ఇప్పుడు వారి నెత్తినే భస్మాసుర హస్తం పెట్టబోతున్నాడని విమర్శించారు. ప్రజలు తిరగబడాలని, ప్రజల తరపున తాను పోరాటం చేస్తానన్నారు.

సామాజిక పెన్షన్లను ప్రవేశ పెట్టిన ఘనత ఎన్టీఆర్ దేనన్నారు చంద్రబాబు, ఆ తర్వాత తన హయాంలో పెన్షన్లను గణనీయంగా పెంచామని, ఇప్పుడు జగన్ పెంపు పేరుతో పెన్షన్ల కోత పెట్టారని విమర్శించారు. ప్రశ్నించినవారందర్నీ జైలుకి పంపుతున్నారని అన్నారు. దగదర్తి విమానాశ్రయ భూములను పరిశీలించిన చంద్రబాబు.. వైసీపీ అధికారంలోకి రావడంతో ఇక్కడ విమానాశ్రయం ఆగిపోయిందని చెప్పారు. రామాయపట్నం పోర్టు రద్దు చేశారని, దగదర్తి నుంచి విమానాశ్రయాన్ని తెట్టుకు మార్చాలని చూస్తున్నారని అన్నారు. చెన్నై, తిరుపతితో పాటు దగదర్తిలో విమానాశ్రయాన్ని నిర్మించి, ఈ ప్రాంతాలన్నిటినీ తాను ఇండస్ట్రియల్‌ హబ్‌ గా అభివృద్ధి చేయాలనున్నానని, కానీ జగన్ నాశనం చేస్తున్నారని విమర్శించారు.

First Published:  31 Dec 2022 1:43 AM GMT
Next Story