Telugu Global
Andhra Pradesh

నిధులాపేసి కేంద్రం షాకిచ్చిందా?

తమ నిధులతో పథకాలు రన్ చేస్తు పేర్లు మాత్రం జగన్, వైఎస్సార్ అని పెట్టడం ఏమిటని కేంద్రం మండిపోయింది. దాంతో రూ. 5300 కోట్లు నిలిపేసిందట.

నిధులాపేసి కేంద్రం షాకిచ్చిందా?
X

వైసీపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం షాకిచ్చిందా? అవుననే అంటోంది ఎల్లో మీడియా. కారణం ఏమిటంటే కేంద్ర పథకాలకు జగన్మోహన్ రెడ్డి తమ పేర్లు పెట్టుకుంటున్నారని కేంద్రానికి బాగా మండిపోయిందట. చాలా పథకాలకు జగన్ అని లేదా వైఎస్సార్ అని ప్రభుత్వం పేర్లు పెడుతోంది. అయితే ఆ పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే నడుస్తోందట. అందుకనే తమ నిధులతో పథకాలు రన్ చేస్తు పేర్లు మాత్రం జగన్, వైఎస్సార్ అని పెట్టడం ఏమిటని కేంద్రం మండిపోయింది. దాంతో రూ. 5300 కోట్లు నిలిపేసిందట.

ఇదే విషయంలో గతంలో కూడా చాలాసార్లు కేంద్రం అభ్యంతరం చెప్పినా జగన్ పట్టించుకోలేదట. అందుకనే ఇప్పుడు సడెన్‌గా నిధుల విడుదలను ఆపేసింది. ఇప్పుడు రాష్ట్రంలో అమలవుతున్న 20 పథకాలకు జగన్ పేరు, మరో 55 పథకాలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పేరు పెట్టారట. కేంద్రం నిధులతో నడుస్తున్న పథకాలకు కేంద్రం పేర్లు ఉండేట్లుగా చూడాలని గతంలో కొందరు కేంద్రమంత్రులు కూడా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చాలా రాష్ట్రాల్లో ఇదే విషయమై రాష్ట్ర-కేంద్ర ప్రభుత్వాల మధ్య పెద్ద వివాదాలు నడుస్తున్నాయి. ఇప్పుడు జగన్ ప్రభుత్వమే కాదు గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే జరిగింది. కేంద్రం విడుదల చేసిన నిధులకు కూడా చంద్రబాబు తన పేరు పెట్టుకున్న ఉదాహరణలు చాలానే ఉన్నాయి. అప్పుడు కూడా కేంద్రం చాలాసార్లు అభ్యంతరాలు చెప్పింది. అయినా చంద్రబాబు పట్టించుకోలేదు.

విషయం ఏమిటంటే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఫిట్టింగ్ రిప్లై ఇస్తుంటాయి. ఎలాగంటే అసలు కేంద్రానికంటు ప్రత్యేకంగా నిధులుండవు. వివిధ రూపాల్లో రాష్ట్రాల నుండే కేంద్రానికి పన్నుల రూపంలో నిధులు వెళుతుంటాయి. ఆ నిధుల్లోనే మళ్ళీ కోతలు వేసి కేంద్రం రాష్ట్రానికి నిధులను పంపుతుంటుంది. రాష్ట్రప్రభుత్వాలేమో తమకు రావాల్సిన నిధులనే కేంద్రం తమకు పంపుతోంది కాని అదనంగా ఏమీ పంపటంలేదని వాదిస్తున్నాయి. ఈ వివాదం ఇలా ఎప్పటికీ నడుస్తునే ఉంటుంది. చంద్రబాబు హయాంలో వివాదాన్ని పట్టించుకోని ఎల్లోమీడియా ఇప్పుడు మాత్రం కేంద్రం నిధులు ఆపేసిందని బ్యానర్ కథనాలు ఇచ్చిందంతే.


First Published:  7 Nov 2023 5:03 AM GMT
Next Story