Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు టీకొట్టు ప్రచారం

అప్పికట్ల‌లో మాత్రం తనంతట తానుగా వెహికల్ ను ఆపించి మరీ టీకొట్టు దగ్గరకు వెళ్ళి టీ తాగారు. మామూలుగా అయితే చంద్రబాబు స్వభావానికి విరుద్ధమిది. టీ కొట్టు దగ్గర మహిళలు చెప్పింది సాంతం విన్నారు.

చంద్రబాబు టీకొట్టు ప్రచారం
X

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు కొత్త తరహా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. చాయ్ పే చర్చా అనే పద్దతిలో కొద్దిసేపు ఒక టీకొట్టు దగ్గర గడిపారు. ఇంతకీ విషయం ఏమిటంటే 'ఇదేం ఖర్మ.. రాష్ట్రానికి' అనే కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగానే శుక్రవారం బాపట్ల నియోజకవర్గంలోని అప్పికట్లలో పర్యటించారు. అప్పికట్లలో వెళ్తుండగా మధ్యలో తన వాహనాన్ని ఆపించారు.

తన వాహనంలో నుండి దిగిన చంద్రబాబు ఎదురుగా కనిపించిన టీకొట్టు దగ్గరకు వెళ్ళారు. అక్కడున్న మహిళలతోను చిన్నపిల్లాడితోను మాట్లాడారు. ఇంతలో ఒక మహిళ టీ పెట్టి తీసుకొచ్చారు. ఆమె తెచ్చిన టీ కప్పుని చంద్రబాబు తీసుకుని తాగారు. ఆ టీ కొట్టుదగ్గరే ఉన్న బల్లపైన కూర్చుని పిల్లాడితో కాసేపు మాట్లాడారు. ఇదంతా చూసేవాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే చంద్రబాబుకు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న విషయం తెలిసిందే. తొందరగా జనాల్లోకి వెళ్ళటం కష్టమే.

అయితే అప్పికట్ల‌లో మాత్రం తనంతట తానుగా వెహికల్ ను ఆపించి మరీ టీకొట్టు దగ్గరకు వెళ్ళి టీ తాగారు. మామూలుగా అయితే చంద్రబాబు స్వభావానికి విరుద్ధమిది. టీ కొట్టు దగ్గర మహిళలు చెప్పింది సాంతం విన్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే ఎదుటివాళ్ళు చెప్పేది వినే అలవాటు చంద్రబాబుకు లేదు. మొదటినుండి ఆయన స్వభావం ఏమిటంటే తాను చెప్పేదే ఎదుటివాళ్ళు వినాలంతే. తాను చెప్పదలచుకున్నది చెప్పేసి ఏదో ముక్తసరిగా విన్నట్లు విని వెళిపోతారు.

కానీ, ఇప్పుడు మాత్రం మహిళలు చెప్పింది విన్నారు. అలాగే మహిళ పెట్టిచ్చిన టీ తాగటం కూడా చూసిన జనాలకు కొత్తగానే ఉంది. ఎందుకంటే చంద్రబాబు బయట కనీసం మంచినీళ్ళు కూడా ముట్టుకోరు. అలాంటిది కొట్టు దగ్గర టీ తాగారంటే అదంతా రాజకీయ వ్యూహకర్త రాబిన్ శర్మ డైరెక్షన్ అనే అనుకోవాలి. డైరెక్షన్ ఎవరిదైనా కొత్త తరహా ప్రయోగం చంద్రబాబుకు ఎంతవరకు లాభిస్తుందన్నది చూడాల్సిందే.

First Published:  10 Dec 2022 4:19 AM GMT
Next Story